PSLV C-60: మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. ఈరోజు రాత్రి నింగిలోకి దూసుకెళ్లనున్న పీఎస్ఎల్వీ- సీ 60

PSLV-C60 Rocket Launch: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోట రాకెట్‌ ప్రయోగ కేంద్రం నుంచి ఇవాళ PSLV C-60 రాకెట్‌ దూసుకెళ్లనుంది.

Update: 2024-12-30 01:08 GMT

PSLV C-60: మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. ఈరోజు రాత్రి నింగిలోకి దూసుకెళ్లనున్న పీఎస్ఎల్వీ- సీ 60 

PSLV-C60 Rocket Launch: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోట రాకెట్‌ ప్రయోగ కేంద్రం నుంచి ఇవాళ PSLV C-60 రాకెట్‌ దూసుకెళ్లనుంది. షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి రాత్రి 9 గంటల 58 నిమిషాలకు రాకెట్‌ను నింగిలోకి పంపనున్నారు. ఇప్పటికే ఈ ప్రయోగానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తికాగా నిన్న రాత్రి 8 గంటల 58 నిమిషాల నుంచి కౌంట్‌డౌన్‌ కూడా ప్రారంభమైంది. సుమారు 25 గంటల పాటు కౌంట్‌డౌన్ ప్రక్రియ కొనసాగనుంది. ఈ రాకెట్‌ ద్వారా స్పాడెక్స్ అనే జంట ఉపగ్రహాలను రోదసీలోకి పంపనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఈ జంట ఉపగ్రహాలకు ఛేజర్, టార్గెట్ అనే పేర్లను పెట్టారు.

స్వీయ పరిజ్ఞానం, స్వదేశీ యువ శాస్త్రవేత్తలతో తెలుగు నేలపై రూపకల్పన చేసిన స్పేస్ డెక్స్.. స్పాడెక్స్ గా పిలిచే ఈ ఉపగ్రహాన్ని.. ఇస్రో ప్రయోగ కేంద్రమైన తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ థావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఇవాళ రాత్రి 9 గంటల 58 నిమిషాలకు నింగిలోకి పంపనున్నారు. ఇస్రోకి అచ్చొచ్చిన వాహక నౌకగా పేరుగాంచిన PSLV C-60 రాకెట్‌ ద్వారా ఈ ఉపగ్రహాన్ని రోదశీలోకి పంపనుంది ఇస్రో. PSLV సిరీస్‌లో ఇది 62వ ప్రయోగం కాగా ఇప్పటివరకు 59 ప్రయోగాలు విజయవంతమయ్యాయి. ఇక PSLV కోర్‌ అలోన్ దశతో చేసే 18వ ప్రయోగమిది.

PSLV సిరీస్ రాకెట్ ప్రయోగాల పరంపరలో సాధారణంగా పిఫ్‌ భవనంలో రాకెట్‌ రెండు దశల వరకు అనుసంధానం చేసి, ఎంఎస్టీకి తరలిస్తారు. అక్కడ మూడు, నాలుగు దశలను అనుసంధానం చేసి ఉపగ్రహాన్ని అమర్చే ప్రక్రియను పూర్తిచేస్తారు. అయితే ఈ ప్రయోగానికి తొలిసారిగా పిఫ్‌ భవనంలోనే PSLV C-60 రాకెట్‌ నాలుగు దశలను అనుసంధానం చేస్తున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. కోర్‌ అలోన్‌ దశతోనే ఈ ప్రయోగాన్ని ఆరంభించనున్నారు. ఇక, రెండో దశలో ద్రవ ఇంధనం, మూడో దశలో ఘన ఇంధనం, నాలుగో దశలో ద్రవ ఇంధనంతో రాకెట్‌ను లాంఛ్ చేస్తారు. శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం మొదటి వేదికపై నుంచి ఇవాళ రాత్రి నింగిలోకి దూసుకెళ్లనున్న PSLV C-60 రాకెట్ అనుసంధాన ప్రక్రియను ఇప్పటికే శాస్త్రవేత్తలు పూర్తి చేశారు.

మరికొన్ని గంటల్లో ఇస్రో రాకెట్ ప్రయోగ కేంద్రంగా ఉన్న శ్రీహరికోట సతీష్ థావన్ స్పేస్ సెంటర్ నుంచి.. PSLV C-60 ద్వారా ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనున్నారు శాస్త్రవేత్తలు. ఇందులో ఉండే జంట ఉపగ్రహాలకు ఛేజర్, టార్గెట్ అనే పేర్లు పెట్టారు. PSLV C-60 రాకెట్ బరువు 320 టన్నులు కాగా.. ప్రస్తుతం ప్రయోగిస్తున్న రాకెట్‌కు స్టాపాన్ బూస్టర్లను తొలగించడంతో.. అది 229 టన్నుల బరువు కలిగి ఉంటోంది. దీని ద్వారా సుమారు 440 కిలోల బరువున్న ఛేజర్, టార్గెట్‌ అని పిలవబడే ఉపగ్రహాలను.. రోదసీలో ప్రవేశపెట్టనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఇవి స్పేస్‌ డాకింగ్, ఫార్మేషన్‌ ఫ్లయింగ్, మానవ అంతరిక్షయానం, తదితర సేవలకు ఉపయోగపడనున్నాయని ఇస్రో వెల్లడించింది. అలాగే, భవిష్యత్తులో ప్రయోగించే చంద్రయాన్‌-4లో భారత్‌ స్పేస్‌ స్టేషన్‌ నిర్మాణానికి అవసరమైన డాకింగ్‌ టెక్నాలజీని పరీక్షించేందుకు ఈ ఉపగ్రహాలు ఉపయోగపడనున్నాయి.

Tags:    

Similar News