IND vs AUS: బుమ్రా 'కెప్టెన్' బౌలింగ్.. ఆస్ట్రేలియా స్కోర్ 67/7! తొలి రోజు భారత్‌దే

IND vs AUS: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజులో భారత్ పైచేయి సాధించింది.

Update: 2024-11-22 11:41 GMT

IND vs AUS: బుమ్రా 'కెప్టెన్' బౌలింగ్.. ఆస్ట్రేలియా స్కోర్ 67/7! తొలి రోజు భారత్‌దే

IND vs AUS: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజులో భారత్ పైచేయి సాధించింది. ముందుగా బ్యాటింగ్‌లో నిరాశపరిచినా.. బౌలింగ్‌లో అదరగొట్టి వావ్ అనిపించింది. జస్ప్రీత్ బుమ్రా 'కెప్టెన్' బౌలింగ్ చేయడంతో ఆసీస్ బ్యాటర్లు అల్లాడిపోయారు. 10 ఓవర్లలో 17 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ పడగొట్టాడు. తృటిలో హ్యాట్రిక్ మిస్ అయ్యాడు. మరోవైపు హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ రెండు వికెట్స్ తీయడంతో మొదటి రోజు ముగిసేసరికి ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 67 రన్స్ చేసింది. కమిన్స్ సేన ఇంకా 83 రన్స్ వెనకబడి ఉంది. కెరీ (19), స్టార్క్‌ (6) క్రీజులో ఉన్నారు.

ఈ టెస్టులో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 150 పరుగులకు ఆలౌట్ అయింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌కు ఇన్నింగ్స్ ఆరంభంలోనే షాక్‌ తగిలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ (0), దేవదత్‌ పడిక్కల్‌ (0)లు ఆసీస్ పదునైన బౌలింగ్‌ ముందు నిలవలేకపోయారు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (5) కుదురుకున్నట్లే కనిపించినా.. బౌన్సర్‌ను అర్థం చేసుకోలేక కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా కేఎల్ రాహల్ (26; 76 బంతుల్లో 3 ఫోర్లు) పరుగులు చేశాడు. అయితే థర్డ్ అంపైర్ వివాదాస్పద నిర్ణయంతో పెవిలియన్‌కు చేరాడు. ధ్రువ్ జురెల్ (11), వాషింగ్టన్ సుందర్ (4) నిరాశపర్చినా.. రిషబ్ పంత్ (37), నితీశ్‌ రెడ్డి (41)లు జట్టును ఆదుకున్నారు. పంత్ అనంతరం హర్షిత్ రాణా (7), బుమ్రా (8) త్వరగానే అవుట్ అయ్యారు. నితీశ్ చివరి వికెట్‌గా అవుట్ అయ్యాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హేజిల్ వుడ్ 4 వికెట్స్ పడగొట్టగా.. కమిన్స్, మార్ష్, స్టార్క్ తలో రెండు వికెట్స్ తీశారు.

ఆస్ట్రేలియాకు ఆదిలోనే షాక్ తగిలింది. యువ ఓపెనర్ మెక్‌స్వీనీ (10)ని బుమ్రా ఎల్బీగా అవుట్ చేశాడు. తొలుత అంపైర్‌ నాటౌట్‌ ఇవ్వగా.. భారత్ డీఆర్‌ఎస్ తీసుకుని సక్సెస్ అయింది. కాసేపటికే వరుస బంతుల్లో ఉస్మాన్‌ ఖావాజా (8), స్టీవ్‌ స్మిత్‌ (0)ను బుమ్రా అవుట్ చేశాడు. ఖవాజా క్యాచ్ ఇవ్వగా.. స్మిత్‌ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ట్రావిస్ హెడ్‌ (11)ను హర్షిత్ రాణా క్లీన్‌బౌల్డ్‌ చేయడంతో ఆసీస్ కష్టాల్లో పడింది. ఈ సమయంలో మార్నస్ లబుషేన్ క్రీజులో పాతుకుపోయాడు. పూర్తిగా డిఫెన్స్ ఆడాడు. మిచెల్ మార్ష్‌ (6) సిరాజ్ అవుట్ చేశాడు. లబుషేన్ (2) సిరాజ్‌ ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. అతడు 52 బంతుల్లో 2 రన్స్ చేయడం విశేషం. కాసేపటికే కమిన్స్ (3)ను బుమ్రా అవుట్ చేశాడు. కెరీ, స్టార్క్‌ క్రీజులో ఉన్నారు. రేపు ఉదయం త్వరగా ఆలౌట్ చేస్తే.. టీమిండియాకు ఆధిక్యం దక్కనుంది.

Tags:    

Similar News