జీఎన్ సాయిబాబా (1967 – 2024): అణచివేతపై కొడవలి తిప్పిన కోనసీమ కుర్రాడు వెళ్ళిపోయాడు...

GN Saibaba: జీఎన్ సాయిబాబా వెళ్ళిపోయారు. ప్రజాస్వామ్య దేశంలో న్యాయం దొరక్క ఉక్కిరిబిక్కిరై మరణించారు.

Update: 2024-10-13 06:05 GMT

 Professor GN Saibaba

GN Saibaba: జీఎన్ సాయిబాబా వెళ్ళిపోయారు. ప్రజాస్వామ్య దేశంలో న్యాయం దొరక్క ఉక్కిరిబిక్కిరై మరణించారు. రాజ్య నిర్బంధంలో నలిగిపోయి, సగం గుండెతో నిండుగా పోరాటాన్ని చివరి క్షణం వరకూ శ్వాసిస్తూ అలసిపోయి వెళ్ళిపోయారు. దాదాపు పదేళ్ళు నాగ్‌పూర్ జైలులో విచారణ ఖైదీలా నానా కష్టాలూ భరించి, విడుదలయ్యాక ఏడాది కూడా స్వేచ్ఛగా గడపకుండా వెళ్ళిపోయారు. జైల్లో ఉన్నప్పుడే మృత్యువు ఆయన శరీరంలోకి చొరబడింది. లోపలి నుంచే ఆయనను వెంటాడింది. వెంట తీసుకుని వెళ్ళిపోయింది.

‘జైలులో నన్ను మనిషిగా చూడలేదు. దాదాపు పదేళ్ళు మానసిక, శారీరక హింసను అనుభవించాను’ అని గత మార్చి 7న విడుదలైన తరువాత సాయిబాబా చెప్పారు. 90 శాతానికి పైగా వైకల్యంతో ఉన్న దేహంతో నూటికి నూరుపాళ్ళు చైతన్యంతో గడిపిన జీవితం ఆయనది. రెండు కాళ్ళు చచ్చుబడిపోయిన ఈ మనిషికి జైలులో కనీసం వీల్ చైర్ కూడా ఇవ్వలేదు. “నాలాంటి వాళ్ళ కోసం జైలులో కనీసం ర్యాంప్స్ కూడా ఎక్కడా లేవు. టాయిలెట్ పోవడం ప్రతిరోజూ నాకొక నరకం. కనీసం, ఒక గ్లాసు నీళ్ళు తీసుకుని తాగడం కూడా చేతనయ్యేది కాదు” అని ఆయన తాను అనుభవించిన బాధను చెప్పుకున్నారు.

అండా సెల్‌లో పదేళ్ళు...

కరడుగట్టిన నేరస్థులను నిర్బంధించే హైసెక్యూరిటీ అండా సెల్‌లో సాయిబాబాను నిర్బంధించారు. కోడిగుడ్డు ఆకారంలో ఉండే ఆ చిన్న గదిలో ఆయన దాదాపు పదేళ్ళు గడపాల్సి వచ్చింది. దిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పని చేసిన ఒక విద్యావేత్తను ఇలా హింసించాల్సిన అవసరం ఏంటి? ఆయనతో పాటు మరికొందరు మానవహక్కుల కార్యకర్తలను జైల్లో పెట్టి ఏళ్ళ తరబడి విచారణ పేరుతో హింసించడం ద్వారా రాజ్యం ఇవ్వదలచుకున్న సంకేతాలేంటి? ఇలాంటి ప్రశ్నలన్నీ ప్రజా హక్కుల ఉద్యమకారులు అడుగుతూనే ఉన్నారు. కానీ, మొండి ప్రభుత్వాలు ఆ ప్రశ్నలను వినిపించుకోలేదు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా లేక ఫాసిస్ట్ పాలనా అని ప్రశ్నిస్తే UAPA కొరడా తీస్తోంది.

సాయిబాబాకు జబ్బు చేస్తే కూడా జైలులో చికిత్స దొరకలేదు. ఆయనకు రెండుసార్లు కోవిడ్ వచ్చింది. మరి కొన్నాళ్ళు స్వైన్ ఫ్లూతో బాధపడ్డారు. జైలు నుంచి విడుదలయ్యే సమయానికి ఆయన గుండె సగమే పని చేస్తోందన డాక్టర్లు చెప్పారు.

