Farmer Buried Lucky Car: లక్షలు ఖర్చు చేసి మరీ కారును సమాధి చేసిన రైతు.. ఎందుకంటే..
Farmer Buried His Lucky Car With All Rituals: మనిషో లేదంటే పెంపుడు జంతువులో చనిపోతే సమాధి చేయడం చూస్తుంటాం. కానీ సర్వీస్ అయిపోయిన కారుకు ఓ వ్యక్తి ఏకంగా అంత్యక్రియలు జరిపించారు. అది కూడా మామూలుగా కాదు... దాదాపు 4 లక్షల రూపాయలు ఖర్చు చేసి 15 వందల మందికి విందు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మనం జీవితంలో వాడిన వస్తువులను కొంతకాలం తర్వాత పడేస్తాం. కొంచెం ఖరీదైన వస్తువు అయితే వాటికి సెకండ్ హ్యాండ్ వస్తువుల కింద అమ్మేస్తాం. మరికొందరైతే ఏదైన వస్తువులు, వాహనాలు కొన్నా, లేదంటే కొత్త మనుషులు మ జీవితంలోకి వచ్చినా, ఆ తర్వాత కలిసొస్తే ఆ వస్తువులను, వాహనాలను, వారిని అదృష్టంగా భావిస్తారు. దాంతో ఆ వస్తువు పట్ల గానీ, ఆ మనుషుల పట్ల గానీ ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడుతుంది. వాటిని వదులుకోవాల్సి వచ్చినప్పుడు కూడా వారు అంతే బాధపడతారు. అలాంటి సంఘటనే ఒకటి గుజరాత్‌లో చోటుచేసుకుంది.
గుజరాత్ రాష్ట్రంలోని అమ్రేలి జిల్లా లాఠీ తాలూకా పదర్‌శింగ గ్రామానికి చెందిన సంజయ్ పోలారా అనే రైతు తన కారుకు అంత్యక్రియలు జరిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సంజయ్ తన లైఫ్‌లో 12 ఏళ్ల పాటు సేవ చేసిన తన లక్కీ వాగన్ ఆర్ కారుపై ఎంతో ప్రేమ పెంచుకున్నాడు. కారు కొన్నాకే తమ జీవితాల్లో మార్పు వచ్చిందని, అదృష్టం కలిసొచ్చిందని నమ్ముతున్న సంజయ్.. పనికిరాకుండా ఉన్న ఆ కారును సమాధి చేశారు.
అయితే సమాధి కార్యక్రమమే కదా అని తూతూమంత్రంగా పూర్తి చేయలేదు. గ్రామస్తులు, సాధువులు, మత గురువులను ఆహ్వానించారు. సుమారు 15 వందల మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వాన పత్రికను ప్రజలకు పంపారు. అందులో ఈ కారు తమ కుటుంబంలో సభ్యురాలిగా మారిందని.. తమకు ఎంతో అదృష్టమని లేఖలో రాశారు. తాము ఎల్లప్పుడూ దానిని తమ జ్ఞాపకాలలో ఉంచాలనుకుంటున్నామని.. కాబట్టి తాము దానిని గౌరవ ప్రదంగా సమాధి చేస్తున్నామని రాశారు.
అంత్యక్రియలపై సంజయ్ మాట్లాడుతూ.. తాను 12 ఏళ్ల క్రితం ఈ కారును కొన్నట్టు చెప్పాడు. ఈ కారు కుటుంబానికి సంపదను తెచ్చిపెట్టిందని.. వ్యాపారంలో విజయాన్ని చూడటమే కాకుండా తమ కుటుంబ గౌరవాన్ని కూడా పొందిందన్నారు. అందుకే కారును అమ్మడానికి బదులుగా సమాధి చేశానన్నారు. ఈ సమాధిపై మొక్కను నాటాలనుకుంటున్నానని.. చెట్టు కింద కుటుంబానికి కలిసొచ్చిన కారు ఉందని భవిష్యత్ తరాలకు తెలియజేయాలనుకుంటున్నట్టు తెలిపారు.