పెద్దపల్లి జిల్లాలో జరిగిన హైకోర్టు న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మృతుడు వామన్‌రావు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఏ1గా కుంట శ్రీనివాస్, ఏ2గా వసంతరావు, ఏ3గా కుమార్‌పై కేసు నమోదు చేశారు. ముగ్గురిపై కుట్ర, మర్డర్ అభియోగాలు, ఐపీసీ 120 బి, 302 341, 34 కింద కేసు నమోదు చేశారు.
అయితే మరోవైపు లాయర్ మర్డర్‌కు నిరసనగా ఇవాళ మంథని బంద్‌కు అఖిలపక్షం బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ హత్యకు సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. మరోవైపు ఇవాళ పెద్దపల్లికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రానున్నారు. ప్రభుత్వ ఆస్పత్రి లో వామన్‌రావు దంపతులకు నివాళులు అర్పించనున్నారు.
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కలవచర్ల గ్రామంలో న్యాయవాదిపై దుండగులు దారుణంగా హత్య చేశారు. మంథని నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న సమయంలో వామన్‌రావు, నాగమణి దంపతులను కత్తులతో వేటాడి హత్య చేశారు అయితే ఈ కేసులో సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. వామన్‌రావు అన్యాయాలపై పోరాడినట్టు ప్రశ్నించినందుకే ఆయన్ను పొట్టన పెట్టుకున్నట్టు సన్నిహితులు ఆరోపిస్తున్నారు.