Mahayuti CM: మహాయుతి భేటీ క్యాన్సిల్ .. ఢిల్లీకి అజిత్ పవార్..
Mahayuti meeting cancelled: షిండే తనయుడు శ్రీకాంత్ షిండే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టవచ్చని ప్రసారం సాగింది. ఈ క్రమంలో దీనిపై శ్రీకాంత్ షిండే స్పందించారు.
Mahayuti meeting cancelled: మహారాష్ట్ర సీఎం పదవిపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. సోమవారం ముంబైలో జరగాల్సిన కీలక సమావేశం తాత్కాలిక ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అనారోగ్యం కారణంగా రద్దయింది. మరోవైపు అజిత్ పవార్ ఢిల్లీ వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్ర సీఎం పదవితో పాటు, పోర్ట్‌ఫోలియో కేటాయింపులను ఖరారు చేయడానికి మహాయుతి నేతల సమావేశం సోమవారం జరగాల్సి ఉంది. అయితే షిండే గొంతు ఇన్ఫెక్షన్, జ్వరంతో బాధపడుతున్నారని తెలుస్తోంది. ఈ కారణంగానే సమావేశం రద్దయినట్లు వార్తలొస్తున్నాయి.
ఇక సమావేశం రద్దు కావడంతో ముఖ్యమంత్రితో పాటు మంత్రి పదవులను ఖరారు చేయడంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. సోమవారం మహాయుతి సమావేశానికి అధికారిక ప్రణాళికలు లేవని శివసేన వర్గాలు తెలిపాయి. కూటమిలోని అతి పెద్ద పార్టీగా ఉన్న బీజేపీ నిర్వహించే సమావేశం కోసం పార్టీ వేచి ఉందని పేర్కొంది. ఈలోగా ప్రభుత్వ ఏర్పాటు, పోర్ట్‌ఫోలియో పంపిణీపై బీజేపీ నాయకత్వంలో చర్చించడానికి అజిత్ పవార్ ఢిల్లీ వెళ్లడం ఆసక్తికరంగా మారింది.
మరోవైపు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పదవిపై వస్తున్న వార్తలను ఎంపీ, ఏక్‌నాథ్ షిండే తనయుడు శ్రీకాంత్ షిండే తోసిపుచ్చారు. కొత్తగా ఏర్పడనున్న మహారాష్ట్ర ప్రభుత్వంలో తాను ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. మహాయుతి ప్రభుత్వం కొలువుదీరడానికి ముందు రకరకాల ప్రచారం జరుగుతోందని, కానీ ఆ కథనాలు నిరాధారమైనవన్నారు. తన తండ్రి ఏక్‌నాథ్ షిండే అనారోగ్యం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నట్టు చెప్పారు.
గత లోక్ సభ ఎన్నికల తర్వాత తనకు కేంద్రమంత్రిగా అవకాశం వచ్చిందని.. కానీ పార్టీ కోసం పని చేయాలనే ఉద్దేశంతో తాను ఆ పదవిని నిరాకరించనని అన్నారు. పదవి కావాలనే కోరిక తనకు లేదని.. ఎలాంటి మంత్రి పదవి రేసులో తాను లేనని శ్రీకాంత్ షిండే స్పష్టం చేశారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. సీఎం పదవి, మంత్రి పదవుల కేటాయింపుల సంబంధించి చర్చల నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు ఆలస్యమవుతున్నట్టుగా తెలుస్తోంది. షిండే తనయుడు శ్రీకాంత్ షిండే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టవచ్చని ప్రసారం సాగింది. ఈ క్రమంలో దీనిపై శ్రీకాంత్ షిండే స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.