IPL 2025 Auction: అప్పుడు రూ.20 లక్షలు.. ఇప్పుడు 4.8 కోట్లు! ఈ 18 ఏళ్ల స్పిన్నర్‌కు జాక్‌పాట్
IPL 2025 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలంలో అఫ్గానిస్థాన్ యువ స్పిన్నర్ అల్లా గజన్‌ఫర్‌కు జాక్‌పాట్ తగిలింది.
IPL 2025 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలంలో అఫ్గానిస్థాన్ యువ స్పిన్నర్ అల్లా గజన్‌ఫర్‌కు జాక్‌పాట్ తగిలింది. 18 ఏళ్ల ఈ మిస్టర్ స్పిన్నర్‌ను రూ.4.8 కోట్లకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. రూ. రూ.75 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన గజన్‌ఫర్ కోసం ముందుగా కోల్‌కతా నైట్ రైడర్స్ బిడ్ వేయగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ పోటీలోకి వచ్చాయి. గజన్‌ఫర్ కోసం మూడు టీమ్స్ తగ్గేదెలా అన్నట్టు పోటీపడ్డాయి. చివరకు బెంగళూరు, కోల్‌కతా పోటీ నుంచి తప్పుకోవడంతో.. ముంబై అతడిని కైవసం చేసుకుంది.
ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు అల్లా గజన్‌ఫర్ ప్రాతినిథ్యం వహించాడు. అతడి కనీస ధర రూ.20 లక్షలతో కోల్‌కతా కుదుర్చుకుంది. అయితే గజన్‌ఫర్‌కు ఒక్క మ్యాచులో కూడా ఆడే అవకాశం రాలేదు. ఇటీవలి కాలంలో అద్భుత ప్రదర్శన చేయడంతో అతడికి జాక్‌పాట్ తగిలింది. ఈసారి అతడు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఆడనున్నాడు. కర్ణ్ శర్మ తర్వాత ముంబై ఇండియన్స్ క్యాంపులో రెండవ స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా గజన్‌ఫర్ ఉన్నాడు. గత సీజన్‌లో తీసుకున్న రూ.20 లక్షలతో పోలిస్తే.. ఈసారి రూ.4.6 కోట్లు అదనంగా దక్కాయి. భారీ ధర పలకడంతో గజన్‌ఫర్ ఆనందం వ్యక్తం చేశాడు.
పాక్టియాలో జన్మించిన అల్లా గజన్‌ఫర్.. ఈ ఏడాది ఆరంభంలో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. గత నెలలో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో అతడు సంచలన ప్రదర్శన చేశాడు. షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన మొదటి వన్డేలో 6 వికెట్లు పడగొట్టి అఫ్గాన్‌కు అద్బుత విజయాన్ని అందించాడు. ఆ వన్డేలో అఫ్గాన్ 92 పరుగులతో గెలవగా.. 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును గెలుచుకున్నాడు. ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్‌లో కూడా అదరగొట్టాడు. టోర్నీలో నాలుగు మ్యాచ్‌లు ఆడిన గజన్‌ఫర్.. ఆరు వికెట్లు తీశాడు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌ల వికెట్లు తీశాడు.
అంతర్జాతీయ టీ20ల్లో ఇంకా అరంగేట్రం చెయని ఈ యువ స్పిన్నర్.. మొత్తంగా 16 టీ20లు ఆడి 6 కంటే తక్కువ ఎకానమీ రేటుతో 29 వికెట్లు పడగొట్టాడు. 8 అంతర్జాతీయ వన్డేలు ఆడి 4.36 ఎకానమీ రేటుతో 12 వికెట్లు తీశాడు. T10 లీగ్‌లో టీమ్ అబుదాబి, క్రికెట్ ష్పగీజా లీగ్‌లో మిస్ ఐనాక్ నైట్స్, లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీల్)లో కొలంబో స్ట్రైకర్స్ తరపున కూడా ఆడాడు. ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీలో కూడా అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయి.