Nimisha Priya: యెమెన్‌లో మరణశిక్ష నుంచి ఈ భారతీయ నర్సు తప్పించుకోగలరా? ఆ ఛాన్స్ ఉందా?

Can Indian govt save Nimisha Priya from death sentence in Yemen: తలాల్ అబ్దో మహ్ది అనే వ్యక్తి హత్య కేసులో కేరళకు చెందిన ఈ నర్స్‌కు యెమెన్ సర్కారు మరణ శిక్ష ఖరారు చేసింది. నిమిష ప్రియ ముందున్న ఆప్షన్స్ ఏంటి? నిమిష ప్రియను మోదీ సర్కారు కాపాడగలదా?

Update: 2025-01-02 01:30 GMT

Can Indian govt save Nimisha Priya from death sentence in Yemen: నిమిష ప్రియ అనే భారతీయ మహిళకు యెమెన్ ప్రభుత్వం మరణ శిక్ష విధించింది. తలాల్ అబ్దో మహ్ది అనే వ్యక్తి హత్య కేసులో కేరళకు చెందిన ఈ నర్స్‌కు యెమెన్ సర్కారు మరణ శిక్ష ఖరారు చేసింది. ఇంతకీ ఈ నిమిష ప్రియ ఎవరు? తలాల్ అబ్దో మహ్ది హత్య కేసుతో ఆమెకు ఏం సంబంధం? యెమెన్ చట్టాల ప్రకారం నెల రోజుల్లో నిమిష ప్రియకు మరణ శిక్ష అమలు కావాల్సి ఉంది. మరి ఈ వివాదంపై ఇండియన్ గవర్నమెంట్ ఏం చెబుతోంది? నిమిష ప్రియను మోదీ సర్కారు కాపాడగలదా తెలియాలంటే ఈ డీటెయిల్ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

Full View

నిమిష ప్రియ స్టోరీలో ఊహించని ట్విస్టులు

నిమిష ప్రియ తొలిసారిగా 2011 లో యెమెన్ వెళ్లారు. అక్కడ ఆమె నర్స్‌గా పనిచేస్తున్నారు. అయితే, ఆర్థిక ఇబ్బందుల కారణంగా 2014 లో ఆమె భర్త, కూతురు ఇండియాకు తిరిగి రావాల్సి వచ్చింది. ఆ తరువాత అనుకోకుండా యెమెన్‌లో సివిల్ వార్ కారణంగా మళ్లీ వారు కలుసుకునే అవకాశం రాలేదు. దాంతో ప్రియ అక్కడే ఒక క్లినిక్ ఓపెన్ చేశారు. ఈ క్లినిక్ కోసం అప్పట్లో చేసిన అప్పు ఇప్పుడు రూ. 60 లక్షలకు చేరుకుంది. క్లినిక్ పెట్టడం కోసం యెమెన్‌కు చెందిన తలాల్ అబ్దో మహ్దిని క్లినిక్‌లో భాగస్వామిగా తీసుకున్నారు.

యెమెన్ దేశ చట్టాల ప్రకారం అక్కడ విదేశీయులు వచ్చి మెడికల్ ఫెసిలిటీ రన్ చేయాలంటే అందులో స్థానికుల భాగస్వామ్యం ఉండి తీరాల్సిందే. అందుకే నిమిష ప్రియ స్థానిక చట్టాలను గౌరవిస్తూ అతడితో కలిసి అక్కడ క్లినిక్ రన్ చేస్తూ వచ్చారు.

నిమిష ప్రియ చెప్పిన వివరాల ప్రకారం.. కుటుంబానికి దూరంగా, ఒంటరిగా ఉండడం వల్ల ఆమెకు బిజినెస్ పార్ట్‌నర్‌గా తలాల్ అబ్దో మహ్ది అవసరం తప్పనిసరైంది. అయితే, ఆసరాగా ఉంటాడనుకున్న తలాల్ మహ్ది వల్లే ఆమె జీవితం ఇబ్బందుల్లో పడింది. అతడు నిమిష పాస్‌పోర్టు, ఇతర పత్రాలు తీసుకుని ఆమెను పెళ్లి చేసుకున్నట్లుగా ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించారు. దానితో పాటు, తనను భౌతికంగా, మానసికంగా వేధించారని నిమిష ప్రియ చెప్పారు.

