Sushil Kumar: స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ పై రెడ్ కార్నర్ నోటీసులు జారీ
Wrestler Sushil Kumar: సుశీల్ కుమార్ అతని స్నేహితులపై పోలీసులు ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు.
Wrestler Sushil Kumar: ఢిల్లీలోని చత్రాసాల్ స్టేడియంలో మే4న జరిగిన ఘర్షణలో యువ రెజ్లర్ సాగర్ ధంకర్(23) మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణకు మూల కారణం స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ అనే విషయం తెలిసిందే. సాగర్, అతడి స్నేహితులపై హాకీ, బేస్‌బాల్ బ్యాట్లతో సుశీల్ స్వయంగా దాడి చేసినట్లు ఒక వీడియోలో స్పష్టంగా ఆధారాలు దొరికాయి. దీంతో సుశీల్‌పై మర్డర్ కేసు నమోదయ్యింది. హత్య జరిగిన నాటి నుంచి సుశీల్ కుమార్ పోలీసులకు కనిపించకుండా తప్పించుకొని వెళ్లాడు. అతడితో పాటు అతని స్నేహితులపై పోలీసులు ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు.
అతడి కోసం 20 బృందాలుగా విడిపోయిన 50 మంది ఢిల్లీ పోలీసులు గాలిస్తున్నారు. కాగా సుశీల్ కుమార్‌తో పాటు మరో ఆరుగురిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని ఢిల్లీ పోలీసులు కోర్టుకు దరఖాస్తు చేశారు. దీంతో వారిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ ఢిల్లీ కోర్టు శనివారం ఉత్తర్వులు అందించింది.
అయితే గత 12 రోజులుగా కనిపించకుండా పోయిన సుశీల్ కుమార్ అసలు ఎక్కడ తలదాచుకున్నాడనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. అతడికి బయటి నుంచి ఎవరైనా సహాయం చేస్తున్నారా? రాజకీయ నాయకుల అండ ఏమైనా ఉన్నదా అనే దానిపై ఆరా తీస్తున్నారు. కాగా సుశీల్ కుమార్ ఫోన్ కూడా ప్రస్తుతం స్విచ్చాఫ్ వస్తున్నది.సుశీల్ కుమార్ ఇళ్లు, అతడి బంధువులు, స్నేహితుల ఇళ్లలో కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు. అయినా ఎలాంటి ప్రయోజం లేకపోయింది. సుశీల్ కుమార్ హరిద్వార్ లోని ప్రముఖ యోగా గురువుకు చెందిన ఆశ్రమంలో తలదాచుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
మరోవైపు సుశీల్ కుమార్‌కు అనుచరుడిగా పేరున్న అజయ్ అనే వ్యక్తి ప్రస్తుతం ఢిల్లీలోని ప్రభుత్వ వ్యాయామ విద్య ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అతను కూడా ఘటన జరిగిన నాటి నుంచి పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. దీంతో అజయ్‌పై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులు ఢిల్లీ ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు.
తన కుమారుడు గత ఎనిమిదేళ్లుగా చత్రాసాల్ స్టేడియంలో శిక్షణ పొందుతున్నాడని, సుశీల్ కుమార్ ను గురువుగా భావించే వాడని సాగర్ తండ్రి అశోక్ అన్నారు. అతడిని ఎందుకు హత్య చేశారో అర్థం కావడంలేదు. గురువుగా భావిస్తే పొట్టన పెట్టుకున్నాడని అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు.