Top 6 News @ 6 PM: రైతు భరోసా పథకంపై కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలు - ఏపీ కేబినెట్ నిర్ణయాలు ఏంటంటే..
1) రైతు భరోసా పథకం విధివిధానాలపై క్యాబినెట్ సబ్ కమిటీ ఏం నిర్ణయం తీసుకుందంటే..
రైతు భరోసా పథకం విధివిధానాలపై చర్చించేందుకు జరిగిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఏయే రైతులకు రైతు భరోసా ఇవ్వాలనే అంశంపై చర్చ జరిగింది. పంట పండించే ప్రతీ రైతుకు రైతు భరోసా ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. అయితే, దీనిపై అంతిమ నిర్ణయం మాత్రం ఎల్లుండి జరిగే క్యాబినెట్ భేటీలో తీసుకుంటారు.
తాజాగా క్యాబినెట్ సబ్-కమిటీ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన నివేదిక సీఎం రేవంత్ రెడ్డికి చేరాల్సి ఉంది. మరోవైపు జనవరి 4 శనివారం సాయంత్రం 4 గంటలకు తెలంగాణ క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ క్యాబినెట్ భేటీలోనే సీఎం రేవంత్ రెడ్డి మిగతా మంత్రులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. రైతు భరోసా పథకం లబ్ధిదారుల ఎంపిక కోసం కొత్తగా రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించనున్నారు.
జనవరి 4న కేబినెట్ భేటీ ముగిసిన వెంటనే దీనిపై ఒక ప్రకటన చేయనున్నారు. జనవరి 5 నుంచి 7 వరకు దరఖాస్తులు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. వారం రోజుల్లో లబ్దిదారుల ఎంపిక పూర్తి చేసి సంక్రాంతి కానుకగా జనవరి 14 నుంచి రైతు భరోసా అమలు చేసేందుకు తెలంగాణ సర్కారు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోందని సమాచారం.
2) ఏపీ క్యాబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు
ఏపీ క్యాబినెట్ భేటీ ముగిసింది. అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా రూ. 2,733 కోట్ల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు క్యాబినెట్ ఓకే చెప్పింది. భవనాల నిర్మాణాలు, లేఅవుట్లకు అనుమతుల జారీ విషయంలో అధికారాలను మున్సిపాలిటీలకు ట్రాన్స్‌ఫర్ చేసే బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్ఐపీబీ ఆమోదించిన రూ.1,82,162 కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మిగతా ముఖ్యమైన నిర్ణయాలు ఇలా ఉన్నాయి.
గుంటూరు జిల్లా పత్తిపాడు మండలంలో 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణం
తిరుపతి ఈఎస్ఐ ఆస్పత్రిని 100 పడకలకు పెంచడం
పిఠాపురం ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ నిర్వహణకు వీలుగా సిబ్బంది నియామకం కోసం 19 పోస్టుల ఏర్పాటు
3) సీఎంఆర్ కాలేజ్ గల్స్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాల కేసు... రంగంలోకి మహిళా కమిషన్ ఎంట్రీ
మేడ్చల్ సమీపంలో స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన సీఎంఆర్ కాలేజ్ గల్స్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాల కేసుపై మహిళా కమిషన్ స్పందించింది. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక అందించాల్సిందిగా హైదరాబాద్ పోలీసులను తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో కాలేజీలో పనిచేసే ఐదుగురు సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వారి సెల్ ఫోన్స్ కూడా స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు జరుపుతున్నారు.
4) Borugadda Anil Kumar: బోరుగడ్డ అనిల్ కు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ
బోరుగడ్డ అనిల్ కు (Borugadda Anil)ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో (Andhra Pradesh High Court)ఎదురు దెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను (Bail Petition) కోర్టు కొట్టింేసింది. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారని కోర్టు వ్యాఖ్యలు చేసింది.
పిటిషనర్ నేర చరిత్ర కలిగి ఉన్నారని కోర్టుకు పోలీసులు చెప్పారు. ప్రాసిక్యూషన్ వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు.ఇలాంటి కేసుల్లో నిందితులను క్షమించడానికి వీల్లేదని కోర్టు అభిప్రాయపడింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల కేసుల్లో నమోదైన రెండు కేసుల్లో ఆయనపై చార్జీషీట్ దాఖలు చేసిన విషయాన్ని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇదే విషయమై అనంతపురం ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
5) 2026 తర్వాత కేంద్రంలో మోడీ సర్కార్ కొనసాగుతుందో లేదో? సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
Sanjay Raut: 2026 తర్వాత కేంద్రంలో ఎన్డీయే సర్కార్ కొనసాగుతుందో లేదో అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అనుమానం వ్యక్తంచేశారు. సంజయ్ రౌత్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకోలేరు అనే సందేహం కలుగుతుందన్నారు. మోడీ ప్రభుత్వంలో అస్తిరత ఏర్పడితే మహారాష్ట్రలో కూడా ఆ ప్రభావం కనిపిస్తోందన్నారు.
మరోవైపు ఉద్దవ్ థాక్రే శివసేన పార్టీకి చెందిన రాజన్ సాల్వీ పార్టీ నుంచి వెళ్లిపోతారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే దీనిపై స్పందించిన సంజయ్ రౌత్.. దర్యాప్తు సంస్థలు అరెస్టు చేస్తాయనే భయంతోనే అనేక మంది ఇతర పార్టీలోకి వెళ్తుంటారని చెప్పారు. అలాగే దర్యాప్తు సంస్ధలకు, కేంద్ర ప్రభుత్వ ఒత్తిళ్లకు భయపడని వ్యక్తులతో పార్టీని నిర్మించేందుకు యత్నిస్తున్నట్లు తెలిపారు.
6) Chinmoy Krishna Das: చిన్మయ్ కృష్ణదాస్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ
చిన్మయ్ కృష్ణదాస్(Chinmoy Krishna Das) బెయిల్ పిటిషన్ ను చటోగ్రామ్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు తిరస్కరించింది. 2024, నవంబర్ 25న బంగ్లాదేశ్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన జైల్లో ఉన్నారు. బంగ్లాదేశ్ లో ఇస్కాన్ తరపున ఆయన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. బంగ్లాదేశ్ లో మైనార్టీలు, ముఖ్యంగా హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ సాగిన ఆందోళన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమయంలో బంగ్లాదేశ్ జాతీయ జెండాను ఆయన అవమానించారనే అభియోగాలు మోపారు. ఈ కేసులో ఆయనను అరెస్ట్ చేశారు.
చిన్మయ్ కృష్ణదాస్ తరపున వాదనలు వినిపించేందుకు న్యాయవాదులు ముందుకు రాలేదు. ఓ న్యాయవాది ముందుకు వచ్చినా అతనిపై దాడి జరిగింది. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.