Baba Siddique Murder Case: బాబా సిద్ధిఖితో పాటు ఆయన కుమారుడు జీషాన్‌ని కూడా చంపేందుకు కాంట్రాక్ట్.. కానీ

Update: 2024-10-14 10:34 GMT

Baba Siddique's Son MLA Zeeshan Siddique: మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖి మర్డర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం ముగ్గురు అరెస్ట్ కాగా వారిలో నేరుగా హత్యలో పాల్పంచుకున్న వారు ఇద్దరున్నారు. ఆ ఇద్దరు నిందితులు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో మరిన్ని సంచలన విషయాలు వెల్లడించారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హిట్ లిస్ట్‌లో కేవలం బాబా సిద్ధిఖీ మాత్రమే కాదు.. అతడి కుమారుడు, ఎమ్మెల్యే జీషాన్ సిద్ధిఖి కూడా ఉన్నారని నిందితులు తమ వాంగ్మూలంలో పేర్కొన్నారు. బాబా సిద్ధిఖిని, జీషాన్ సిద్ధిఖిని.. ఇద్దరిని కలిపి చంపేందుకే తమకు కాంట్రాక్ట్ ఇచ్చారని స్వయంగా నిందితులే అంగీకరించారు.

శనివారం రాత్రి బాబా సిద్ధిఖి హత్య జరిగిన సమయంలో బాబా సిద్ధిఖి, జీషాన్ సిద్ధిఖి ఇద్దరూ అక్కడికొస్తారని బిష్ణోయ్ గ్యాంగ్ చెప్పింది. అప్పుడే ఆ ఇద్దరినీ చంపేయాల్సిందిగా తమకు కాంట్రాక్ట్ అప్పగించారు. ఒకవేళ ఆ ఇద్దరూ కలిసి రానట్లయితే.. వారిలో ఎవరు మొదలు అక్కడికొస్తే, వారిని హత్య చేయాల్సిందిగా తమకు ఆదేశాలు ఇచ్చారని బాబా సిద్ధిఖి కిల్లర్స్ పోలీసులకు తెలిపారు.

జీషాన్ సిద్ధిఖి స్టోరీ ఏంటి?

బాబా సిద్దిఖి కుమారుడు జీషాన్ సిద్ధిఖి ప్రస్తుతం ముంబైలోని వాంద్రె ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి మహారాష్ట్ర అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన జీషాన్ సిద్ధిఖి, మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కి పాల్పడ్డారనే కారణంతో పార్టీ నుండి సస్పెండ్ చేశారు. బాబా సిద్ధిఖికి వారసుడిగా జీషాన్ సిద్ధిఖికి కూడా బలమైన అనుచరగణం ఉంది. ముఖ్యంగా ముస్లిం వర్గంలో బాబా సిద్ధిఖిని లైక్ చేసేవారంతా ఆయన రాజకీయ వారసుడిగా కొనసాగుతున్న జీషాన్ సిద్ధిఖిని కూడా అదే విధంగా అనుసరిస్తున్నారు. తండ్రి బాబా సిద్ధిఖి అడుగుజాడల్లోనే కుమారుడు జీషాన్ సిద్ధిఖి వెళ్తుండటం వల్ల ఆయన్ని కూడా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తమ హిట్ లిస్టులో పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

మాస్టర్‌మైండ్ జీషాన్ అఖ్తర్?

బాబా సిద్ధిఖి మర్డర్ ఘటనలో మొత్తం ముగ్గురు నిందితులు పాల్పంచుకున్నారు. బాబా సిద్ధిఖి మర్డర్ వెనుక లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సన్నిహిత సంబంధాలున్న మొహమ్మద్ జీషాన్ అఖ్తర్ మాస్టర్ మైండ్‌గా వ్యవహరించినట్లు పోలీసులు చెబుతున్నారు. శనివారం రాత్రి జీషాన్ సిద్ధిఖి ఆఫీస్ బయట సెక్యురిటీగా ఉన్న కానిస్టేబుల్ కళ్లలో కారం చల్లి మరీ ఈ హత్యకు పాల్పడ్డారు. ఆ ముగ్గురిలో హర్యానాకు చెందిన గుర్మైల్ బల్జిత్ సింగ్, ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన ధర్మరాజ్ కశ్యప్ పోలీసులకు పట్టుబడ్డారు. మూడో నిందితుడు శివకుమార్ గౌతం పరారీలో ఉన్నాడు.

ముంబై యాంటీ ఎక్స్‌టార్షన్ సెల్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, ఢిల్లీలో మొహమ్మద్ జీషాన్ అఖ్తర్, శివకుమార్ గౌతంల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి.

తండ్రీకొడుకుల మర్డర్ కోసం రెక్కీ, స్కెచ్

పోలీసుల విచారణలో ఈ మర్డర్ ప్లాన్‌కి సంబంధించి మరిన్ని వివరాలు వెలుగుచూశాయి. బాబా సిద్ధిఖి, అతడి కుమారుడు, ఎమ్మెల్యే అయిన జీషాన్ సిద్ధిఖిలను మర్డర్ చేసేందుకు కాంట్రాక్ట్ తీసుకున్న ముగ్గురు కిల్లర్స్ అందుకోసం పక్కా రెక్కి నిర్వహించారు. గత కొద్దిరోజులుగా ఆ ఇద్దరినే అనుసరిస్తూ వచ్చారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉండేందుకు తాము అద్దెకు ఉంటున్న కుర్లా ప్రాంతం నుండి బాంద్రా వరకు సాధారణ ప్రయాణికుల్లా ఆటోలలో ప్రయాణించారు.

బాబా సిద్ధిఖి, జీషాన్ సిద్ధిఖి తరచుగా ఎక్కడికెళ్తున్నారు, అక్కడ ఎంతసేపు ఉంటున్నారు అనే వివరాలు సేకరించారు. ఆ క్రమంలోనే రోజూ సాయంత్రం ఇద్దరూ కలిసి జీషాన్ ఆఫీసుకు వెళ్తున్నట్లు నోట్ చేసుకున్నారు. అక్కడే ఇద్దరినీ మర్డర్ చేసేందుకు స్కెచ్ వేసుకున్నారు. ఒకవేళ ఇద్దరూ కలిసి రానట్లయితే.. వారిలో ఎవరు మొదలు వస్తే వారిని మర్డర్ చేయాల్సిందిగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి నిందితులకు స్పష్టమైన ఆదేశాలు అందాయని పోలీసులు విచారణలో వెల్లడైంది.

Tags:    

Similar News