Maharashtra CM: ఏక్‌నాథ్ షిండేతో దేవేంద్ర ఫడ్నవిస్ భేటీ.. సీఎం ఎవరని సర్వత్రా ఉత్కంఠ

Update: 2024-12-03 15:56 GMT

Devendra Fadnavis Eknath Shinde meeting: మహారాష్ట్రలో కాబోయే సీఎం ఎవరనే అంశంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. సీఎం రేసులో ఉన్న బీజేపి నేత దేవేంద్ర ఫడ్నవిస్ తాజాగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేతో భేటీ అయ్యారు. ఏక్ నాథ్ షిండే అధికారిక నివాసంలో ఈ భేటీ జరుగుతోంది. మహాయుతి కూటమి నుండి ముఖ్యమంత్రి ప్రకటన రావడానికి ముందు జరుగుతున్న ఈ భేటీకి రాజకీయంగా భారీ ప్రాధాన్యం సంతరించుకుంది.

బీజేపి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరిని నిలబెట్టినా వారికి తన మద్దతు ఉంటుందని ఏక్‌నాథ్ షిండే చెబుతూ వస్తున్నారు. అయితే, అధికారం పంపకాల విషయంలోనే మహాయుతి కూటమి నేతల మధ్య ఏకాభిప్రాయం రావడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా తొలుత సీఎం సీటును ఆశించి భంగపడిన ఏక్‌నాథ్ షిండే వైపు నుండే డిమాండ్స్ అధికంగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.

ఏక్‌నాథ్ షిండే అసంతృప్తితో ఉన్నారా?

ముఖ్యమంత్రి ప్రకటనకు తాను అడ్డం కానని ఏక్‌నాథ్ షిండే చెబుతున్నప్పటికీ.. లోలోపల పోర్ట్‌ఫోలియోల పంపకాల వద్ద తేడాలొస్తున్నాయనే టాక్ బలంగా వినిపిస్తోంది. ముఖ్యమంత్రి ఎవరనే ప్రకటన రాకముందే ఏక్‌నాథ్ షిండే సొంతూరికి వెళ్లారు. ఆ తరువాత ముంబైకి తిరిగొచ్చాక శుక్రవారం నాడు అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరి డిశ్చార్జ్ అయ్యారు. ఇవన్నీ ఏక్‌నాథ్ షిండే అసంతృప్తితో ఉన్నారనేందుకు నిదర్శనంగా చూపిస్తున్నారు.

దేవేంద్ర ఫడ్నవిస్ అందుకే ఏక్‌నాథ్ షిండే ఇంటికి వెళ్లారా?

ఇలాంటి పరిస్థితుల్లో మంగళవారం సాయంత్రం దేవేంద్ర ఫడ్నవిస్, ఏక్‌నాథ్ షిండేల భేటీ అవడం మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఏక్‌నాథ్ షిండేతో పదవుల పంపకాలపై చర్చించి, ఆయన సందేహాలకు సమాధానం ఇచ్చేందుకే దేవేంద్ర ఫడ్నవిస్ అక్కడికి వెళ్లారా అనేది ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయవర్గాల్లో వినిపిస్తున్న టాక్. 

Tags:    

Similar News