తెలంగాణ గ్రానైట్‌తో 28 అడుగుల నేతాజీ విగ్రహం
*ఇండియా గేట్ దగ్గర ఆవిష్కరించనున్న ప్రధాని మోడీ
Delhi: ఇండియాగేట్ సమీపంలో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ విగ్రహంతో పాటు 'కర్తవ్యపథ్'ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు. ప్రతియేటా గణతంత్ర దినోత్సవం నాడు సైనిక కవాతు నిర్వహించే 'రాజ్‌పథ్' పేరును 'కర్తవ్యపథ్'గా మార్చారు. ఇప్పటి వరకు రాజ్‌పథ్ ఒక అధికార చిహ్నంగా ఉండగా కర్తవ్యపథ్ సార్వజనీక యాజమాన్యానికి స్వశక్తీకరణకు నిదర్శనంగా ఉంటుందని, ఇదిఒక మార్పునకు సంకేతంగా నిలుస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
'కర్తవ్య పథ్'ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించనున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సందర్శకుల సంఖ్య పెరగడంతో రాజ్‌పథ్, సెంట్రల్ విస్టా ఏవిన్యూ పరిసర ప్రాంతాలలో రద్దీ పెరిగిపోయింది. ఆ ప్రాంతాలలో సార్వజనిక టాయిలెట్లు, తాగునీరు, వీధి సరంజామా, వాహనాలను నిలిపి ఉంచడం కోసం తగినంత స్థలం లేకపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. దీనికి తోడు, గణతంత్ర దిన కవాతును, ఇతర జాతీయ కార్యక్రమాలను ప్రజల రాక పోకలకు సాధ్యమైనంత తక్కువ ఆంక్షలతో నిర్వహించుకోవలసిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని కేంద్రం అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది.
సుందరీకరణకు తావిచ్చిన ప్రకృతి చిత్రాలు, నడక దారులతో దిద్దితీర్చిన పచ్చిక బయళ్ళు, సరికొత్త గా జతపరచిన హరిత ప్రదేశాలు, మరమ్మతులు చేసిన కాలువలు, సరికొత్త సదుపాయాలతో నిర్మించిన భవనాలు, మెరుగు పరచినటువంటి సైన్ బోర్డులు, వెండింగ్ కియోస్క్ లు 'కర్తవ్య పథ్' లో కొలువుదీరనున్నాయి. వీటికి అదనంగా పాదచారుల కోసం కొత్తగా నిర్మించిన అండర్ పాస్ లు, మెరుగుపరచిన పార్కింగ్ ఏరియా, నూతన ఎగ్జిబిషన్ ప్యానల్స్, ఇంకా అప్‌గ్రేడెడ్ నైట్ లైటింగ్ వంటివి ఈ ప్రాంతాన్ని చూడటానికి వచ్చే ప్రజలకు ఉత్తమమైన అనుభూతిని కలుగజేయనున్నాయి. ఘన వ్యర్థాల నిర్వహణ, వరద జలాల నిర్వహణ, వర్షపు నీరు ఇంకిపోయేందుకు తవ్విన గుంతలు, జల సంరక్షణ, శక్తిని ఆదా చేయగల దీపాల వ్యవస్థలు కూడా ఇందులో భాగంగా ఉన్నాయి.
ఇక ప్రధాన మంత్రి ఆవిష్కరించనున్న నేతాజీ సుభాష్ చంద్ర బోస్ విగ్రహాన్ని- ఈ ఏడాది ఆరంభంలో పరాక్రమ్ దివస్ (జనవరి 23) నాడు ఎక్కడైతే నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ప్రధాన మంత్రి ఆవిష్కరించారో- అక్కడ రాతి విగ్రహాన్ని నెలకొల్పనున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి తెప్పించిన గ్రానైట్ రాయితో తయారు చేసిన ఈ విగ్రహం దేశ స్వాతంత్య్ర పోరాటానికి నేతాజీ అందించినటువంటి తోడ్పుటుకు ఒక సముచితమైన శ్రద్ధాంజలిగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. తమిళనాడుకు చెందిన ప్రధాన శిల్పి అరుణ్ యోగిరాజ్ ఈ 28 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏకశిలా గ్రానైట్ పై చెక్కారు. విగ్రహం మొత్తం బరువు 65 టన్నులని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.