PM Modi takes a dig at Mamatha Banerjee and Aravind Kejriwal: పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, అలాగే ఢిల్లీని పరిపాలిస్తోన్న ఆమ్ ఆద్మీ పార్టీలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో 70 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం కింద హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద వారికి సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా లభిస్తుంది.
అయితే, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అమలు చేయకపోవడం వల్ల అక్కడి వృద్ధులకు తాను సేవ చేసుకోలేకపోతున్నానని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తంచేశారు. అక్కడి వృద్ధులు ఈ విషయంలో తనని క్షమించాలని అన్నారు. అధికార పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఇబ్బందిపెట్టడం అమానవీయం అవుతుందని మోదీ అభిప్రాయపడ్డారు.
ఒకప్పుడు ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రికి వెళ్లిన వాళ్లు చికిత్స కోసం ఇల్లు, వాకిలి, భూములు, నగలు వంటి యావదాస్తిని అమ్ముకోవాల్సి వచ్చేది. క్లిస్టమైన జబ్బులు వచ్చిన పేద వాళ్లయితే ఆస్పత్రి బిల్లు వినడంతోనే భయపడిపోయే వాళ్లు. పేదరికం కారణంగా చికిత్స తీసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ల ఆవేదన అంతా ఇంతా కాదు. కానీ నా సోదర సోదరీమణులు అలా బాధపడటం నేను చూడలేకపోయాను. అందుకే వాళ్ల కోసం ఏదైనా చేయాలన్న ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిందే ఈ ఆయుష్మాన్ భారత్. కానీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పథకాన్ని అమలు చేయకపోవడం వల్ల అక్కడి వృద్ధులకు ఆ ఫలాలు అందడం లేదని మోదీ ఆందోళన వ్యక్తంచేశారు.