Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ఖరారు..!
Devendra Fadnavis: మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ పక్ష నాయకుడిగా దేవేంద్ర ఫడ్నవీస్ ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు.
Devendra Fadnavis: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ డిసెంబర్ ఐదో తేదీని ప్రమాణం చేయనున్నారు. బుధవారం జరిగిన విధాన్ భవన్ లో జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో ఫడ్నవీస్ ను బీజేపీ శాసనసభపక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీ పరిశీలకులుగా హాజరయ్యారు.అంతకు ముందు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరును బీజేపీ కోర్ కమిటీ నిర్ణయించింది.
బీజేపీ శాసనసభపక్ష నాయకుడిగా ఫడ్నవీస్ ఎన్నికైన విషయం తెలియగానే ఆయన ఇంటి ముందు బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ నెల 5న ప్రమాణం చేయనున్నారు. ముంబైలోని ఆజాద్ మైదానంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుంది. ప్రధాని మోదీతో పాటు ఎన్ డీ ఏ భాగస్వామ్యపక్షాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
పదవుల పంపకంలో బీజేపీకే పెద్ద పీట
ముఖ్యమంత్రి పదవితో పాటు హోంమంత్రి, స్పీకర్ పదవులు తీసుకోనుంది. ఎన్ సీ పీ(అజిత్ పవార్) వర్గానికి , శివసేన( ఏక్ నాథ్ షిండే) వర్గాలకు డిప్యూటీ సీఎం పదవిని ఇవ్వనున్నారు. అర్బన్ డెవలప్ మెంట్, రెవిన్యూ మంత్రి పదవులు కూడా ఈ పార్టీలకు కేటాయించనున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో 43 మందికి మంత్రి పదవులు ఇవ్వవచ్చు. అయితే ఇందులో 21 పదవులు బీజేపీ తీసుకోనుంది. శివసేన (షిండే) వర్గం 12, ఎన్ సీ పీ (అజిత్ పవార్ ) వర్గం 10 సీట్లు దక్కించుకోనుంది.