Baba Siddiqui Murder Case: బాబా సిద్దిఖీ హత్యకు పాటియాలా జైలులోనే ప్లాన్… ఎవరీ లారెన్స్ బిష్ణోయ్?

Update: 2024-10-14 11:15 GMT

Baba Siddiqui Murder Case: బాబా సిద్దిఖీ హత్యకు పాటియాలా జైలులో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్లాన్ చేసిందని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో హర్యానాకు చెందిన గుర్మైల్ సింగ్, ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ధర్మరాజ్ కశ్యప్,ప్రవీణ్ లోంకర్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు శివ కుమార్, మహమ్మద్ జీషాన్ అక్తర్, శుభం లోంకర్ లు పారిపోయారు. పంజాబ్ సింగర్ మూసేవాలా హత్యతో పాటు పలు హై ప్రొఫైల్ నేరాల్లో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కీలకంగా వ్యవహరించింది.

పాటియాల జైలులోనే హత్యకు ప్లాన్

పంజాబ్ జలంధర్ కు చెందిన మహమ్మద్ జీషన్ అక్తర్ దోపీడీ, హత్య కేసులో 2022లో అరెస్టయ్యారు. ఈ కేసులో ఆయనను పాటియాల జైలుకు తరలించారు. ఇక్కడే బిష్ణోయ్ గ్యాంగ్ తో ఆయనకు పరిచయం ఏర్పడింది. బాబా సిద్దిఖీని హత్య చేయాలని అక్తర్ ను ఆ గ్యాంగ్ సంప్రదించింది. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన గుర్మైల్ సింగ్ ను హర్యానాలోని కైతాల్ లో కలిశారని పోలీసులు చెప్పారు. బాబా సిద్దిఖీ హత్యకు గుర్మైల్ సింగ్, ధర్మరాజ్ కశ్యప్, శివకుమార్ లు జీషన్ ప్లాన్ ప్రకారం వ్యవహరించారు.

సిద్దిఖీ ఉండే ప్రాంతంతో పాటు ముంబైలో ఎక్కడ ఉండాలనే విషయమై నిందితులకు జీషన్ సమాచారం ఇచ్చేవారని పోలీసులు తెలిపారు. శివకుమార్, ధర్మరాజ్ కశ్యప్ లు పుణెలో స్క్రాప్ షాప్ లో పనిచేస్తున్నారు. వీరిద్దరూ ఉత్తర్ ప్రదేశ్ కు చెందినవారు. వీరిని ప్రవీణ్ లోంకర్ అతని సోదరుడు శుభం లోంకర్ లు కాంటాక్ట్ చేశారు.ఇలా వీరిద్దరూ ఈ కేసులో ఇన్ వాల్వ్ అయ్యారు. ఈ ఏడాది సెప్టెంబర్ కంటే ముందుగానే ఈ హత్యకు నిందితులు ప్లాన్ చేశారని పోలీసులు గుర్తించారు.

సిద్దిఖీ హత్య ఎలా జరిగింది?

