Election commission: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు తేదీలు ప్రకటించిన ఈసీ.. గమనించాల్సిన విషయాలు

Update: 2024-10-15 10:33 GMT

Maharashtra and Jharkhand Assembly Election Dates: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం తేదీలు ప్రకటించింది. మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించి నవంబర్ 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నట్లు ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు.

నవంబర్ 13న జార్ఖండ్ తొలి విడత ఎన్నికలు జరగనుండగా, 20వ తేదీన రెండో విడత ఎన్నికలు పూర్తి చేయనున్నారు. నవంబర్ 23న జార్ఖండ్ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అంటే ఒకే రోజు మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో అధికారం ఎవరిదో తేలిపోనుందన్నమాట.

మహారాష్ట్రలో ప్రస్తుత పరిస్థితి..

మహారాష్ట్రలో ప్రస్తుతం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివ సేన, బీజేపి, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ పార్టీలు కూటమిగా ఏర్పడి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ, ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివ సేన, శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ పార్టీలు ప్రతిపక్ష కూటమిగా ఉన్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీలు ఇలాగే కూటమిగా కలిసి సీట్లు పంచుకుని పోటీ చేస్తాయా లేక సీట్ల పంపకాల విషయంలో ఏకాభిప్రాయం లేక విడివిడిగానే పోటీ చేయాల్సి వస్తుందా అనేది తెలియాల్సి ఉంది. 

జార్ఖండ్ పాలిటిక్స్ విషయానికొస్తే..

జార్ఖండ్‌లో 2019 ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చ పార్టీకి (JMM) 30 సీట్లు, కాంగ్రెస్ పార్టీ 16 సీట్లు, రాష్ట్రీయ జనతా దళ్ 1 సీటు గెలుచుకున్నాయి. మొత్తం 81 స్థానాల్లో 30 స్థానాలు గెలుచుకున్న జేఎంఎం ఆ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో మిత్రపక్షాల సహాయంతో జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటివరకు జార్ఖండ్ లో అధికారంలో ఉన్న బీజేపి ఆ ఎన్నికల్లో కేవలం 25 స్థానాల్లోనే విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ అధికారం కోల్పోక తప్పలేదు. ఈసారి ఎలాగైనా జేఎంఎంని గద్దె దించి జార్ఖండ్‌లో అధికారం చేజిక్కించుకోవాలని బీజేపి ప్రయత్నాలు చేస్తోంది. చివరి ఎన్నికల్లో 16 స్థానాలకే పరిమితమైన తాము ఈసారైనా ప్రభావం చూపించాలని కాంగ్రెస్ భావిస్తోంది.

కాంగ్రెస్‌పై హర్యానా, కశ్మీర్ ఎన్నికల ప్రభావం

ఇటీవల హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. అటు జమ్ముకశ్మీర్‌లో కాంగ్రెస్ కూటమి గెలిచినప్పటికీ.. పెద్దగా చెప్పుకునే స్థాయిలో ఆ పార్టీకి స్థానాలు రాలేదు. అది అక్కడ ఒమర్ అబ్ధుల్లా విజయంగానే కనిపించింది. దాంతో జార్ఖండ్, మహారాష్ట్రలో అత్యధిక స్థానాలు గెలుచుకోవడం అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అనివార్యమైంది.

Tags:    

Similar News