Delhi Man cheated over 700 women: 23 ఏళ్ల వయస్సులో 700 మందికి పైగా మహిళలను మోసం చేశాడు... ఏం చేశాడంటే
Delhi Man cheated over 700 women with their private photos and videos: ఆన్‌లైన్‌లో నకిలీ పేర్లు, నకిలీ ఐడెంటిటీలతో పరిచయమైన అబ్బాయిలు, అమ్మాయిలను నమ్మి యువతీ, యువకులు ఇట్టే మోసపోతున్నారు. వారిలో మహిళలు కూడా భారీ సంఖ్యలోనే ఉంటున్నారు. తాజాగా ఢిల్లీకి చెందిన ఓ 23 ఏళ్ల యువకుడు అమెరికా నుండి ఇండియా ట్రిప్ కోసం వచ్చిన మోడల్‌ని అని పరిచయం చేసుకుని 700 మంది మహిళలను మోసం చేయడమే అందుకు సాక్ష్యం. శుక్రవారం ఢిల్లీ పోలీసులు తుషార్ సింగ్ బిష్ట్ అనే యువకుడిని అరెస్ట్ చేశారు. ఇంతచిన్న వయస్సులోనే అతడు చేసిన నేరాల చిట్టా చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.
పగలు నొయిడాలోని ఓ ప్రైవేటు కంపెనీలో టెక్నికల్ రిక్రూటర్‌గా జాబ్ చేస్తున్నాడు. రాత్రంతా తనలోని సైబర్ క్రైమ్ నేర ప్రవృతిని బయటికి తీయడం తుషార్ సింగ్ అలవాటు. మొదట్లో ఆడవారిపై మోజుతో ఈ తప్పుడు మార్గం ఎంచుకున్నాడు. కానీ తరువాత తరువాత అదొక వ్యవసనంగా, ఆదాయ మార్గంగా మార్చుకున్నాడు. బంబుల్ అనే ఆన్‌లైన్ డేటింగ్ యాప్ ద్వారా 500 మందికి పైగా మహిళలను మోసం చేశాడు. స్నాప్‌చాట్, వాట్సాప్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా మరో 200 మందికిపైగా మహిళలను చీట్ చేశాడు. మొత్తం 700 మందికిపైగా మహిళలు ఇతడి ఫేక్ ఐడీ చూసి మోసపోయారు.
700 మందిని ఎలా మోసం చేశాడంటే...
ఢిల్లీలో ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్న తుషార్ సింగ్ బీబీఏ చదువుకున్నాడు. గత మూడేళ్లుగా ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. తండ్రి డ్రైవర్, తల్లి గృహిణి. సోదరి కూడా జాబ్ చేస్తున్నారు. రాత్రయితే చాలు తుషార్ సింగ్ ఇండియాకు ట్రిప్ కోసం వచ్చిన అమెరికన్ మోడల్‌గా తనని తాను ఆన్‌లైన్ ద్వారా పరిచయం చేసుకోవడం మొదలుపెట్టాడు. అందుకోసం బ్రెజిల్‌కి చెందిన ఒక మోడల్ ఫోటోలు, వీడియోలను ఉపయోగించుకున్నాడు. అంతేకాకుండా ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేసిన ఒక వర్చువల్ ఇంటర్నేషనల్ నెంబర్ కూడా ఉపయోగించి తాను విదేశీనని ఇంకా బలంగా నమ్మించాడు.
టీనేజ్ అమ్మాయిల నుండి 30 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళలను (women from 18+ age to 30 years old) లక్ష్యంగా పెట్టుకుని వారితో పరిచయం పెంచుకున్నాడు. స్నేహం పెరిగాకా వారితో నెక్ట్స్ స్టేజ్‌కు వెళ్లాడు. వారి ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు పంపించాల్సిందిగా రిక్వెస్ట్ పెట్టేవాడు. అతడిని అప్పటికే పూర్తిగా నమ్మడంతో అవతలి వైపున్న అమ్మాయిలు తుషార్ ట్రాప్‌లో పడి అతడుచెప్పినట్లే చేశారు.
మొదట్లో వారి ఫోటోలు, వీడియోలు చూసి ఎంజాయ్ చేయడం అలవాటుగా పెట్టుకున్నాడు. కానీ ఆ తరువాత వారికి అవే ఫోటోలు, వీడియోలు పంపించడం మొదలిపెట్టాడు. తాను అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని, డార్క్‌వెబ్‌లో అమ్మేస్తానని బెదిరించసాగాడు. దాంతో బాధితులు చేసేదేం లేక తుషార్ అడిగిన డబ్బులు సమర్పించుకుంటున్నారు.
తుషార్ సింగ్ అరాచకాలు ఎలా బయటికొచ్చాయంటే..
ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన సెకండ్ ఇయర్ స్టూడెంట్ కూడా అందరి తరహాలోనే తుషార్ సింగ్ ట్రాప్‌లో పడ్డారు. అయితే, ఎప్పుడైతే ఆమె తుషార్‌ను కలవాల్సిందిగా కోరారో... అప్పటి నుండి ఎవేవో సాకులు చెబుతూ తప్పించుకుతిరుగుతూ వచ్చాడు. ఆమె నుండి ఒత్తిడి ఎక్కువ అవడంతో అప్పుడు తన అసలు రంగును బయటపెట్టాడు.
ఆ విద్యార్థినికి ఆమె ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు (Woman's private photos and వీడియోస్) పంపించి డబ్బులు ఇవ్వాల్సిందిగా బెదిరించాడు. ఈ ఊహించని పరిణామంతో షాక్ అయిన బాధితురాలు.. తాను స్టూడెంట్‌నని, తన వద్ద అంత డబ్బు లేదని చెప్పి తన వద్ద ఉన్న డబ్బులు ఇచ్చేశారు. అయినప్పటికీ తుషార్ తనను విడిచిపెట్టకపోవడంతో బాధితురాలు కుటుంబసభ్యుల సాయంతో 2024 డిసెంబర్ 13న సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదుచేశారు.
తుషార్ కోసం సైబర్ క్రైమ్ పోలీసు టీమ్
బాధితురాలి ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ వెస్ట్ ఢిల్లీ ఏసీపీ అర్వింద్ యాదవ్ నేతృత్వంలో ఒక టీమ్ ఏర్పడింది. రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు... బాధితురాలు చెల్లించిన బ్యాంక్ ఎకౌంట్ ఆధారంగా ట్రేస్ చేసి తుషార్‌ను పట్టుకున్నారు. అతడి సింగ్ నివాసంలో సోదాలు చేశారు. అక్కడి నుండి అతడు నేరాల కోసం ఉపయోగించిన ఒక వర్చువల్ ఇంటర్నేషనల్ నెంబర్, మొబైల్ ఫోన్, వేర్వేరు బ్యాంకులకు చెందిన 13 క్రెడిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.
60 మంది అమ్మాయిలు, మహిళలతో తుషార్ చేసిన వాట్సాప్ చాట్స్ కూడా పోలీసులకు లభించాయి. అతడి రెండు బ్యాంక్ ఎకౌంట్స్‌లో ఒక ఖాతాకు కొన్ని వేర్వేరు నెంబర్ల నుండి డబ్బులు డిపాజిట్ అయినట్లు ఆధారాలు లభించాయి. పూర్తిస్థాయిలో టెక్నికల్ ఎనాలిసిస్ చేసి తుషార్ సింగ్‌పై అభియోగాలు నమోదు చేశారు. ఆన్‌లైన్‌లో పరిచయమైన వారిని నమ్మి మోసపోకూడదని ఈ ఘటన మరోసారి నిరూపించింది.