సిద్దిఖీకి ముగ్గురు కానిస్టేబుల్ భద్రత కల్పిస్తున్నారు. ఆయనకు వై కేటగిరి భద్రత ఉందనేది వాస్తవం కాదని ముంబై క్రైమ్ బ్రాంచ్ డిప్యూటీ కమిషనర్ దత్తా నలవాడే తెలిపారు. అక్టోబర్ 12 ఒక్క కానిస్టేబుల్ మాత్రమే ఉన్నారు. మరో కానిస్టేబుల్ విధులకు రాలేదు. మూడో కానిస్టేబుల్ రాత్రిపూట విధులకు హాజరుకావాల్సి ఉంది. నిందితులు ఆటోలో వచ్చి కాల్పులకు దిగారు. దసరా సందర్భంగా టపాకాయలు కాల్చే సమయాన్ని నిందితులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. నిందితుల్లో ఒకరైన శివకుమార్ తన వెంట తెచ్చుకున్న 9.9 ఎంఎం పిస్టల్ తో ఆరు రౌండ్లపాటు కాల్పులకు దిగినట్టుగా పోలీస్ అధికారి నలవాడే చెప్పారు. అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ రాజేంద్ర ధబాడే, మరో కానిస్టేబుల్ ఇద్దరు షూటర్లను పట్టుకున్నారని ఆయన వివరించారు. భారతీయ న్యాయ సంహిత బిఎన్‌ఎస్ సెక్షన్‌లు 103 (1), 109, 125, 3 ( 5) సెక్షన్‌లతో పాటు ఆయుధాల చట్టంలోని 3, 25, 5 మరియు 27 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 37 మహారాష్ట్ర పోలీసు చట్టంలోని సెక్షన్ 137 కింద కూడా కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. సిద్దిఖీ హత్య జరిగిన ఒక రోజు తర్వాత అంటే అక్టోబర్ 13న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కు చెందిన శుభమ్ లోంకర్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ఈ హత్యకు తమదే బాధ్యత అని ప్రకటించారు.

ఎవరీ లారెన్స్ బిష్ణోయ్?

ఇటీవల కాలంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన హై ప్రొఫైల్ నేరాల్లో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరు తెరమీదికి వచ్చింది. ప్రధానంగా పంజాబ్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే మూసేవాలా హత్యతో ఈ గ్యాంగ్ పేరు ప్రధానంగా చర్చకు వచ్చింది. పంజాబ్ లోని ఫజిల్కా జిల్లాకుచెందిన లారెన్స్ ప్రస్తుతం గుజరాత్ సబర్మతి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఇతనిపై దోపీడీ, హత్య తదితర కేసులున్నాయి.ఇవి ఎక్కువగా రాజస్థాన్, పంజాబ్,చండీగఢ్ లలో నమోదయ్యాయి

లారెన్స్ బిష్ణోయ్ 1993 ఫిబ్రవరి 12న పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ లో జన్మించారు. అతని తండ్రి హర్యానా పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా పనిచేశారు. లారెన్స్ పుట్టిన నాలుగేళ్లకే ఆయన తండ్రి కానిస్టేబుల్ ఉద్యోగం వదిలి వ్యవసాయం ప్రారంభించారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్ సరిహద్దుల్లోని అబోహర్ అనే పట్టణంలో బిష్ణోయ్ 12వ తరగతి వరకు చదువుకున్నారు. 2010లో చండీగఢ్ లో డీఏవీ కాలేజీలో చేరారు. 2011లో అతను పంజాబ్ యూనివర్శిటీ క్యాంపస్ స్టూడెంట్స్ కౌన్సిల్ లో చేరారు. అక్కడే అతను గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్ ను తొలుత కలుసుకున్నారు. యూనివర్శిటీ రాజకీయాల్లో లారెన్స్ పాల్గొన్నారు. ఇదే యూనివర్శిటీ నుంచి ఎల్ఎల్ బీ పూర్తి చేశారు. యూనివర్శిటీలో ఉన్న సమయంలోనే ఆయన అనేక నేరాలకు పాల్పడ్డారు.

బిష్ణోయ్ పై కేసులు

చండీగఢ్ లో అతనిపై నమోదైన ఏడు ఎఫ్ఐఆర్ లలో నాలుగు కేసుల్లో నిర్ధోషిగా విడుదలయ్యారు. మూడు కేసులు ఇంకా విచారణలో ఉన్నాయి. 2012 నుండి బిష్ణోయ్ ఎక్కువగా జైలులోనే ఉన్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఆయుధాల వ్యాపారులు, స్థానిక నేరస్తులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. 2013లో ముక్త్ సర్ లో ప్రభుత్వ కాలేజీలో గెలిచిన అభ్యర్ధిని, లూథియానాలో మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఓ అభ్యర్ధిని కాల్చి చంపారు.

