Maharashtra Politics: మహారాష్ట్ర కొత్త సీఎం ఎంపిక ఎంతవరకొచ్చింది? లేటెస్ట్ అప్‌డేట్స్

Update: 2024-12-02 11:07 GMT

Who will be Maharashtra new cm: మహారాష్ట్ర సీఎం ఎవరు అనే ఉత్కంఠకు ఇవాళ తెరపడనున్నట్టు తెలుస్తోంది. ముంబైలో ఇవాళ బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో సీఎం అభ్యర్థిని ఎన్నుకునే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం. మొత్తానికి సీఎం అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవీస్ పేరు దాదాపుగా ఖరారైనట్టు ప్రచారం జరుగుతోంది. మహారాష్ట్రలో ఇవాళ బీజేపీ, షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ నేతల కీలక సమావేశం జరగనుంది. ఇందులో మహారాష్ట్ర సీఎం ఎవరన్న దానిపై క్లారిటీ రానుంది. ఈ సమావేశంలోనే ఏయే పార్టీలకు ఎన్ని మంత్రిత్వ శాఖలు కేటాయించనున్నారనే దానిపై ముగ్గురు నేతలు చర్చించనున్నట్టు సమాచారం.

పట్టణాభివృద్ధి, ఆర్థిక శాఖలతో పాటు అసెంబ్లీ స్పీకర్ పదవిపై మూడు పార్టీలు గట్టిగా పట్టుబడుతున్నాయి. అయితే హోంశాఖ, స్పీకర్ పదవి విషయంలో బీజేపీ పట్టు వీడడంలేదని సంబంధిత వర్గాల సమాచారం. ఈ కారణం వల్లే కొత్త సీఎం ఆలస్యమవుతోందని తెలుస్తోంది. దీనిపై ఏదో ఒకటి తేల్చాలని.. లేదంటే తామే నిర్ణయిస్తామని అమిత్ షా మహాయుతి కూటమి నేతలకు స్పష్టం చేసినట్టు టాక్ వినిపిస్తోంది. దీంతో శాసనసభాపక్ష నేతను ఎన్నుకునేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్‌ను బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకుంటారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశం ఇవాళ జరగకపోతే, రేపు లేదా ఎల్లుండి జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

సీఎం అభ్యర్థిత్వంపై బీజేపీ పెద్దల తీరుకు నిరసనగా ఏక్‌నాథ్ షిండే అలిగి తన సొంత ఊరికి వెళ్లినట్టు వార్తలు వచ్చాయి. దీంతో కూటమిలో చీలికలు వస్తాయని పుకార్లు వచ్చాయి. ఆదివారం సాయంత్రం స్వగ్రామం నుంచి ముంబైకి వచ్చిన షిండే.. తాను ఏమాత్రం అసంతృప్తితో లేనని, ఏకాభిప్రాయంతోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి అభ్యర్థికి తాను సంపూర్ణ మద్దతిస్తానని షిండే ప్రకటించారు. అయితే అంతకంటే ముందుగా ముఖ్యమంత్రి పీఠంకోసం పట్టుదలతో ఉన్న ఏక్‌నాథ్ షిండేతో బీజేపీ హై కమాండ్ పలుమార్లు చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే షిండే దిగొచ్చినట్టు కూటమి నేతల్లో చర్చ జరుగుతోంది.

మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ కూటమిలో బీజేపీ 132 స్థానాలు, షిండే శివసేన 57, ఎన్సీపీ 41 స్థానాల్లో విజయం సాధించింది. ప్రస్తుతం మహారాష్ట్ర ఆపద్ధర్మ సీఎంగా ఏక్‌నాథ్ షిండే కొనసాగుతున్నారు. డిసెంబర్ 5వ తేదీన సాయంత్రం ముంబైలోని అజాద్ మైదాన్‌లో సీఎం ప్రమాణస్వీకారోత్సవం ఉంటుందని బీజేపి వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్డీయే మిత్రపక్షాల నేతలు పాల్గొననున్నారు. అయితే, డిసెంబర్ 5న ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి మాత్రమే ప్రమాణస్వీకారం చేస్తారా.. లేక మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.

Tags:    

Similar News