ICC T20I Rankings: సూర్యకుమార్‌నే వెనక్కినెట్టిన తెలుగోడు.. టీ20 కెరీర్‌లోనే మొదటిసారి..!

ICC T20I Rankings: టీమిండియా యువ బ్యాటర్, తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీ20 ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపాడు.

Update: 2024-11-20 11:26 GMT

ICC T20I Rankings: సూర్యకుమార్‌నే వెనక్కినెట్టిన తెలుగోడు.. టీ20 కెరీర్‌లోనే మొదటిసారి..!

ICC T20I Rankings: టీమిండియా యువ బ్యాటర్, తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీ20 ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపాడు. ఐసీసీ బుధవారం విడుదల చేసిన బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఏకంగా 69 స్థానాలు ఎగబాకి.. టాప్‌-10లోకి దూసుకొచ్చాడు. ప్రస్తుతం 806 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. తిలక్ వర్మ తన టీ20 కెరీర్‌లో టాప్‌-10లోకి రావడం ఇదే మొదటిసారి. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలు బాదడంతో ఈ హైదరాబాదీ కుర్రాడు టీ20 ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చాడు.

దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో తిలక్‌ వర్మ 198 స్ట్రైక్‌రేట్‌తో 280 రన్స్ చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. ప్రొటీస్ సిరీస్‌లోతిలక్ 20 సిక్సర్లు బాదడం విశేషం. మూడో స్థానంలో ఉన్న టీమిండియా టీ20 కెప్టెన్, మిస్టర్ 360 సూర్యకుమార్‌ యాదవ్‌ను తిలక్ వెనక్కి నెట్టాడు. తెలుగోడి దెబ్బకు సూర్య (788) నాలుగో స్థానానికి పడిపోయాడు. ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్‌ హెడ్ (855), ఇంగ్లండ్ హిట్టర్ ఫిల్ సాల్ట్ (828) మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇక దక్షిణాఫ్రికాపై రెండు శతకాలు బాదిన భారత్ కీపర్ సంజు శాంసన్ 17 స్థానాలు ఎగబాకి.. 22వ స్థానంలో నిలిచాడు. యశస్వి జైస్వాల్ 8, రుతురాజ్‌ గైక్వాడ్ 15వ స్థానంలో ఉన్నారు.

టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత్ నుంచి ఇద్దరు మాత్రమే టాప్‌-10లో ఉన్నారు. స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ ఒక స్థానం దిగజారి.. ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. పేసర్ అర్ష్‌దీప్ సింగ్ మూడు స్థానాలు మెరుగై.. టాప్‌-10లోకి వచ్చాడు. అర్ష్‌దీప్ 9వ స్థానంలో ఉన్నాడు. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా రెండు స్థానాలు ఎగబాకి తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. అక్షర్ పటేల్ 13వ స్థానంలో ఉన్నాడు. టీమిండియాపై 17 బంతుల్లోనే 54 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ 65 స్థానాలు దూసుకొచ్చి 14వ స్థానంలో నిలిచాడు. టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ అగ్ర స్థానంలో ఉంది. భారత్ ఖాతాలో 268 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి.

Tags:    

Similar News