Champions Trophy 2024: ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో భారత్‌.. టైటిల్ పోరులో చైనాతో ఢీ!

Update: 2024-11-19 16:14 GMT

India beats Japan in Semi final clash: మహిళల ఆసియా ఛాంపియన్స్‌ హాకీ ట్రోఫీ 2024 ఫైనల్‌కు భారత్ దూసుకెళ్లింది. మంగళవారం బీహార్‌లోని రాజ్‌గిర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన సెమీఫైనల్స్‌లో జపాన్‌ను 2-0తో భారత్ ఓడించింది. ఈ విజయంతో మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌లో వరుసగా రెండోసారి అడుగుపెట్టింది. బుధవారం జరిగే ఫైనల్‌లో డ్రాగన్‌ కంట్రీ చైనాతో భారత్‌ తలపడనుంది.

ఆసియా ఛాంపియన్స్‌ హాకీ ట్రోఫీ 2024లో భారత్ జట్టు అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. లీగ్‌ దశలో వరుస విజయాలు సాధించింది. సలీమా బృందం లీగ్‌ దశలో అయిదు మ్యాచ్‌లు గెలిచి అజేయంగా దూసుకెళ్లింది. షర్మిలా దేవి, దీపిక, సంగీత కుమారి, ప్రీతి దూబెలు సత్తాచాటారు. లీగ్ దశలో కనబర్చిన దూకుడునే సెమీ ఫైనల్‌లోనూ ప్రదర్శించింది.

తొలి మూడు క్వార్టర్స్‌లో భారత్‌, జపాన్ జట్లు నువ్వా నేనా అనేలా ఆడాయి. దాంతో ఇరు జట్లు ఒక్క గోల్‌ కూడా నమోదు చేయలేకపోయాయి. ఉత్కంఠగా సాగిన నాలుగో క్వార్టర్‌లో భారత మహిళలు 2 గోల్స్‌ వేశారు. 48వ నిమిషంలో వైస్‌ కెప్టెన్‌ నవీనీత్‌ కౌర్‌ మొదటి గోల్‌ చేశారు. 8 నిమిషాల తర్వాత 56వ నిమిషంలో లాల్‌రెమ్సియామి రెండో గోల్‌ చేసి భారత్ ఆధిక్యాన్ని రెట్టింపు చేసింది. జపాన్ గోల్ కీపర్ యు కుడో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌'గా ఎంపికయింది.

మంగళవారం ఉదయం జరిగిన మరో సెమీఫైనల్‌లో చైనా, మలేసియా జట్లు తలపడ్డాయి. ఇందులో 3-1 తేడాతో డ్రాగన్‌ దేశం చైనా విజయం సాధించింది. ఇక బుధవారం జరగబోయే ఫైనల్‌లో భారత్‌, చైనా మహిళా జట్లు తలపడనున్నాయి. లీగ్ దశలో చైనాను 3-0తో భారత్ ఓడించింది. ఆసియా ఛాంపియన్స్‌ హాకీ ట్రోఫీ 2024లో ఫామ్ మీదున్న భారత్ టైటిల్ గెలుస్తుందని అందరూ ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

Tags:    

Similar News