T20I International: అంతర్జాతీయ టీ20ల్లో అత్యల్ప స్కోర్.. 7 మంది డకౌట్, 7 పరుగులకే టీమ్ ఆలౌట్!
T20I International: టీ20 ప్రపంచకప్ 2026 ఆఫ్రికా సబ్ రీజియనల్ క్వాలిఫయర్ పోటీల్లో భాగంగా ఆదివారం నైజీరియాతో జరిగిన మ్యాచ్‌లో ఐవరీ కోస్ట్ 7 పరుగులకే కుప్పకూలింది.
T20I International: ప్రస్తుత రోజులో గల్లీ క్రికెట్‌లో కూడా భారీగా రన్స్ నమోదవుతుండగా.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ టీమ్ డబుల్ డిజిట్ కూడా అందుకోకుండా ఉంటుందని మీరు ఊహించారా?. కానీ.. అది జరిగింది. అంతర్జాతీయ టీ20ల్లో ఓ టీమ్ కేవలం 7 పరుగులకే ఆలౌట్ అయింది. టీ20 ప్రపంచకప్ 2026 ఆఫ్రికా సబ్ రీజియనల్ క్వాలిఫయర్ పోటీల్లో భాగంగా ఆదివారం నైజీరియాతో జరిగిన మ్యాచ్‌లో ఐవరీ కోస్ట్ 7 పరుగులకే కుప్పకూలింది. ఇదివరకు అంతర్జాతీయ టీ20ల్లో అత్యల్ప స్కోర్ 10.
ఐసిల్ ఆఫ్ మ్యాన్, మంగోలియా టీమ్స్ 10 పరుగులకే ఆలౌట్ అయ్యాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో సింగపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో మంగోలియా 10 పరుగులకే కుప్పకూలింది. గత ఏడాదిలో ఐల్ ఆఫ్ మ్యాన్ జట్టు స్పెయిన్‌పై 10 పరుగులు మాత్రమే చేసింది. జపాన్, హాంకాంగ్‌లపై మంగోలియా వరుసగా 12 మరియు 17 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే తక్కువ పరుగులకే ఆలౌట్ అవ్వడంలో మంగోలియా ముందుది. టాప్ 10 జాబితాలో ఏకంగా మూడుసార్లు ఉండడం విశేషం.
ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నైజీరియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 271 రన్స్ చేసింది. కీపర్ సెలిమ్ సలావ్ (112 రిటైర్డ్ ఔట్; 53 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లు) భారీ సెంచరీ చేశాడు. ఐసక్ ఓక్పే (65 నాటౌట్; 23 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లు), సులేమాన్ (50; 29 బంతుల్లో 8 ఫోర్లు) హాఫ్ సెంచరీలు బాదారు. ఐవరీ కోస్ట్ బౌలర్లలో పంబా దిమిత్రి, విల్‌ఫ్రైడ్ తలో వికెట్ పడగొట్టారు. భారీ లక్ష్య ఛేదనలో ఐవరీ కోస్ట్ 7.3 ఓవర్లలో 7 పరుగులకు ఆలౌటైంది. ఐవరీ కోస్ట్ ఇన్నింగ్స్‌లో ఏడుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. ముగ్గురు బ్యాటర్లు ఒక్కో పరుగు చేయగా.. ఓపెనర్ మొహమ్మద్ చేసిన నాలుగు పరుగులే టాప్ స్కోర్. ఐవరీ కోస్ట్ ఇన్నింగ్స్‌లో ఒక్క బౌండరీ కూడా లేదు. నైజీరియా ఏకంగా 264 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. పురుషుల టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో సింగిల్ డిజిట్ టీమ్ స్కోర్‌కి ఇది మొదటి ఉదాహరణ.