2014లో రాజస్థాన్ పోలీసులకు బిష్ణోయ్ గ్యాంగ్ మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సమయంలో ఆయన పోలీసులకు చిక్కారు. పలు సెక్షన్ల కింద ఆయనను జైలుకు పంపారు. జైలులో జస్విందర్ సింగ్ అలియాస్ రాకీ తో పరిచయం ఏర్పడింది. 2016లో రాకీని గ్యాంగ్ స్టర్ జైపాల్ భుల్లర్ కాల్చి చంపారు. 2020లో భుల్లర్ ను ప్రత్యర్థులు చంపారు. 2021లో మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ కింద ఆయనను తీహార్ జైలుకు పంపారు. గతంలో జైలు నుంచే ఆయన న్యూస్ చానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇవ్వడం సంచలనం కలిగించింది. ఈయన గ్యాంగ్ లో 700 మంది ఉన్నారని చెబుతారు.

సంచలనంగా మారిన మూసేవాలా హత్య

పంజాబ్ కు చెందిన గాయకులు సిద్దూ మూసేవాలాను 2022 మేలో హత్యకు గురయ్యారు. 2024 ఏప్రిల్ 14న బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పులు జరిగాయి. వీటికి బిష్ణోయ్ గ్యాంగ్ కారణమని పోలీసులు గుర్తించారు. 2021 సెప్టెంబర్ లో కెనడాలో దవీందర్ బాంబిహా గ్యాంగ్ కు చెందిన గ్యాంగ్ స్టర్ సుఖ్ దూల్ సింగ్ అలియాస్ సుఖా దునేకేని హత్య చేశారు.

సిద్దిఖీ హత్యకు కొన్ని గంటల మధ్య దిల్లీ జిమ్ యజమానిని కాల్చి చంపిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాధుర్ అలియాస్ మటా అర్మాన్ ను కూడా దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. రోహిత్ గోదారా, గోల్డి బ్రార్ ద్వారా లారెన్స్ ముఠాలో మాధుర్ కూడా సభ్యుడిగా ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. రాజస్థాన్ లో 2023 డిసెంబర్ లో జైపూర్ లో హత్యకు గురైన రాష్ట్రీయ రాజుపుత్ కర్ణిసేన అధ్యక్షులు సుఖదేవ్ సింగ్ గోగమేడి హంతకులకు లారెన్స్ ముఠాతో సంబంధాలున్నాయని పోలీసులు గుర్తించారు.

సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు

కృష్ణజింకల వేట కేసులో బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్ ప్రమేయం ఉన్నందున ఆయనను హత్య చేస్తామని బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. జింకల వేట కేసులో విచారణకు హాజరైన సమయంలో ఆయనను జోథ్ పూర్ లోనే చంపుతామని బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. 2024 జూన్ లో సల్మాన్ ఖాన్ కారుపై దాడికి ప్లాన్ చేసిన బిష్ణోయ్ గ్యాంగ్ కు చెందిన ధనంజయ్ తాపేసింగ్ అలియాస్ అజయ్ కశ్యప్, గౌరవ్ భాటియా అలియాస్ నహ్వీ, వాస్పీఖాన్ అలియాస్ వసీం చిక్నా, రిజ్వాన్ ఖాన్ అలియాస్ జావేద్ ఖాన్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పులు జరిగిన నెల రోజుల తర్వాత ఈ అరెస్టులు జరిగాయి. బిష్ణోయ్ కమ్యూనిటీ కృష్ణ జింకను అత్యంత పవిత్రంగా భావిస్తారు. అలాంటి కృష్ణజింకను చంపినందుకు సల్మాన్ ఖాన్ పై ప్రతీకారం తీర్చుకుంటామని ఈ గ్యాంగ్ ప్రకటించింది.

Tags:    

Similar News