TOP 6 News @ 6 PM: ఫెంగల్ తుఫాన్ తో తిరుపతి సహా పలు జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్: మరో 5 ముఖ్యాంశాలు

నైరుతి బంగాళాఖాతంలో ఫెంగల్ తుఫాన్ గంటకు 10కి.మీ. వేగంతో ముందుకు కదులుతోంది.

Update: 2024-11-30 12:30 GMT

TOP 6 News @ 6 PM: ఫెంగల్ తుఫాన్ తో తిరుపతి సహా పలు జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్: మరో 5 ముఖ్యాంశాలు

1. ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్: ఏపీలో పలు జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్

నైరుతి బంగాళాఖాతంలో ఫెంగల్ తుఫాన్ గంటకు 10కి.మీ. వేగంతో ముందుకు కదులుతోంది. కారైకాల్, మహాబలిపురం మధ్య పుదుచ్చేరి సమీపంలో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, రాయలసీమలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తీరం వెంట 70 నుంచి 90 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

2. ఏఈఈ నికేష్ నివాసాల్లో ఏసీబీ సోదాలు

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఇరిగేషన్ శాఖ ఏఈఈ నికేష్ కుమార్ నివాసాల్లో ఆయన బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. ఇవాళ ఉదయం నుంచి ఈ సోదాలు సాగుతున్నాయి. హైద్రాబాద్ సహా రాష్ట్రంలోని 30 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. ఫాంహౌస్ లు, విల్లాలు, వ్యవసాయ భూములు, భవనాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. బంగారం కూడా గుర్తించారు. మార్కెట్ విలువ మేరకు రూ. 150 కోట్లకు పైగా ఆస్తుల విలువ ఉంటుందని అంచనా.

3. మా భూభాగానికి నాటో భద్రత కల్పిస్తే యుద్ధం ఆపేస్తాం: జెలెన్ స్కీ

తమ ఆధీనంలో ఉన్న భూభాగానికి నాటో భద్రత కల్పిస్తామని హామీ ఇస్తే కాల్పుల విరమణకు అంగీకరిస్తామని ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్ స్కీ చెప్పారు. బ్రిటన్ మీడియా సంస్థ స్కై న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశాారు. అంతర్జాతీయ సరిహద్దుల పరిధిలో ఉన్న మొత్తం తమ దేశాన్ని నాటోలో చేర్చుకోవాలని ఆయన కోరారు. అదే జరిగితే రష్యా ఆక్రమించుకున్న భూభాగం సాధించుకునేందుకు తమకు వీలు దక్కుతుందని ఆయన చెప్పారు. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్యను ప్రారంభించింది. రెండు దేశాల మధ్య అప్పటి నుంచి యుద్ధం సాగుతోంది.

4. తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం

తిరుమలలో రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధించాలని టీటీడీ పాలకవర్గం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని నవంబర్ 30 నుంచి అమల్లోకి తీసుకువచ్చారు. ఈ మేరకు టీటీడీ ఇవాళ ప్రకటన విడుదల చేసింది. ఈ నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ వార్నింగ్ ఇచ్చింది. బీఆర్ నాయుడు టీటీడీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన తొలి పాలకమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తిరుమల ఆలయ ప్రాంగణంలో రాజకీయాల ప్రస్తావన, విమర్శలు, ప్రతి విమర్శలతో ఆధ్యాత్మిక వాతావరణానికి ఇబ్బంది కలుగుతోందని అభిప్రాయాలున్నాయి. దీంతో టీటీడీ పాలకమండలి ఈ నిర్ణయం తీసుకుంది.

5. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గా బుర్రా వెంకటేశం

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మెన్ గా బుర్రా వెంకటేశం నియామక ఫైలుపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శుక్రవారం సంతకం చేశారు. బుర్రా వెంకటేశం ప్రస్తుతం తెలంగాణ విద్యాశాఖ కమిషనర్ గా ఉన్నారు. ప్రస్తుత పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ ఎం. మహేందర్ రెడ్డి పదవీకాలం డిసెంబర్ 3 తో పూర్తి కానుంది. దీంతో కొత్త ఛైర్మెన్ నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఛైర్మెన్ పదవి కోసం బుర్రా వెంకటేశం దరఖాస్తు చేసుకున్నారు. ఐఎఎస్ గా ఉన్న బుర్రా వెంకటేశం వీఆర్ఎస్ తీసుకోనున్నారు. డిసెంబర్ 2న ఆయన పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. గతంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయి.ఈ పరిణామాల నేపథ్యంలో సమర్ధులైన వారిని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మెన్ గా నియమించాలని ప్రభుత్వం భావించింది.

6. అమెరికా చికాగోలో కాల్పులు... ఖమ్మం విద్యార్థి సాయితేజ మృతి

అమెరికా చికాగోలో జరిగిన కాల్పుల్లో ఖమ్మం జిల్లా రామన్నపేటకు చెందిన సాయితేజ అనే విద్యార్థి మరణించారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు ఈ ఘటన జరిగింది. చికాగోలోని ఓ స్టోర్ లో సాయితేజ పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్నారు. అయితే స్టోర్ లో దోపీడీకి వచ్చిన దుండగులు సాయితేజపై కాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఆయన మరణించారు.

Tags:    

Similar News