Children's Day 2024: నవంబర్ 14న ఎందుకు ?

Children's Day 2024: భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ. నెహ్రూకు పిల్లలన్నా, గులాబీ పువ్వులన్నా ఎంతో ఇష్టం

Update: 2024-11-13 11:27 GMT

Children's Day 2024: నవంబర్ 14న ఎందుకు జరుపుకుంటారు?

Children's Day 2024: బాల్యం చాలా అమూల్యమైనది. అల్లరి, చిలిపి పనులు ఆ రోజులే వేరు. ఆ రోజులను తలుచుకున్నప్పుడల్లా ఓ మధురానుభూతి కలుగుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం ముఖ్యమైనది. అలాంటి బాలల దినోత్సవాన్ని మన దేశంలో నవంబర్ 14న జరుపుకుంటాం. చాచా నెహ్రూ జయంతి రోజున ఈ చిల్డ్రన్స్ డే నిర్వహించుకుంటాం. ఆ రోజున ఆయనకు నివాళులు అర్పిస్తూ బాలలకు శుభాకాంక్షలు చెబుతారు.

చిల్డ్రెన్స్ డే కు నాంది

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ. నెహ్రూకు పిల్లలన్నా, గులాబీ పువ్వులన్నా ఎంతో ఇష్టం. పిల్లలను జాతి సంపదలుగా నెహ్రూ చెబుతూ ఉండేవారు. అంతేకాదు స్వాతంత్ర్య ఉద్యమంలో నెహ్రూ జీవితంలో అధిక భాగం జైల్లోనే

గడిపారు. ఆ సమయంలో తన కుమార్తె ఇందిరా ప్రియదర్శినితో ఎక్కువకాలం గడపలేదు. అందుకే వీలున్నప్పుడల్లా పిల్లలతో గడపేవారు. నేటి బాలలే రేపటి మన దేశ భవిష్యత్తు అని ఆయన బలంగా నమ్మేవారు. పిల్లల కోసం ఏదైనా చేయాలి అని నిరంతరం తపిస్తూ ఉండేవారు. ఈ క్రమంలోనే ప్రత్యేకంగా పిల్లల కోసం చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీని ప్రారంభించారు.పిల్లల అభివృద్ధికి అలాగే సంక్షేమానికి ఎంతో కృషి చేశారు.అందుకే ఆయన పుట్టిన రోజున బాలల పండుగగా నిర్వహిస్తాం.ఆ రోజున నెహ్రూను తలుచుకుని పిల్లలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

పలు దేశాల్లో బాలల దినోత్సవాలు

1954వ సంవత్సరానికి ముందు భారతదేశంలో అక్టోబర్ లో బాలల దినోత్సవాన్ని నిర్వహించేవారు. ఐక్యరాజ్యసమితి నిర్ణయం ప్రకారం మొదటి సారి 1954లో ప్రపంచమంతటా నిర్వహించారు. 1989లో పిల్లల హక్కులపై నవంబర్ 14వ తేదీని ఐరాస ఓ బిల్లును ఆమోదించింది. 191 దేశాలు ఆ బిల్లును ఆమోదిస్తూ సంతకాలు పెట్టాయి. ప్రపంచ వ్యాప్తంగా పిల్లల సంక్షేమం కోసం పలు చర్యలు చేపట్టడమే లక్ష్యంగా బాలల దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. చైనాలో జూన్1వ తేదీన, పాకిస్తాన్ లో నవంబర్ 20వ తేదీన, జపాన్ లో మే 5న, దక్షిణ కొరియాలో మే 5న, పొలాండ్ లో జూన్ 1న, శ్రీలంకలో అక్టోబర్ 1న ఇలా ఆయా దేశాల్లో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు.

పిల్లల హక్కులు...

చిన్నారులకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన బాల్యం అందించడం బాలల దినోత్సవం ఉద్దేశం.పిల్లల హక్కులను ప్రోత్సహించడం, వారి విద్య, శ్రేయస్సుకి పాటుపడడంతో పాటు పోషకాహారం, ఇంట్లో సురక్షితమైన వాతావరణం అందించడం వంటి బాధ్యతలను గుర్తు చేస్తుంది. పేదరికం, నిరక్షరాస్యత, ఆరోగ్య సంరక్షణ, బాల కార్మికులుగా మారడం వంటి పిల్లలు ఎదుర్కొంటున్న సవాళ్లపై అవగాహన పెంచుతుంది.

ప్రస్తుతం బాల కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. భారతదేశం అన్ని రంగాలలో ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ముందుకెళ్తోంది. మరి అలా పోటీ పడాలి అంటే పునాదులు చాలా దృఢంగా ఉండాలి. దేశ భవిష్యత్తుకి పునాదులు బాలలే. నేటి బాలలే రేపటి పౌరులు.. కానీ రేపటి భవిష్యత్తు తరగతి గదులకు మాత్రమే పరిమితం చేస్తున్నారు చాలామంది. పిల్లలను అర్థం చేసుకుని వారి అభిరుచులకు అనుగుణంగా తల్లిదండ్రులు ప్రోత్సహం ఇవ్వాలి. మార్కులు, ర్యాంకులు ఒక్కటే లక్ష్యంగా కాకుండా అన్ని విషయాలపై అవగాహన కల్పించాలి.

ఒత్తిడికి దూరంగా...

టెక్నాలజీ పరంగా దూసుకుపోతున్నాం.. చంద్రుడిపై జెండా పాతాం.. కానీ ప్రస్తుత కాలంలో పిల్లల్లో మానసిక దృఢత్వం పెంచలేకపోతున్నాం. ప్రతి విషయాన్ని చాలా సున్నితంగా ఆలోచిస్తున్నారు. అంతేకాదు చదువు, ర్యాంకులు అంటూ పిల్లలపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో వారి ఆలోచనలు ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. సెల్ ఫోన్ మాయలో పడి చిన్నతనం నుంచే ఆటపాటలకు దూరమవుతున్నారు. అనారోగ్యాలకు, బద్దకానికి, చెడు అలవాట్లకు దగ్గరవుతున్నారు. అలా కాకుండా ప్రతి స్కూల్లో పిల్లలకు ఆటస్థలం ఏర్పాటు చేసి వారి మానసిక, శారీరక దృఢత్వాన్ని పెంచాలి. ఎంతసేపు పాఠ్యపుస్తకాలే కాకుండా.. ఎప్పటికప్పుడు సమాజంలో జరుగుతున్న విషయాలను పిల్లలకు బోధిస్తూ సమాజంపై అవగాహన కల్పించాలి. ఆ రకంగా పిల్లల అభివృద్ధికి, దేశ అభివృద్ధికి బాటలు వేయాలి. బాలలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే.

Tags:    

Similar News