Rishabh Pant: ప్రాణాలు కాపాడిన యువకులకు పంత్ ఏమిచ్చాడో తెలుసా?
Rishabh Pant: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.
Rishabh Pant: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. 2022 డిసెంబర్ 30 రాత్రి నూతన సంవత్సరం వేడుకలు కోసం తన బీఎండబ్ల్యూ కారులో ఢిల్లీ నుంచి స్వగ్రామం రూర్కీ బయల్దేరాడు. నిద్రమత్తులో జాతీయ రహదారిపై ఓ టర్నింగ్ వద్ద డివైడర్‌ను ఢీకొట్టాడు. వేగంగా దోసుకొచ్చిన కారు డివైడర్‌ను ఢీకొట్టిన అనంతరం పల్టీలు కొట్టింది. దాంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులోనే ఇరుక్కుపోయిన పంత్‌ను.. స్థానికులు రజత్ కుమార్, నిషు కుమార్ అనే ఇద్దరు కాపాడారు. కారు అద్దంను పగలగొట్టి పంత్‌ను బయటికి తీసి అంబులెన్స్‌కు ఫోన్ చేశారు.
రిషబ్ పంత్‌ను సరైన సమయంలో కారు నుంచి బయటికి తీయడం, అదే సమయంలో వైద్యం అందడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. మోకాలు, వీపు, తలకు గాయాలు కాగా.. వాటికి సర్జరీలు జరిగాయి. సుమారు 15 నెలల పాటు ఇంటికే పరిమితమయ్యాడు. అనంతరం ఎంతో శ్రమించి ఐపీఎల్ 2024లో పునరాగమనం చేశాడు. అసాధారణ ప్రదర్శనతో మునపటిలా సత్తా చాటుతున్నాడు. వెస్టిండీస్ గడ్డపై జరిగిన టీ20 ప్రపంచకప్ 2024లో కీలక ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆస్ట్రేలియాలో కూడా మెరుస్తున్నాడు. అయితే అప్పుడు తన ప్రాణాలు కాపాడిన రజత్, నిషులకు పంత్ చెరో స్కూటీని బహుమతిగా ఇచ్చాడు. ఇటీవల ఓ స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టర్ పంత్ యాక్సిడెంట్ సహా రీ ఎంట్రీపై వీడియో చేయగా.. అందులో ఈ విషయం బయటపడింది. వీడియోలో ఆ ఇద్దరు పంత్ గిప్ట్ ఇచ్చిన స్కూటీలపై వెళుతున్నారు. వాటిపై రిషబ్ పంత్ అని పేరు రాసుంది. ఇన్నిరోజులు ఈ విషయం ఎవరికీ తెలియరాలేదు. పంత్ కూడా ఎక్కడా చెప్పలేదు.
రిషబ్ పంత్ బీఎండబ్ల్యూ కారు కాలిపోతున్న సమయంలో రజత్ కుమార్, నిషు కుమార్ ఇద్దరు అందులోని వస్తువులు, డబ్బును బయటకు తీశారు. కారులో నుంచి తీసిన రూ.4 వేలను వారు పోలీసులకు అందించారు. నిజాయతీగా డబ్బు ఇచ్చిన ఆ యువకులపై అందరూ ప్రశంసలు గుప్పించారు. బీసీసీఐ కూడా వారిని ప్రత్యేకంగా సత్కరించింది. పంత్ భారత్ తరఫున 38 టెస్టులు, 31 వన్డేలు, 76 టీ 20లు ఆడాడు. మరోవైపు 111 ఐపీఎల్ మ్యాచులు ఆడాడు. ప్రస్తుతం అతడు ఐపీఎల్ 2025 వేలంలో ఉన్నాడు. ప్రాంఛైజీలు అతడిని కొనేందుకు ఆసక్తిగా ఉన్నాయి. బెంగళూరు, పంజాబ్ జట్లు పంత్‌ను కొనేందుకు భారీ మొత్తం వెచ్చించేందుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది. మరో కొన్ని గంటల్లో పంత్ ధర ఎంతో తేలిపోనుంది.