అందుకే, సాయిబాబా సెప్టెంబర్ 12 రాత్రి 8.30 గంటలకు చనిపోలేదు, ఆయన చాలా కాలంగా చనిపోతూ వచ్చారు. ఆ ప్రాసెస్ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో శనివారం చీకటి పడిన తరువాత పూర్తయింది. అలా 57 ఏళ్లకే ఆయన భౌతికయానం ముగిసింది.

జైలు నుంచి విడుదల

UAPA – అన్ లా ఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద సాయిబాబాను పదేళ్ళ పాటు జైల్లో ఉంచడం అక్రమం అని బాంబే హైకోర్టు నాగ్ పూర్ బెంచ్ మార్చి 5న ప్రకటించింది. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఆయన ఒక నిషిద్ధ మావోయిస్టు సంస్థకు సహకరించారనే ఆరోపణలను కోర్టు తోసిపుచ్చింది. ఆ కారణం మీద ఆయనను నిర్బంధించడం చట్ట విరుద్ధమని ప్రకటించింది. ఆయనతో పాటు అరో అయిదుగురిని విడుదల చేస్తున్నట్లు తీర్పు చెప్పింది.

మహారాష్ట్రలోని గడ్చీరోలి జిల్లా కోర్టు 2017లో వాళ్ళను నేరస్థులగా ప్రకటిస్తూ తీర్పు చెప్పింది. ఆ ఆర్డర్ పై వారు బాంబే హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. గడ్చీరోలి కోర్టు తీర్పును హైకోర్టు కొట్టేసింది. వారు నేరానికి పాల్పడినట్లు ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని నాగ్ పూర్ బెంచ్ ప్రకటించింది. వారిని విడుదల చేయాలని ఆదేశించింది. ఈ తీర్పుపై స్టే ఇవ్వాలని ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళింది. కానీ, సుప్రీం కోర్టు కూడా బాంబే హైకోర్టు తీర్పు సహేతుమేనని ప్రకటించింది.

సాయిబాబా 2014 మే నెలలో అరెస్టయ్యారు. ఆయన అరెస్ట్‌ను ప్రభుత్వం ఒక సిగ్నల్‌గా ప్రయోగించింది. పౌర హక్కుల పేరుతో ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిని, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఏమైనా చేయగలమనే సంకేతాలు ఇచ్చింది. సాయిబాబా అరెస్ట్ తరువాత ఇదే చట్టం కింద మరికొందరు సామాజిక ప్రముఖులను జైల్లో పెట్టడం ద్వారా ఆ రకమైన భయాందోళనలు దేశంలో పెరిగేలా చేసింది.

ఆ తరువాత మహారాష్ట్రలోని భీమాకోరేగావ్ గ్రామంలో కులహింసతో సంబంధం ఉందనే ఆరోపణలతో 2018లో వరవరరావును, మరో 14 మందిని అరెస్ట్ చేశారు. వాళ్ళందరూ తమకు ఆ ఆరోపణలతో ఏమాత్రం సంబంధం లేదని చెబుతూ వచ్చారు. ఇదే కేసులో అరెస్టయిన ఆదివాసీ హక్కుల కార్యకర్త స్టాన్ స్వామి 2021లో గుండెపోటుతో మరణించారు. 84 ఏళ్ళ వయసులో జైలు జీవితం ఆయన ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీసింది.

‘పదేళ్ల కాలం కాదు, అంతకన్నా చాలా ఎక్కువ కోల్పోయాను...’

మార్చి 5నాటి బాంబే హైకోర్టు తీర్పుతో జైలు నుంచి బయటకు వచ్చిన సాయిబాబా, “నేను జైల్లో కోల్పోయింది పదేళ్ళ కాలమే కాదు. అంతకన్నా చాలా ఎక్కువ అని అన్నారు. ఈ దేశంలో ఏదైనా నమ్మదగిన వ్యవస్థ మిగిలి ఉందీ అంటే అది న్యాయవ్యవస్థేనని ఆయన అన్నారు. అయితే, అది కూడా కాలపరీక్షను ఎదుర్కొంటోందని వ్యాఖ్యానించారు.

