Jallikattu: తమిళనాడులో జల్లికట్టు ప్రారంభం.. బరిలోకి 600కిపైగా ఎద్దులు

Jallikattu: తమిళనాడులో సంప్రదాయ జల్లికట్టు క్రీడలు ప్రారంభమయ్యాయి. తమిళనాడులో పొంగల్ పండుగ సందర్భంగా ఏటా జనవరిలో జల్లికట్టు నిర్వహిస్తారు.

Update: 2025-01-04 08:13 GMT

Jallikattu: తమిళనాడులో జల్లికట్టు ప్రారంభం.. బరిలోకి 600కిపైగా ఎద్దులు

Jallikattu: తమిళనాడులో సంప్రదాయ జల్లికట్టు క్రీడలు ప్రారంభమయ్యాయి. తమిళనాడులో పొంగల్ పండుగ సందర్భంగా ఏటా జనవరిలో జల్లికట్టు నిర్వహిస్తారు. పరుగెత్తే ఎద్దులను పట్టుకుని నిలువరించేందుకు యువకులు ప్రయత్నిస్తారు. అలాగే గ్రౌండ్‌లో ఎద్దులను లొంగదీసుకుని వాటిపై ఆధిపత్యం చెలాయించేందుకు పోటీపడతారు. తాజాగా పుదుక్కోట్టై జిల్లాలో జల్లికట్టు క్రీడలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తచ్చన్‌కురిచి‌లో జరిగిన ఈ జల్లికట్టు క్రీడలో తిరుచ్చి, దిండిగల్, మనప్పరై, పుదుక్కోట్టై, శివగంగై జిల్లాల నుంచి దాదాపు 600కి పైగా ఎద్దులను ఈ పోటీల కోసం సిద్దం చేశారు. సుమారు 300 మందికి పైగా యువకులు ఎద్దులను నిలవరించేందుకు పోటీపడ్డారు.

జల్లికట్టు ఉత్సవం.. తమిళనాడు రాష్ట్రంలో ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ప్రతి సంక్రాంతి పండుగ సందర్భంగా తమిళనాడులో జల్లికట్టు ఉత్సవం జరుపుకుంటారు. జల్లికట్టు అంటే ఎద్దులను, కోడెలను బెదరగొట్టి ఒక మార్గం వదిలిపెడతారు. గుంపులుగా పరుగులు తీస్తున్న ఎద్దులను యువకులు లొంగదీసే ప్రయత్నం చేస్తారు. అలా లొంగదీసిన వ్యక్తిని విజేతగా ప్రకటిస్తారు. జల్లికట్టు పోటీలకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. ఈ పోటీలను వీక్షించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు తరలివస్తుంటారు. దీంతో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భారీ బందోబస్తు నిర్వహించింది. గాయపడిన వారికి వెంటనే చికిత్స అందించేందుకు అవసరమైన ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసింది.

తమిళనాడులో జల్లికట్టుకు ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది. ఏటా పొంగల్ సమయంలో కనుమ నాడు ఈ వేడుకను నిర్వహిస్తారు. క్రీ.పూ 400-100 ఏళ్ల మధ్య కాలంలోనే జల్లికట్టు నిర్వహించినట్టు ఆధారాలున్నాయి. ఈ క్రీడ నిర్వహించిన తొలి రోజుల్లో ఎద్దును లొంగదీసుకున్న ధైర్యవంతులైన యువకులను మహిళలు తమ భర్తలుగా ఎంచుకునేవారు. తర్వాతి కాలంలో యువకులు తమ ధైర్య సాహసాలను నిరూపించుకునే ఆటగా ఇది రూపాంతరం చెందింది. ఎద్దు మెడకు బంగారం లాంటి విలువైన పట్టిని కట్టేవారు. పరుగెడుతున్న ఎద్దుును పట్టుకుని ఆ పట్టిని తీసుకున్నవారిని విజేతగా ప్రకటించేవారు. వారికి బహుమతి అందించేవారు.

నీలగిరి జిల్లాలోని కరిక్కియూర్ గ్రామంలో దాదాపు 3500 ఏళ్ల నాటి శిలా ఫలకాలపై ఎద్దులను మనుషులు తరుముతున్న దృశ్యాలు చెక్కి ఉన్నాయి. దీన్ని బట్టి నాటికే జల్లికట్టు ప్రాచుర్యం పొందిందని తెలుస్తోంది. మదురై పట్టణానికి 35 కిలోమీటర్ల దూరంలోని కళ్లుత్తు మెట్టుపట్టి అనే ప్రాంతంలో 1500 ఏళ్ల క్రితం నాటి రాతి ఫలకం లభ్యమైంది. ఎద్దును మనిషి లొంగదీసుకుంటున్నట్టుగా దీనిపై చిత్రించారు.

ప్రస్తుత రోజుల్లో ఎద్దు మెడకు ఏ పట్టీ కట్టడంలేదు. పరుగెడుతున్న ఎద్దును లొంగదీసుకోవడానికే నేటి జల్లికట్టు పరిమితమైంది. ఇందులో ఎద్దు కాళ్ల కింద పడటం, దాన్ని లొంగదీసుకునే క్రమంలో కొమ్ములు శరీరంలోకి దిగడం వల్ల గాయాలయ్యే ప్రమాదం ఉంది. భారీ జనం మధ్యలో వదలడం వల్ల ఎద్దు బెదిరే అవకాశం ఉంది కానీ.. దాని ప్రాణాలకు దాదాపుగా ఎలాంటి ముప్పు ఉండదని అక్కడి వాళ్లు చెబుతుంటారు. అయితే, ఇది జంతు హింసే అవుతుందనే వాళ్లు కూడా లేకపోలేదు. ఇదే విషయమై గతంలో సుప్రీం కోర్టులో కేసు కూడా నడిచింది.

జనం మధ్యలోకి ఎద్దును వదలగా.. దాని కొమ్ములు లేదా తోకను పట్టుకుని చేతులతోనే నియంత్రించేందుకు చాలా మంది యువకులు ప్రయత్నిస్తారు. ఎద్దు మూపురాన్ని బలంగా పట్టుకుని లొంగదీసుకోవాలని చూస్తారు. జల్లికట్టు కోసం రైతులు ఎద్దులను ప్రత్యేకంగా సన్నద్ధం చేస్తారు. ఎద్దుల కాళ్లు బలంగా తయారవడం కోసం వాటితో ఈత కొట్టిస్తారు. ఎద్దు బలంగా, ఆరోగ్యంగా ఉండడం కోసం అనేక జాగ్రత్తలు తీసుకుంటారు.

Tags:    

Similar News