Yashasvi Jaiswal: యశస్వి జైస్వాల్ ప్రపంచ రికార్డు.. దిగ్గజాలకు కూడా సాధ్యం కాలేదు!

Yashasvi Jaiswal: పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అదరగొట్టాడు.

Update: 2024-11-23 16:08 GMT

Yashasvi Jaiswal

Yashasvi Jaiswal: పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయి నిరాశపరిచినా.. రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత నాక్ ఆడాడు. ఆస్ట్రేలియా బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో బయపెట్టినా.. పలుమార్లు కవ్వించినా సహనంతో క్రీజులో నిలిచాడు. ముందుగా క్రీజులో నిలదొక్కుకుని హాఫ్ సెంచరీ చేసిన జైస్వాల్.. ఆపై సెంచరీ దిశగా దూసుకెళ్లాడు. 193 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 90 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో ఓ ప్రపంచ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు.

టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా యశస్వి జైస్వాల్ నిలిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లైయన్ బౌలింగ్‌లో సిక్సర్‌ బాది.. ఈ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్యాలెండర్ ఇయర్‌లో జైస్వాల్ ఇప్పటివరకు 34 సిక్సులు బాదాడు. అంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ మాజీ ఓపెనర్ బ్రెండన్ మెక్‌కల్లమ్ పేరిట ఉంది. 2014లో అతడు 33 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో బెన్ స్టోక్స్ (26-2022), ఆడమ్ గిల్‌క్రిస్ట్ (22-2005), వీరేంద్ర సెహ్వాగ్ (22-2008) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఈ రేర్ రికార్డు దిగజాలు సచిన్ టెండ్యూల్కర్, ఎంఎస్ ధోనీలకు కూడా సాధ్యం కాలేదు. సిక్సులు ఎక్కువగా బాదే రోహిత్ శర్మ వల్ల కాలేదు.

ఐపీఎల్ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసిన యశస్వి జైస్వాల్.. కొద్దిరోజుల్లోనే భారత జట్టులో అరంగేట్రం చేశాడు. గతేడాది వెస్టిండీస్‌ పర్యటనలో యశస్వి అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. రోహిత్‌ శర్మకు ఓపెనింగ్‌ జోడీగా బరిలోకి దిగి అద్భుతంగా ఆడాడు. తొలి టెస్టులోనే 171 పరుగులతో సత్తాచాటాడు. అనంతరం అద్బుత ఇన్నింగ్స్‌తో అలరిస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో పది టెస్టుల్లోనే వెయ్యికి పైగా రన్స్ చేశాడు. ఇప్పటికి వరకు 14 టెస్టుల్లో 1400కు పైగా పరుగులు బాదాడు. టెస్టుల్లో మూడు శతకాలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 214. ఇక టెస్టుల్లో 35 సిక్సులు బాధగా.. అందులో 34 ఈ ఏడాదే బాదాడు. ఆస్ట్రేలియాతో ఇంకా టెస్టులు ఉన్న నేపథ్యంలో యశస్వి మరిన్ని సిక్సులు బాదే అవకాశం ఉంది.

Tags:    

Similar News