సాయిబాబా అప్పటికే ప్రాణాంతకమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆయన భార్య వసంత చెప్పారు. మెదడులో సిస్ట్, కిడ్నీలో రాళ్ళు, పాంక్రియాటిక్ సమస్యలతో పాటు గుండె కవాటాలు సగం వరకూ దెబ్బతిన్నాయన చెప్పారు. నడుం కింద భాగమంతా పోలియోతో చచ్చుబడిపోవడంతో వీల్ చెయిర్‌కు పరిమితమైన సాయిబాబాలో ఈ సమస్యల మూలంగా శరీరంలో పైభాగంలో కూడా పక్షవాత లక్షణాలు కనిపించాయని ఆమె చెప్పారు.

అరెస్టయిన తరువాత 2014 నుంచి సాయిబాబా కుటుంబానికి సగం జీతమే వచ్చేది. చివరికి 2021 మార్చి నెలలో ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు యూనివర్సిటీ ప్రకటించడంతో ఆ కుటుంబానికి ఏ ఆధారమూ లేకుండా పోయింది.

అమలాపురం నుంచి... హక్కుల పోరాటాల దాకా

సాయిబాబా తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురంలో 1967లో జన్మించారు. పేద రైతు కుటుంబంలో పుట్టిన సాయిబాబా పోలియా మూలంగా అయిదేళ్ళ వయసు నుంచే చక్రాల కుర్చీని వాడేవారు. అమలాపురంలోని కోనసీమ భానోజీ రామర్స్ కాలేజీలో డిగ్రీ చదివారు యూనివర్సిటీలో టాపర్‌గా నిలిచారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ చదివారు. ఇండియన్ రైటింగ్ ఇన్ ఇంగ్లిష్ అండ్ నేషన్ మేకింగ్ – రీడింగ్ ది డిసిప్లిన్ అనే అంశం మీద దిల్లీ యూనివర్సిటీలో డాక్టరేట్ పూర్తి చేశారు.

గురజాడ, శ్రీశ్రీ, కెన్యా నోబెల్ రచయిత గూగీ వాతియాంగో తనకు ఇన్ స్పిరేషన్ అని చెప్పేవారు. భారతీయ సాహిత్యంలో దళిత, ఆదివాసీ స్వరాల అణచివేత గురించి ఆయన స్వయంగా రచనలు చేశారు. దిల్లీ యూనివర్సిటీలో డాక్టరేట్ చేసి అక్కడే అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చాలా ఏళ్ళు ఇంగ్లిష్ బోధించారు.

2004లో ముంబయిలో జరిగిన ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఆ సమయంలోనే ఆయన ఇంటర్నేషనల్ లీగ్ ఆఫ్ పీపుల్స్ స్ట్రగుల్ – ILPSలో భాగమయ్యారు. రెవల్యూషనరీ డెమాక్రటిక్ ఫ్రంట్ – ఆర్.డి.ఎఫ్‌లో 2005లో చేరారు. ఆ సంస్థను ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2012లో పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ కింద బ్యాన్ చేసింది.

నక్సలైట్లను తుడిచిపెట్టేందుకు పోలీసులు, పారామిలటరీ దళాలతో 2009లో ప్రభుత్వం ప్రారంభించిన ‘ఆపరేషన్ గ్రీన్‌హంట్’ను సాయిబాబా తీవ్రంగా నిరసించారు. ప్రభుత్వ హింసకు వ్యతిరేకంగా ఉద్యమాల్లో పాల్గొన్నారు.

ప్రజా ఉద్యమాలతో ముడిపడిన ఆయన జీవితమంతా వ్యక్తి స్వేచ్ఛ కోసం, ప్రజాస్వామిక భావప్రకటన హక్కుల పరిరక్షణ కోసం చేసిన పోరాటంలా సాగింది. నమ్మిన సిద్ధాంతం కోసం ఆయన తన జీవితంలో ఎంతో మూల్యం చెల్లించారు. కాదు కాదు... జీవితాన్నే మూల్యంగా చెల్లించారు.

మరణానంతరం కూడా శరీరాన్ని గాంధీ హాస్పిటల్‌కు, కళ్ళను ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి దానం చేశారు. ఆయన నిష్క్రమణంతో ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఒక గొంతు మూగబోయింది.

Tags:    

Similar News