Chess Grand Master: 12 ఏళ్ళకే చెస్ గ్రాండ్ మాస్టర్ గా ఘనత సాధించిన అభిమన్యు
అమెరికా న్యూ జెర్సీ లోని భారత సంతతికి చెందిన 12 ఏళ్ల అభిమన్యు మిశ్రా అతి పిన్న వయస్సులో చెస్ గ్రాండ్ మాస్టర్ గా నిలిచి ప్రపంచ స్థాయిలో అరుదైన ఘనత
Chess Grand Master: అమెరికా న్యూ జెర్సీ లోని భారత సంతతికి చెందిన 12 ఏళ్ల 4 నెలల 25 రోజుల "అభిమన్యు మిశ్రా'' అతి పిన్న వయస్సులో చెస్ గ్రాండ్ మాస్టర్ గా నిలిచి ప్రపంచ స్థాయిలో అరుదైన ఘనతని సాధించాడు. బుధవారం బుడాపెస్ట్ లో జరిగిన చెస్ టోర్నమెంట్ లో గెలిచి 2002లో 19 ఏళ్ళ వయసులో రష్యాకి చెందిన సెర్జీ కర్జకిన్ పేరు మీద ఉన్న రికార్డుని తిరగరాశాడు. ఇక అభిమన్యు మిశ్రా తన 7 ఏళ్ల వయస్సు నుండే రికార్డులు నెలకొల్పడం మొదలెట్టాడు. తన 7 ఏళ్ల 6 నెలల 22 రోజుల వయస్సుకే యునైటెడ్ స్టేట్స్ చెస్ ఫెడరేషన్ లో 2000 పాయింట్స్ సాధించడంతో పాటు, ఆ తర్వాత తన 9 సంవత్సరాల 2 నెలల 17 రోజుల వయసులో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అతి చిన్న వయస్సులో నేషనల్ మాస్టర్ గా నిలిచి రికార్డు నెలకొల్పాడు.
ఇక తాజాగా ప్రపంచ స్థాయిలో అతి చిన్న వయసులో చెస్ గ్రాండ్ మాస్టర్ గా ఈ ఘనత సాధించి ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. ఈ విజయం తర్వాత అభిమన్యు తన ట్విట్టర్ వేదికగా తన స్వల్పకాలిక లక్ష్యాన్ని సాధించినందుకు సంతోషంగా ఉందని తెలిపాడు. మరోపక్క అభిమన్యు తల్లి స్వాతి మరియు తండ్రి హేమంత్ ఈ విజయంతో సంతోషం వ్యక్తం చేసారు. అభిమన్యు తండ్రి హేమంత్ తన కుమారుడికి రెండున్నర ఏళ్ల నుండి చెస్ లో శిక్షణ ఇప్పించడం గమనార్హం.