Ind vs Aus 3rd Test: 5 వికెట్స్‌తో జస్ప్రిత్ బుమ్రా మాయ.. సెంచరీలతో చెలరేగిన ట్రావిస్, స్టీవ్ స్మిత్
Ind vs Aus 3rd Test Day 2 match Highlights: బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆటలో ఆసిస్ ఆటగాళ్లు చెలరేగిపోయారు. ట్రావిస్ హెడ్ కొట్టిన 152 పరుగుల సెంచరీ ఆస్ట్రేలియాను ఆధిక్యంలో నిలబెట్టింది. స్టీవ్ స్మిత్ కూడా సెంచరీతో ట్రావిస్ హెడ్‌కు మంచి పార్ట్‌నర్‌షిప్ అందించాడు. దీంతో మూడో వికెట్ నష్టపోయేటప్పటికీ 77 పరుగుల వద్ద ఉన్న స్కోర్‌ను 4వ వికెట్ నష్టపోయేటప్పటికి 326 పరుగులకు చేర్చారు.
జస్‌ప్రీత్ బుమ్రా 5 వికెట్లు తీసుకుని ఔరా అనిపించినప్పటికీ.. ఆసిస్ ఆటగాళ్ల స్కోర్ బోర్డ్ ముందు అది చిన్నబోయింది. బుమ్రా మొదట ఓపెనర్లు ఉస్మాన్ ఖ్వాజ, నాథన్ మెక్ స్వీనేల వికెట్స్ పడగొట్టాడు. అలాగే సెంచరీలతో ఊపు మీదున్న ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్‌ను కూడా పెవిలియన్‌కు చేర్చాడు. మిచెల్ మార్ష్ వికెట్‌తో కలిపి మొత్తం 5 వికెట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆలస్యంగా బ్యాటింగ్‌కు వచ్చిన అలెక్స్ కేరీ కూడా 44 పరుగులు బాదాడు. దాంతో ఆస్ట్రేలియా స్కోర్ బోర్డ్ 400 మార్క్ దాటి మొత్తం 7 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది.
ఆరంభంలోనే ఆసిస్ నడ్డి విరిచిన బుమ్రా
మ్యాచ్ ఆరంభంలోనే జస్‌ప్రీత్ బుమ్రా ఓపెనర్లు ఉస్మాన్ ఖ్వాజ, నాథన్ మెక్ స్వీనేల వికెట్స్ తీశాడు. ఆ వెంటనే నితీష్ కుమార్ రెడ్డి కూడా మార్నస్ వికెట్ తీయడంతో ఆస్ట్రేలియా జట్టు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి డిఫెన్స్‌లో పడింది. కానీ టీమిండియా ఫ్యాన్స్ ఎంజాయ్ చేయడానికి అదే లాస్ట్ మూమెంట్ అయింది. ఆ తరువాత ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ చెలరేగిపోయి స్కోర్ వేగం పెంచారు. బుమ్రా బౌలింగ్‌లోనే స్టీవ్ స్మిత్ రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అలాగే ట్రావిస్ హెడ్ కూడా బుమ్రా బౌలింగ్‌లోనే రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు.
1204 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్
1204 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ అనగానే అన్ని పరుగులు ఎప్పుడు చేశాడు, ఎలా చేశాడు అని షాక్ అవకండి. 2023 నుండి ఇప్పటి వరకు ఇండియాతో జరిగిన అన్ని క్రికెట్ మ్యాచ్‌ల్లో ట్రావిస్ హెడ్ చేసిన స్కోర్ మొత్తం 1204 పరుగులు.