Maharashtra: కొత్త సీఎం ఎవరో అప్పుడే తెలుస్తుందన్న షిండే.. ఇది రాష్ట్రానికే అవమానం - ఆదిత్య థాకరే
Who will be Maharashtra New CM: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి పది రోజులు కావొస్తున్నాయి. బీజేపి, షిండే శివసేన, అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీల కూటమి ఘన విజయం సాధించింది. అయినప్పటికీ ఇప్పటి ఇంకా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో మహాయుతి కూటమి మల్లగుల్లాలు పడుతోంది. ఇదే విషయమై తాజాగా ముంబై మీడియా ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండెను ప్రశ్నించింది. మీడియా అడిగిన ప్రశ్నకు షిండే స్పందిస్తూ.. రేపు బీజేపి శాసన సభా పక్షం సమావేశం అవుతోందన్నారు. ఆ సమావేశంలోనే కాబోయే కొత్త సీఎం ఎవరనేది తేలిపోతుందన్నారు.
"ఇది ప్రజలచే ఎన్నుకున్న ప్రభుత్వం. సీఎం ఎవరు అవుతారు అనే విషయంలో నేను చెప్పాల్సింది స్పష్టంగా చెప్పేశాను. ఇక మిగతాది వారి చేతుల్లోనే ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంతిమ నిర్ణయం తీసుకుంటారు. సోమవారం నాటి బీజేపి శాసన సభాపక్ష సమావేశంలో నిర్ణయిస్తారు" అని షిండే తెలిపారు. ఇందులో అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని షిండే అభిప్రాయపడ్డారు.
మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు విషయంలో కొనసాగుతున్న సస్పెన్స్ పై ప్రతిపక్ష కూటమి నుండి కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడి వారం రోజులు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోవడం మహారాష్ట్రకే అవమానం అని ఉద్ధవ్ బాల్ థాకరే శివసేన పార్టీ శాసన సభా పక్ష నేత ఆదిత్య థాకరే అన్నారు. అంతేకాకుండా మహాయుతి కూటమికి సహాయం చేసిన ఎన్నికల సంఘానికి కూడా ఇది అవమానమే అవుతుందన్నారు. ఇదే విషయమై ఆయన ఎక్స్ ద్వారా ఒక పోస్ట్ చేశారు.
మహాయుతి కూటమి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకున్నా వారిని ఎవ్వరూ ఏమనడం లేదు. ఒకవేళ మహారాష్ట్రలో తమ కూటమి గెలిచి ఇలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే ఈపాటికే ప్రెసిడెంట్ రూల్ విధించే వారు అని ఆదిత్య థాకరే తన ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. రూల్స్ అన్నీ ప్రతిపక్షాలకే కానీ కొన్ని పార్టీలకు అవి వర్తించవు అని ఆదిత్య థాకరే ఆరోపించారు.