Rythu Bandhu: తెలంగాణలో కొత్తగా 2.22 లక్షల మందికి రైతు బంధు
Rythu Bandhu: రైతుబంధు పథకానికి కొత్తగా అర్హులైన రైతుల సంఖ్య 2.22 లక్షలు ఉన్నట్లు తేలింది.
Rythu Bandhu: దేశంలో తొలిసారిగా రైతులకు నగదు సాయం పథకం ప్రారంభించిన కేసీఆర్.. ఆ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. రైతుబంధు పథకాన్ని ఏకంగా కేంద్రమే అనుసరించి.. దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది. ఆ తర్వాత జగన్ ఏపీలో రైతుభరోసా అమలులోకి తెచ్చారు. ప్రతి ఏడాది లబ్దిదారుల సంఖ్య పెరుగుతున్నా కూడా ఎక్కడా వెనక్కు తగ్గకుండా రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నారు కేసీఆర్. దీని వలన తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తి భారీగా పెరిగిందని లెక్కలు చెబుతున్నాయి.
ప్రస్తుతం వర్షాకాలంలో రైతుబంధు పథకానికి కొత్తగా అర్హులైన రైతుల సంఖ్య 2.22 లక్షలు ఉన్నట్లు తేలింది. రెవెన్యూ శాఖలో భూ రికార్డుల ప్రకారం.. గత యాసంగిలో 59.33 లోల మందికి ఈ పథకం సొమ్ము అందింది. కొత్తగా 2.22 లక్షల మంది రైతులకు చేరుతున్నందున ఈ మొత్తం అందుకునే వారి సంఖ్య 61.55 లక్షలు ఉంటుందని ప్రాథమిక అంచనా. ఈ నెల 10 వరకూ భూములను కొన్న రైతులను పథకంలో నమోదు చేయాల్సి ఉంది. ఈనెల 10వ తేదీ వరకు మొత్తం 2.22 లక్షల మంది రైతులను పార్ట్ బీ నుంచి పార్ట్- ఏ ఖాతాల్లోకి మార్చినట్లు రెవెన్యూశాఖ అధికారులు వెల్లడించారు.
వీరి పేర్లకు వారి బ్యాంకు అకౌంట్ నెంబర్, ఇతర వివరాలు పరిశీలించి రైతుబంధు పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే ఆధార్ అనుసంధానం, ఎన్‌ఆర్‌ఐ కేసులు, ఏజన్సీ భూ సమస్యలు, ఫిర్యాదుల ద్వారా వచ్చినవి, పాసు పుస్తకాలు లేకుండా వారసత్వ బదిలీ, కోర్టు కేసుల్లో ఉన్నవి, పెండింగ్ మ్యుటేషన్‌లకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.