IPL 2025 Schedule: ఐపీఎల్ 2025 డేట్స్ వచ్చేశాయ్.. ఏకంగా మూడు సీజన్స్..!
IPL 2025 Schedule: క్రికెట్ అభిమానులకు శుభవార్త. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 తేదీలు ఖరారు అయ్యాయి.
IPL 2025 Schedule: క్రికెట్ అభిమానులకు శుభవార్త. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 తేదీలు ఖరారు అయ్యాయి. ఐపీఎల్ 2025 మార్చి 14న మొదలై.. మే 25న ముగుస్తుంది. గత సీజన్ తరహాలోనే 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. అలానే ఐపీఎల్ 2026, ఐపీఎల్ 2027 సీజన్లకు సంబంధించిన షెడ్యూల్ కూడా వచ్చింది. ఐపీఎల్ 2026 మార్చి 15-మే 31 మధ్య.. ఐపీఎల్ 2027 మార్చి 14-మే 30 మధ్య జరగనుంది. అయితే షెడ్యూల్‌పై అటు ఐపీఎల్ కమిటీ కానీ.. ఇటు బీసీసీఐ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఈరోజు ఉదయం నుంచి ఐపీఎల్ 2025 షెడ్యూల్ వచ్చిందని పలు క్రీడా ఛానల్స్ తమ కథనాల్లో రాసుకొచ్చాయి. మార్చి 14 నుంచి మే 25 వరకు ఐపీఎల్ 2025 సీజన్ జరుగుతుందని పేర్కొన్నాయి. ఐపీఎల్ కమిటీ షెడ్యూల్‌ను ప్రాంచైజీలు, బీసీసీఐకి మెయిల్ చేసినట్లు తెలుస్తోంది. ఆ సమాచారమే బయటికి లీక్ అయిందట. త్వరలోనే బీసీసీఐ అధికారికంగా షెడ్యూల్‌ను ప్రకటిస్తుందని తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో ఐపీఎల్ 2025 మెగా వేలం జరగనున్న నేపథ్యంలో ఈ న్యూస్ బయటికి రావడం ఆసక్తికరంగా మారింది.
ఇప్పటివరకు ఐపీఎల్ షెడ్యూల్‌లను బీసీసీఐ చివరి నిమిషంలో విడుదల చేసేది. ఆ ఆనవాయితీకి బీసీసీఐ స్వస్థి చెప్పనుందట. ఐపీఎల్ షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటించనుంది. అయితే ఒకేసారి మూడు సీజన్లకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించడానికి కారణం ఉందట. అంతర్జాతీయ షెడ్యూల్‌తో ఐపీఎల్ షెడ్యూల్ క్లాష్ కాకుండా.. ముందే బీసీసీఐ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ టోర్నీలో అంతర్జాతీయ క్రికెటర్లు అందరూ అందుబాటులో ఉండేలా బీసీసీఐ ప్లాన్ చేస్తుందట.
ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ 2025 మెగా వేలంకు అందుబాటులో ఉంటాడని సమాచారం. రానున్న మూడు సీజన్లకు అతడు అందుబాటులో ఉంటానని బీసీసీఐకి చెప్పాడట. రూ.2 కోట్ల బేస్‌ప్రైజ్‌తో తన పేరును నమోదు చేసుకున్నట్లు తెలుస్తుంది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో నవంబర్ 24, 25 తేదీల్లో వేలం జరగనుంది. భారత కాలమాన ప్రకారం.. మధ్యాహ్నం 3 గంటలకు వేలం ఆరంభం అవుతుంది. వేలానికి 1574 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోగా.. 574 మందిని బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసింది. ఇందులో 204 ప్లేయర్లను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి.
ఐపీఎల్ షెడ్యూల్:
ఐపీఎల్ 2025: మార్చి 14-మే 25
ఐపీఎల్ 2026: మార్చి 15-మే 31
ఐపీఎల్ 2027: మార్చి 14-మే 30