తలాల్ మహ్ది తనను బెదిరించేవాడని, క్లినిక్ నుంచి డబ్బులు డిమాండ్ చేసేవాడని కూడా ఆమె తెలిపారు. ఆమెను చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు డ్రగ్స్ కూడా ఇచ్చేవారు. తలాల్ మహ్ది ఆగడాలు భరించలేక ఆమె చివరకు లోకల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ, అక్కడి పోలీసులు అతడిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి ఆమెనే అరెస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి.

తలాల్ అబ్దో మహ్దిని ఎవరు మర్డర్ చేశారు?

తలాల్ మహ్ది నుండి పాస్ పోర్ట్ తిరిగి తీసుకుని వేధింపుల నుండి బయటపడేందుకు ప్లాన్ చేస్తోన్న ఆమెకు జైలు వార్డెన్ ఓ ఉపాయం చెప్పారు. తలాల్ మహ్దికి మత్తు మందు ఇచ్చి ఆ తరువాత పాస్ పోర్ట్ తీసుకుని బయటపడాల్సిందిగా సలహా ఇచ్చారు. ఆ సలహా ప్రకారమే నిమిష ప్రియ 2017 జులైలో తలాల్ మహ్దికి మత్తు మందు ఇచ్చారు. అయితే, అది కాస్తా ఓవర్ డోస్ అవడంతో ఆయన మృతి చెందారు.

ఈ ఊహించని పరిణామంతో ఏం చేయాలో అర్థం కాక తనతో పాటు కలిసి పనిచేసే యెమెన్‌కే చెందిన హనన్ అనే వ్యక్తి సహాయంతో తలాల్ మహ్ది డెడ్ బాడీని నీళ్ల ట్యాంకులో పడేశారు. తలాల్ అబ్దో మహ్ది హత్య కేసులో స్థానిక పోలీసులు నిమిష ప్రియను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. 2018 లో యెమెన్ ట్రయల్ కోర్టు ఆమెకు మరణ శిక్ష విధించింది.

ట్రయల్ కోర్టు విధించిన మరణ శిక్ష రద్దు చేయాల్సిందిగా కోరుతూ నిమిష ప్రియ యెమెన్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కానీ 2018 లో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థిస్తూ 2023లో సుప్రీం కోర్టు తుది తీర్పు చెప్పింది. తాజాగా.. అంటే 2024 డిసెంబర్ 30న యెమెన్ ప్రెసిడెంట్ రషద్ అల్-అలిమి కూడా నిమిష ప్రియకు మరణ శిక్షను ఆమోదించే ఫైలుపై సంతకం చేశారు.

హత్య చేసే ఉద్దేశం లేకుండానే...

తలాల్ అబ్దో మహ్దిని హత్య చేసే ఉద్దేశం నిమిష ప్రియకు లేదు. కానీ మత్తు మందు ఓవర్ డోస్ అయిన కారణంగా ఆయన చనిపోయారు. దాంతో, ఆమె హత్యా నేరారోపణల్లో చిక్కుకున్నారు. అతడికి కొద్దిగా మత్తు మందు ఇచ్చి, పాస్ పోర్టు తీసుకుని వెళ్ళిపోవాలనుకున్న నిమిష ప్రియ ఈ ఊహించని ఘటనతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు.

నెలరోజుల్లోపే మరణ శిక్ష అమలు

నిమిష ప్రియ మరణ శిక్ష గురించి యెమెన్ మీడియా చెబుతున్న కథనాల ప్రకారం ఆమెకు మరో నెల రోజుల్లోపే శిక్ష అమలు చేసే అవకాశం ఉంది. దీంతో ఏదో ఒక మిరాకిల్ జరిగితే కానీ నిమిష ప్రియ రాక కోసం ఎదురుచూస్తోన్న ఆమె చిన్నారి కూతురుకు తల్లి ప్రేమ దక్కేలా లేదు. ఆ చిన్నారికి రెండేళ్లప్పుడు 2014 లో నిమిష ప్రియ భర్త టోమి థామస్ ఆమెను తీసుకుని ఇండియాకు వచ్చేశారు. ఇప్పుడా అమ్మాయి వయస్సు 13 ఏళ్లు. ఊహ తెలిసినప్పటి నుండి ఆ చిన్నారు త తల్లి రాక కోసం వేయికళ్లతో ఎదురుచూస్తోంది.

