Top 6 News @ 6 PM: నిమిష ప్రియ కేసు:భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన: మరో 5 ముఖ్యాంశాలు

యెమెన్ లో హత్య నేరం ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిష ప్రియకు ఉరిశిక్ష ఖరారైంది.

Update: 2025-01-03 12:43 GMT

1. బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు

అల్లు అర్జున్ (Allu Arjun) కు నాంపల్లి కోర్టు శుక్రవారం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. 2023 డిసెంబర్ 4న సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ కు బెయిల్ పిటిషన్ పై కోర్టు ఇవాళ తీర్పును వెల్లడించింది. ఈ కేసులో డిసెంబర్ 13న అల్లు అర్జున్ కు తెలంగాణ హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. అయితే రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని హైకోర్టు సూచించింది.

దీంతో నాంపల్లి కోర్టులో గత ఏడాది డిసెంబర్ లో రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇరువర్గాల వాదనలు విన్నతెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ తీర్పును వెల్లడించింది. రూ. 50 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు సూచించింది.

పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించారు. ఆమె కొడుకు శ్రీ తేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కేసులో అల్లు అర్జున్ ఏ11 గా ఉన్నారు. సంధ్య థియేటర్ యాజమాన్యం, మేనేజర్ ఇతర సిబ్బందితో పాటు అల్లు అర్జున్ ఆయన సిబ్బంది, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రతినిధులపై కూడా కేసు నమోదైంది. ఈ కేసులో మైత్రీ మూవీ సంస్థ ప్రతినిధులకు జనవరి 2న బెయిల్ మంజూరైంది.

2. జనవరి 6న విచారణకు రావాలని కేటీఆర్ కు ఏసీబీ నోటీస్

కేటీఆర్ కు ఫార్మూలా ఈ కారు రేసులో ఏసీబీ అధికారులు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. ఈ నెల 6న విచారణకు రావాలని ఆ నోటీసులో కోరారు. ఫార్ములా ఈ కారు రేసులో తనపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని తెలంగాణ హైకోర్టు(Telangana High Court) తీర్పును రిజర్వ్ చేసింది. అయితే ఈ కేసులో తీర్పు వెల్లడించేవరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని కోర్టు ఆదేశించింది. అయితే విచారణ చేసేందుకు ఏసీబీకి హైకోర్టు అనుమతించింది.

3. విశాఖపట్టణం సెంట్రల్ జైల్లో మరో సెల్ ఫోన్

విశాఖపట్టణం సెంట్రల్ జైల్లో మరో సెల్ ఫోన్ బయటపడింది. నర్మదా బ్లాక్ వద్ద తనిఖీలు చేస్తున్న సమయంలో స్టోర్ రూమ్ ఫ్లోరింగ్ మార్బుల్ కింద కీ ప్యాడ్ మొబల్ ప్యాక్ దొరికింది. ఈ ప్రాంతంలో తవ్వితే మొబైల్ లభ్యమైంది. ఇదే జైలులోని పెన్నా బ్యారక్ లో పూల కుండీల వద్ద గత నెల 31న జైలు అధికారులు అనుమానంతో తనిఖీ చేస్తే అక్కడ రెండు సెల్ ఫోన్లు లభ్యమయ్యాయి. జైల్లో దొరికిన ఫోన్లలో సిమ్ కార్డులు లభ్యం కాలేదు. దీనిపై పోలీసులు విచారిస్తున్నారు. ఇందులో భాగంగానే తనిఖీలు చేస్తున్నారు. ఈ సమయంలో మరో ఫోన్ దొరికింది.

4. నిమిష ప్రియ కేసు:భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన

యెమెన్ లో హత్య నేరం ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిష ప్రియకు ఉరిశిక్ష ఖరారైంది. నిమిష ప్రియ కేసులో తాము పరిణామాలన్నింటిని సునిశితంగా పరిశీలిస్తున్నామని భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు. ఈ కేసులో ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తోందన్నారు. మరణశిక్షవిధించిన నెల రోజుల్లో ఈ శిక్ష అమలు చేస్తారు. అయితే ఆమెను కాపాడాలని కుటుంబ సభ్యులు భారత ప్రభుత్వాన్ని కోరారు.

5. చైనాను వణికిస్తున్న కొత్త వైరస్ హెచ్ఎంపీవీ

చైనాను మరో వైరస్ వణికిస్తోంది. HMPV అనే వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీన్ని హ్యుమన్ మెటానిమోవైరస్ గా పిలుస్తారు.ఈ వైరస్ బారిన పడిన ప్రజలు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో పాటు ఇన్ ఫ్లూయెంజా ఏ, మైక్రోప్లాస్మా, నిమోనియా కూడా వ్యాప్తి చెందుతుందని ప్రచారం సాగుతోంది. అయితే ఈ కొత్త వైరస్ కు సంబంధించి చైనా ప్రభుత్వం ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

హెచ్ఎంపీవీ అంటే ఏంటి?

హ్యుమన్ మెటానిమోవైరస్ HMPV అనేది సాధారణ జలుబు తరహా లక్షణాలను కలిగించే ఓ వైరస్. ఈ వైరస్ సోకితే దగ్గు, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. ముక్కు కారుతుంది. గొంతు నొప్పికి కూడా కారణమౌతోంది. చిన్నపిల్లలు, వృద్దుల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఈ వైరస్ త్వరగా వ్యాపించే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

6. కర్ణాటకలో ఏపీ మంత్రులు.. ఫ్రీ బస్సు ప్రయాణంపై ఆరా..!

మహిళలకు ఉచిత బస్సు పథకంపై ఏపీలోని మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేస్తోంది. ఇందులో భాగంగా ఉపసంఘం సభ్యులు కర్ణాటకలో పర్యటిస్తున్నారు. కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి సహా అధికారులతో వారు సమావేశమయ్యారు. ఈ మేరకు బెంగళూరులో కర్ణాటక మంత్రిని ఏపీ మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, అనిత, సంధ్యారాణి కలిశారు. ఆ రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యయనం చేశారు. కర్ణాటక బస్సుల్లో ప్రయాణిస్తూ మంత్రుల కమిటీ వివరాలు అడిగితెలుసుకుంది.

Tags:    

Similar News