TOP 6 News @ 6PM: Allu Arjun Case: రేవంత్ రెడ్డి వల్ల తెలుగు సినీ పరిశ్రమకు దెబ్బ - బండి సంజయ్

Update: 2024-12-23 12:50 GMT

1) రేవంత్ రెడ్డి తెలుగు సినీ పరిశ్రమను దెబ్బ తీస్తున్నారు

జాతీయ అవార్డ్ గ్రహీత అల్లు అర్జున్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరును బండి సంజయ్ తప్పుపట్టారు. అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని కించపరిచేవిగా ఉన్నాయన్నారు. తెలుగు సినీ పరిశ్రమను జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో నటీనటులు, దర్శకులు, ఇతర సినీ ప్రముఖల పాత్ర కీలకం అని చెప్పారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు తెలుగు సినీ పరిశ్రమను దెబ్బతీసేలా ఉన్నాయని బండి సంజయ్ ఆరోపించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను సోమవారం బండి సంజయ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

2) గాంధీ భవన్‌కు అల్లు అర్జున్ రెడ్డి మామ చంద్రశేఖర్ రెడ్డి

అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారా ? లేక పార్టీని వీడుతున్నారా అని వస్తోన్న సందేహాలపై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. చంద్రశేఖర్ రెడ్డి గతంలోనూ కాంగ్రెస్ మనిషే... ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని అన్నారు. చంద్రశేఖర్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం పీసీసీ నేతలను కలిసేందుకు గాంధీ భవన్ కు వెళ్లారు. ఆ సమయంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రెస్ మీట్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి ఆ సమయంలో గాంధీ భవన్‌లోనే ఉన్నారు.

ఇదే విషయమై మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ చంద్రశేఖర్ రెడ్డి దీపాదాస్ మున్షిని కలిసి వెళ్లారని, ఆ సమయంలో తాను ప్రెస్ మీట్లో ఉండటంతో కలవలేకపోయానని అన్నారు. చంద్రశేఖర్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడానని.. త్వరలోనే మళ్లీ కలుస్తామని తెలిపారు.

3) పట్నం నరేందర్ రెడ్డికి హై కోర్టు రిలీఫ్

పట్నం నరేందర్ రెడ్డికి (Patnam Narender Reddy) తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కింది. బొంరాస్ పేట పోలీస్ స్టేసన్‌లో నమోదైన కేసులో కోర్టు ఆయనకు సోమవారం ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. లగచర్లలో అధికారులపై దాడి కేసులో ఆయనకు ఇప్పటికే బెయిల్ మంజూరైంది. నవంబర్ 11న లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో నరేందర్ రెడ్డితో పాటు మరో 20 మందిపై కేసులు నమోదయ్యాయి.

లగచర్ల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డిపై బొంరాస్ పేట పోలీసులు మూడు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు.ఇందులో రెండు ఎఫ్ఐఆర్ లను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు ఈ ఏడాది నవంబర్ 24న తీర్పును వెల్లడించింది. ఒకే ఘటనలో వేర్వేరు ఎఫ్ఐఆర్ లు నమోదు చేయవద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పిటిషనర్ తరపున న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత రెండు ఎఫ్ఐఆర్ లు కొట్టివేసింది హైకోర్టు.

4) ఈ నాలుగు రోజులపాటు వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీరానికి సమీపంలోనే కొంత బలహీనపడినట్లు సోమవారం విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అయితే, ఈ అల్ప పీడనం ప్రభావంతో తీర ప్రాంతాల్లో నేటి నుండి గురువారం వరకు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. మత్స్యకారులు ఎవ్వరూ గురువారం వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీచేశారు.

5) జాతీయ మానవ హక్కుల సంఘానికి కొత్త చైర్‌పర్సన్

జాతీయ మానవ హక్కుల సంఘానికి కొత్త చైర్‌పర్సన్ నియమితులయ్యారు. సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి వి రామసుబ్రహ్మణ్యన్‌ను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ 9వ చైర్ పర్సన్‌గా అపాయింట్ అయ్యారు. జూన్ 1న అరుణ్ కుమార్ మిశ్రా పదవీ కాలం ముగిసినప్పటి నుండి ఈ పదవి ఖాళీగానే ఉంది. రామసుబ్రహ్మణ్యన్ 2019-2023 మధ్య కాలంలో సుప్రీం కోర్టు జడ్జిగా పనిచేశారు. అంతకంటే ముందుగా హిమాచల్ ప్రదేశ్ హై కోర్టు చీఫ్ జస్టిస్‌గానూ సేవలందించారు.

6) షేక్ హసీనాను అప్పగించండి - భారత్‌ను కోరిన బంగ్లాదేశ్

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను వెనక్కి పంపించాలని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం భారత్‌ను కోరింది. ఈ మేరకు తాజాగా బంగ్లాదేశ్ ఓ లేఖ రాసింది. బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల సలహాదారు తోహిద్ హుస్సేన్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఇప్పటికే బంగ్లాదేశ్ లో షేక్ హసీనాతో పాటు ఆమె ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగిన వారిపై కేసులు నమోదయ్యాయి. ఈ న్యాయ విచారణ కోసమే షేక్ హసీనాకు వెనక్కు పంపాలని బంగ్లాదేశ్ కోరింది.

Tags:    

Similar News