చరిత్ర సృష్టించిన భారత షట్లర్లు.. 73 ఏళ్ల టోర్నీ చరిత్రలో తొలిసారి..
Thomas Cup 2022: థామస్ కప్ లో భారత బ్యాడ్మింటన్ జట్టు కొత్త చరిత్రను సృష్టించింది.
Thomas Cup 2022: థామస్ కప్ లో భారత బ్యాడ్మింటన్ జట్టు కొత్త చరిత్రను సృష్టించింది. ఈ టోర్నీ ఆరంభమై 73 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు అందని ద్రాక్షలానే ఉన్నా టైటిల్ ను తొలిసారి భారత పురుషుల జట్టు సొంతం చేసుకుంది. ఫైనల్‌లో బలమైన జట్టును ఓడించి బ్యాడ్మింటన్‌లో సువర్ణాధ్యాయాన్ని లిఖించింది. 14 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఇండోనేషియాపై చారిత్రక విజయాన్ని భారత్ నమోదు చేసింది. అద్భుత ఆటతీరులో భారత్ ఆటగాళ్లు తుదిపోరులో ఇండోనేషియాను ఉక్కిరిబిక్కిరి చేశారు. ప్రత్యర్థి జట్టుపై 3-0 తేడాతో విజయ కేతనాన్ని ఎగురవేశారు.
థామస్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో మొత్తం రెండు డబుల్స్, మూడు సింగిల్ మ్యాచ్‌లు ఉండగా వరుసగా మూడింటిలోనూ భారత్ గెలుపొందింది. మొదటగా ఆడిన సింగిల్స్ మ్యాచ్‌లో గింటింగ్‌పై 8-21, 21-17, 21-16 తేడాతో భారత ఆటగాడు లక్ష్యసేన్ విజయం సాధించాడు. అనంతరం ఆడిన పురుషుల డబుల్స్‌లో అసాన్, సంజయ జోడిపై భారత జోడి సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన సింగిల్స్‌లో ఇండోనేషియా ఆటగాడు జొనాథన్ క్రిస్టీపై కిదాంబి శ్రీకాంత్ 21-15, 23-21 తేడాతో గెలుపొందడంతో స్వర్ణం వరించింది.