ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా విజయం సాధించింది. వరుసగా రెండు వన్డేలో ఓడి వన్డే సిరీస్‌ను చేజార్చుకున్న టీమిండియా మూడో వన్డేలో గెలిచి పరువు నిలుపుకుంది. 13 పరుగులతో గెలిచి మూడు వన్డేల సిరీస్‌లో ఆసీస్ ఆధిక్యాన్ని 2-1కి పరిమితం చేయగలిగింది. చివరి వరకు పోరాడిన ఆసీస్ 49.3 ఓవర్లలో 289 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా నిర్దేశించిన 303 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా విఫలమైంది. టాప్ ఆర్డర్‌లో కెప్టెన్ ఫించ్ తప్ప మిగిలిన బ్యాట్స్‌మెన్స్ రాణించకపోవడం ఆస్ట్రేలియా ఓటమికి ప్రధాన కారణంగా చెప్పక తప్పదు. అంతకుముందు భారత్‌లో విరాట్ కోహ్లీ (63), హార్దిక్ పాండ్య (92*), రవీంద్ర జడేజా (66*) అద్భుతంగా ఆడారు.