సౌరభ్ గంగూలీ బీజేపీలో చేరనందుకే బీసీసీఐ పదవి ఇవ్వలేదంటూ విమర్శలు
*గంగూలీని అవమానించిందన్న టీఎంసీ
Sourav Ganguly: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు-బీసీసీఐ సారథిగా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీని మరో దఫా నియమించకపోవడంపై తృణముల్ కాంగ్రెస్-టీఎంసీ విమర్శలు గుప్పించింది. దాదా కమలం పార్టీలో చేరనందుకే ఆయనను అవమానించేందుకు యత్నిస్తోందంటూ టీఎంసీ మండిపడింది. కొద్ది నెలల క్రితం కేంద్ర మంత్రి అమిత్‌షా గంగూలీ ఇంటికి వెళ్లారని దాదాను పదే పదే పార్టీలో చేరాలని ఒత్తిడి చేసినట్టు ఆరోపించింది. దాదా అంగీకారం తెలపకపోవడంతోనే రాజకీయ ప్రతీకారానికి దిగినట్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అమిత్‌షా కుమారుడు జైషా రెండోసారి బీసీసీఐ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టొచ్చుగానీ గంగూలీ మాత్రం అధ్యక్ష పదవిని చేపట్టకూడదా? అంటూ టీఎంసీ నిలదీసింది.
అయితే టీఎంసీ విమర్శలను బీజేపీ శ్రేణులు ఖండించాయి. దాదాను తమ పార్టీలోకి చేర్చుకోవాలని ఎన్నడూ ప్రయత్నించలేదని స్పష్టం చేసింది. బీసీసీఐ మార్పులపై కొందరు మొసలి కన్నీరు కారుస్తున్నారని కమలనాథులు కౌంటర్ ఇచ్చారు. గతంలో గంగూలీని బీసీసీఐ అధ్యక్షుడు చేయడం వెనుక వారి పాత్ర ఏమీ లేదు కదా అంటూ మండిపడ్డారు. గంగూలీ విషయాన్ని రాజకీయం చేయడం మానుకోవాలని హితవుపలికారు. నిజానికి గతేడాది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీలో గంగూలీ చేరుతారని భారీగా ప్రచారం జరిగింది. అయితే దాదా మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటూ క్రికెట్‌కే ప్రధాన్యమిచ్చారు. గతంలో అమిత్‌షా తన ఇంటికి రావడానికి కారణం జైషాతో ఉన్న పరిచయమే కారణమని.. అప్పట్లో గంగూలీ వివరణ ఇచ్చారు.