Ganesh Chaturthi 2020: విశాఖలో మాస్క్ వినాయకుడు!
Ganesh Chaturthi 2020: విశాఖలో మాస్క్ వినాయకుడు ఇస్తున్న సందేశం!
కరోనా మహమ్మారి దెబ్బకు పండగలు కూడా ప్రశాంతంగా చేసుకునే అవకాశం లేకుండా పోయింది. పందిళ్ళ సందళ్ళు.. కుర్రకారు కేరింతలు.. వీధి వీధినా పూజోత్సవాలు ఈ ఏడాది వినాయకునికి జరిపించుకునే అవకాశం జనానికి దొరకలేదు. ఎవరి ఇంట్లో వారే.. గణపతి కథ చెప్పేసుకుని.. నెట్టింట్లో శుభాకాంక్షల సందేశాలు పంపేసుకుని.. పోయినేడాది ఇలా.. ముందేడాది అలా అనుకుంటూ గత స్మృతులను నేమరేసుకుని ప్రసాదాలు నోట వేసుకుని పండుగ జరిపేసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే విశాఖపట్నంలో మాత్రం ఓ వినాయకుడు వెలిశాడు. కరోనా వచ్చిందిరా నాయనలూ.. జాగ్రత్త అంటున్నాడు ఆ మాస్ వినాయకుడు! మాస్ అంటే సినిమా భాషలో చెప్పే మాస్ కాదండోయ్! సామాన్యుని వినాయకుడు. అవును..విశాఖపట్నం తాటిచెట్లపాలెం ప్రాంతానికి చెందిన ఓ సామాన్యుల వినాయకుడు ప్రతి ఏడాది లానే ఈ ఏడాది కూడా సమాజానికి సందేశం ఇస్తూ కొలువుతీరాడు. సర్జికల్ మాస్క్ లతో సిద్ధం అయిన ఈ గణపతిని చూస్తె ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే.
సామాన్యుల దేవుడు కదా సామాన్యంగా లేడు.. మాస్క్ ధరించడం..నిన్ను నీవు రక్షించుకోవడమే కాదు..సమాజాన్నీ రక్షించడం! అని చెబుతూనే..మాస్క్ ధరించి పదికాలాలు ఉంటావా.. తీసేసి పదిరోజుల్లో పోతావా.. నిర్ణయం నీ చేతుల్లోనే! అని ఘాటుగా హెచ్చరిస్తున్నాడు. అదీకాకుండా కరోనా కాలంలోనూ మందేసి చిందేసి చిందరవందర చేస్తున్న మండుబాబుల్నీవదిలి పెట్టలేదు ఈ విఘ్నేశ్వరుడు.. మందు తాగితే నువ్వే పోతావు.. మాస్క్ లేకుండా ఎగబడితే నీ కుటుంబం మొత్తం మంట కలుస్తుంది! అని హెచ్చరిస్తూనే.. మందు తాగడం నీ దురలవాటు.. అది నీ ఖర్మ! మాస్క్ ధరించడం మంచి అలవాటు అది నీ కుటుంబానికి శ్రీరామ రక్ష! అంటూ హితబోధా చేస్తున్నాడు. ఈ గణనాధుని చూసిన వారంతా ఈ ఆలోచన వచ్చిన నిర్వాహకుడిని అభినందిస్తున్నారు.
ఈ ఆలోచన ఓ యువకుడిది. పేరు హరిప్రసాద్. విశాఖపట్నం తాటిచెట్లపాలెం లో ఉంటాడు. చిన్నప్పటినుంచీ వినాయక ఉత్సవాలంటే మహా పిచ్చి. అయితే, పండగకు పరమార్ధం ఉండాలనేది అతని థీరీ. ప్రజలందరికీ ఇష్టుడు వినాయకుడు సందేశం ఇస్తే అందరికీ చేరుతుందనే ఆలోచన పదేళ్ళ క్రితం వచ్చింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ప్రత్యేకతతో కూడిన వినాయక్ ప్రతిమలు మట్టితో చేయించి.. తన పందిరి ద్వారా సందేశాన్ని ఇస్తూ వస్తున్నాడు. ఏటీఎం లో వినాయకుడు.. ఏటీఎం జాగ్రత్తలు చెప్పాడు.. రైలులో వినాయకుడు రైలు ప్రయాణంలో జాగ్రత్తలు చెప్పాడు.. హెల్మెట్ వినాయకుడు హెల్మెట్ ప్రయోజనాలు వివరించాడు..ఇలా రకరకాలుగా ప్రతి సంవత్సరం సమాజానికి సందేశాన్నిచ్చే పండుగ చేస్తున్నాడు హరిప్రసాద్. ఈసారి వేడుకలకు అవకాశం లేదు. అయినా సరే.. వినాయకుడు సందేశం ఇవ్వాల్సిందే అని అనుకున్నాడు. అంతే.. మాస్ వినాయకుడు మాస్క్ వినాయకుడిగా రూపు దిద్దుకున్నాడు. తన ఇంటి వద్ద ఉన్న ఓ షాపులో ఈ వినాయకుడిని ఏర్పాటు చేశాడు హరిప్రసాద్.
మాస్క్ వినాయకుడు..
పూర్తిగా మట్టితో తయారైన వినాయకుడికి మాస్క్ తగిలించాడు హరిప్రసాద్. ఒక చేతిలో శానిటైజర్.. ఒక చేతిలో మాస్క్.. ఇక ఈయన వాహనం మూషికరాజం కూడా తానేమీ తక్కువ తినలేదన్నట్టు శానిటైజర్ పట్టుకుని.. మాస్క్ పెట్టుకుని వచ్చే భక్తులకు కరోనా జాగ్రత్తలు చెబుతున్నాడు. మొత్తం సెట్టింగ్ లో ఆకర్షణగా మద్యం షాపు వద్ద మాస్క్ లేకుండా ఎగబడుతున్న జనాలు! వారిని హెచ్చరిస్తూ పెట్టిన కాప్షన్స్ కచ్చితంగా ఆలోచింప చేసేలా ఉన్నాయి.
మొత్తమ్మీద ఎక్కడా వినాయక ఉత్సవాలు లేకపోయినా సామాజిక సందేశం ఇవ్వడానికి ఉత్సవం జరగక్కరలేదు.. వంద మంది చూసినా చాలు.. వారు అందరికీ చెబితే.. కొందరిలో అయినా మార్పు వచ్చి మాస్క్ లు ధరించడం.. మందు షాపుల వడ ఎగబడటం మానేయడం చేస్తే నా శ్రమ ఫలించినట్టే అంటున్నాడు హరిప్రసాద్. మరి మాస్క్ గణేశుడిని మీరూ చూసి ఓ మాస్ జై కొట్టండి!