కేరళలో దీన స్థితిలో నిమిష ప్రియ కుటుంబం

యెమెన్ లో నిమిష ప్రియ క్లినిక్ పెట్టడం కోసం కేరళలో ఆమె భర్త టోమీ థామస్ చేసిన అప్పు తడిసిమోపెడై 60 లక్షలకు పెరిగింది. ఆ అప్పు తీర్చడానికి థామస్ ఇల్లువాకిలి అమ్మేశారు. ఆమె తల్లి కూడా తనకున్న ఇంటిని అమ్మేసుకున్నారు. అంతా కలిసి ఇప్పుడు ఒక చిన్న ఇంట్లో జీవితం వెళ్లదీస్తున్నారు. తన బిడ్డను చదివించే స్తోమత లేకపోవడంతో థామస్ ఆ చిన్నారిని హాస్టల్లో చేర్పించారు. తను ఆటోరిక్షా తోలుతూ, కూలీ పనులకు వెళ్తూ బతుకు భారంగా వెళ్లదీస్తున్నారు. అన్ని సవాళ్లు ఎదుర్కుంటూనే యెమెన్‌లో ఉన్న నిమిష ప్రియ కోసం మరోవైపు ఖరీదైన న్యాయ పోరాటం చేస్తున్నారు.

నిమిష ప్రియ ముందున్న ఆప్షన్స్ ఏంటి?

యెమెన్‌లో తలాల్ మహ్ది కుటుంబాన్ని కలిసి వారికి దియా ఇచ్చి తన భార్యను కాపాడుకోవాలని టోమీ థామస్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. దియా అంటే... ఉద్దేశపూర్వకంగా చేయని హత్య కేసుల్లో బాధితుల కుటుంబానికి నష్ట పరిహారంగా చెల్లించే మొత్తాన్ని దియా అంటారు. దీనినే ఇంగ్లీషులో బ్లడ్ మనీ అని అంటారు. హత్యకు గురైన వారి కుటుంబసభ్యులు అంగీకరిస్తే అలా దియా ఇచ్చి తన భార్యను కాపాడుకుంటానని థామస్ చెబుతున్నారు.

భారత్ ఆ పని చేస్తుందా?

యెమెన్‌లోని సనాలో ఉన్న ఎన్నారై సామాజిక కార్యకర్తలు నిమిష ప్రియకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ప్రేమ కుమారి అనే యాక్టివిస్ట్ నేతృత్వంలో సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ పేరుతో ఒక సంస్థ అదేపనిగా కృషిచేస్తోంది. హత్యకు గురైన తలాల్ మహ్ది కుటుంబంతో సంప్రదింపులు జరుపుతోంది. కానీ ఆగ్రహంతో ఉన్న ఆ కుటుంబం దియా తీసుకుని నిమిష ప్రియను క్షమించేందుకు సిద్ధంగా లేదని తెలుస్తోంది.

మరోవైపు ఈ విషయంలో తమ వైపు నుంచి సహకారం అందిస్తామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ తెలిపారు. యెమెన్‌లో ఉన్న ఎంబసీ ద్వారా భారత్ కూడా తలాల్ మహ్ది కుటుంబాన్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తుందా (What Indian Embassy in Yemen is doing to save Nimisha Priya from death sentence) ? అదే జరిగితే మరణ శిక్ష నుంచి తప్పించుకుని నిమిష ప్రియ స్వదేశానికి తిరిగి వస్తుంది. ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న తన బిడ్డను, తన కుటుంబ సభ్యులను తిరిగి కలుసుకోగలుగుతుంది. అలా జరగాలని ఆశిద్దాం.

Tags:    

Similar News