మొదటి రౌండ్ లోనే ఓటమి పాలైన పీవీ సింధు!
దాదాపు పదినెలల తరువాత జరుగుతున్న మొదటి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత్ క్రీడాకారులు విఫలం అయ్యారు.
దాదాపు పదినెలల తరువాత జరుగుతున్న మొదటి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత్ క్రీడాకారులు విఫలం అయ్యారు. ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు, సాయి ప్రణీత్ యోనెక్స్ థాయిలాండ్ ఓపెన్ సూపర్ 1000 టోర్నీలో తొలి రౌండ్‌లోనే ఇంటి బాట పట్టారు.
మహిళల సింగిల్స్ లో డెన్మార్క్ క్రీడాకారిణి మియా బ్లిక్ ఫీల్డ్ చేతిలో 21-16, 24-26, 13-21 తేడాతో ఓటమి పాలైంది పీవీ సింధు. ప్రత్యర్ధిపై మొదటి గేమ్ లో పై చేయి సాధించి ఊపు మీద కనిపించిన సింధు రెండో గేమ్ లో వెనుకంజలో పడింది. సింధు హోరా హోరీ పోరాడినా డెన్మార్క్ షట్లర్ చివరికి విజయం సాధించింది. ఇక మూడో గేమ్ లో బ్లిక్ ఫీల్డ్ ముందు సింధు నిలువలేకపోయింది. దీంతో భారే తేడాతో ఆ గేమ్ చేజార్చుకుని ఓటమి పాలైంది సింధు.
ఇక పురుషుల సింగిల్స్ లో భారత ఆటగాడు సాయి ప్రణీత్ థాయ్ ఆటగాడు వాంగ్ చరోయిన్ చేతిలో మొదటి రౌండ్ లోనే ఓడిపోయాడు. 16-21, 10-21 తేడాతో ఘోరంగా రెండు గేమ్ లలోనే ఓటమి పాలయ్యాడు. అయితే, మిక్స్‌డ్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్- అశ్విన్ పొన్నప్ప విజయకేతనం ఎగురవేశారు. 21-11, 27-29, 21-16 తేడాతో ప్రత్యర్థి జోడీని చిత్తుచేశారు.