IND vs AUS: చరిత్ర సృష్టించిన టీమిండియా ఓపెనర్లు.. 20 ఏళ్ల తర్వాత..!
IND vs AUS: రెండో ఇన్నింగ్స్‌లో క్లాస్ ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించారు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ అదరగొడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టును 104కు ఆలౌట్ చేసిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ దిశగా వెళుతోంది. రెండో రోజైన శనివారం ఆట ముగిసే సమయానికి ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 172 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (90; 193 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీకి చేరువ కాగా.. కేఎల్ రాహుల్ (62; 153 బంతుల్లో 4 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. ఆసీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్న టీమిండియా ఓపెనర్లు జట్టుకు గొప్ప ఆరంభం ఇచ్చారు. దాంతో భారత్ 218 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
రెండో ఇన్నింగ్స్‌లో క్లాస్ ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించారు. 20 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై భారత్ తరఫున 100 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 2004లో సిడ్నీ వేదికగా జరిగిన టెస్ట్‌లో వీరేందర్ సెహ్వాగ్, ఆకాశ్ చోప్రాలు 123 రన్స్ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం ఏ భారత ఓపెనింగ్ జోడీ ఆసీస్ గడ్డపై 100 పరుగులు చేయలేదు. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో 1986లో సునీల్ గవాస్కర్, కృష్ణమాచారి శ్రీకాంత్ ఓపెనింగ్ జోడీ 191 పరుగులు చేసింది. ఇప్పటివరకు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. రెండో అత్యుత్తమ భాగస్వామ్యం ఈరోజు పెర్త్ టెస్టులో నమోదైంది. మూడో రోజు రాహుల్-జైస్వాల్ కలిసి 20 రన్స్ చేస్తే అగ్ర స్థానానికి చేరుకుంటారు.
1981లో సునీల్ గవాస్కర్, చేతన్ చౌహాన్ జోడి తొలి వికెట్‌కు 165 రన్స్ చేసింది. 2004లో వీరేందర్ సెహ్వాగ్, ఆకాశ్ చోప్రా ద్వయం 141 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. 1948లో విను మన్కడ్, సర్వటే జోడి 124 పరుగులు చేసింది. 2004లో వీరేందర్ సెహ్వాగ్, ఆకాశ్ చోప్రా 123 పరుగులతో తర్వాతి స్థానంలో ఉన్నారు. ఇక 2000 సంవత్సరం నుంచి ఆస్ట్రేలియాలో 50 కంటే ఎక్కువ ఓవర్లు ఆడిన విదేశీ ఓపెనింగ్ జోడీగా జైస్వాల్, రాహుల్ మరో రికార్డు నెలకొల్పారు. ఈ ఇద్దరు కలిసి ఇప్పటివరకు 57 ఓవర్లు ఆడారు. ఇంగ్లండ్ మాజీ ఓపెనర్లు ఆండ్రూ స్ట్రాస్, అలిస్టర్ కుక్ 66.2 ఓవర్లు ఆడారు. రేపు ఈ రికార్డు బద్దలయ్యే అవకాశం ఉంది.