ICC Rankings 2024: అగ్రస్థానంలో బుమ్రా.. రెండో ర్యాంక్‌లో యశస్వి!
ICC Rankings 2024: టెస్టు సిరీస్ ముందు టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒకటి నుంచి మూడో స్థానంకు పడిపోయాడు. పెర్త్ టెస్టులో 8 వికెట్స్ పడగొట్టడంతో మళ్లీ ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకుల్లో అగ్రస్థానానికి వచ్చాడు.
ICC Rankings 2024: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్టులో భారత అత్తగాళ్లు అదరగొట్టిన విషయం తెలిసిందే. పెర్త్ టెస్టులో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించడంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానానికి చేరుకుంది. తొలి టెస్టులో సత్తాచాటిన టీమిండియా ప్లేయర్స్.. తాజాగా విడుదలైన ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో ముందుకు దూసుకొచ్చారు. టెస్టు సిరీస్ ముందు టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒకటి నుంచి మూడో స్థానంకు పడిపోయాడు. పెర్త్ టెస్టులో 8 వికెట్స్ పడగొట్టడంతో మళ్లీ ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకుల్లో అగ్రస్థానానికి వచ్చాడు. ప్రస్తుతం బుమ్రా ఖాతాలో 883 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి.
బౌలింగ్ ర్యాంకుల్లో దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడ (872), ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ (860) 2, 3 స్థానాల్లో ఉన్నారు. భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (807) ఒక స్థానం మెరుగుపర్చుకుని.. నాలుగో స్థానంలోకి దూసుకొచ్చాడు. టాప్ 10లో స్పిన్నర్ రవీంద్ర జడేజా ఏడో స్థానంలో ఉన్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజా (423), అశ్విన్ (290) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో టాప్ -10లో అక్షర్ పటేల్ కూడా ఉన్నాడు. అక్షర్ ఖాతాలో 239 రేటింగ్ పాయింట్స్ ఉండగా.. ఏడవ స్థానంలో కొనసాగుతున్నాడు.
పెర్త్ టెస్టులో సెంచరీలు చేసిన యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీలు తమ ర్యాంకులను మెరుగుపర్చుకున్నారు. యశస్వి జైస్వాల్ (825) రెండు స్థానాలు మెరుగుపరుచుకుని.. రెండో స్థానంలో నిలిచాడు. కింగ్ కోహ్లీ (689) 9 స్థానాలు ఎగబాకి.. 13వ ర్యాంకులో నిలిచాడు. టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకుల్లోఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ (903 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రూట్ ఇటీవలి కాలంలో వరుస సెంచరీలు చేసిన విషయం తెలిసిందే. టీమిండియా కీపర్ రిషబ్ పంత్ (736) ఆరో స్థానంలో ఉన్నాడు. గాయం కారణంగా తొలి టెస్టు మ్యాచ్ ఆడని టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 17వ స్థానంలో ఉన్నాడు. వన్డే బ్యాటింగ్ ర్యాంకుల్లో టాప్ 5లోనే భారత్ నుంచి ముగ్గురు ఉండడం విశేషం. ఈ జాబితాలో బాబర్ అజామ్ (809) అగ్రస్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ (765), శుభ్‌మన్ గిల్ (763), విరాట్ కోహ్లీ (746)లు వరుసగా 2, 3, 4 స్థానాల్లో కొనసాగుతున్నారు.