Coronavirus: గడిచిన 24 గంటల్లో 53,476 కరోనా కేసులు
Coronavirus: దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అవడం ఆందోళన కలిగిస్తోంది.
Coronavirus: దేశంలో చాపకింద నీరులా కరోనా వైరస్ వ్యాప్తి విస్తరిస్తోంది. కొత్తగా నమోదవుతున్నకరోనా కేసులతో పాటు మరణాల రేటులోనూ పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో 53,476 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న 26,490 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,17,87,534కు చేరింది. గడచిన 24 గంటల సమయంలో 251 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,60,692కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,12,31,650 మంది కోలుకున్నారు. 3,95,192 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 5,31,45,709 మందికి వ్యాక్సిన్లు వేశారు.
మహారాష్ట్రలో..
మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళనకరంగా ఉంది. బుధవారం ఒక్కరోజే 32,855 కేసులు నమోదయ్యాయి. ఒక్క ముంబయి నగరంలోనే 5వేలకు పైగా కేసులు వెలుగుచూడటం గమనార్హం. గడిచిన 24 గంటల్లో 95 మంది మరణించడగా..15,098 మంది కోలుకొన్నారు. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 1.87కోట్ల నమూనాలు పరీక్షించగా 25.64లక్షల మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 22.62లక్షల మంది కోలుకోగా.. 53,684 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 2.47లక్షల వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తెలంగాణలో..
తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 493 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం... ఒక్కరోజులో కరోనాతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 157 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,04,791కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,99,427 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1680గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 3,684 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 1,616 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 138 మందికి కరోనా సోకింది.
ఏపీలో..
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యవేగంగా పెరుగుతున్నాయి. బుధవారం ఒక్క రోజే 585 కేసులు నమోదయ్యాయి. గత ఏడాది డిసెంబరు 17న 534 కేసులు రాగా, ఆ తర్వాత మళ్లీ ఇంత ఎక్కువగా రావడం ఇదే తొలిసారి. పాజిటీవిటీ రేటు డిసెంబరు 17న 0.84 ఉంటే, బుధవారం అది 1.66గా నమోదవడం ప్రమాద తీవ్రతకు సంకేతం. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉన్న 2020 సెప్టెంబరులో రోజుకు 10 వేలకు మందికి పైగా వ్యాధి బారిన పడిన సందర్భాలున్నాయి. ఓ దశలో పరీక్షించిన ప్రతి వంద మందిలో 17 మందికి పాజిటివ్‌గా తేలింది. డిసెంబరు నుంచి మహమ్మారి తీవ్రత క్రమంగా తగ్గుతూ.. ఫిబ్రవరిలో రోజుకు 50-60 కేసులకు పడిపోయింది. ఫిబ్రవరి 13న పాజిటీవిటీ రేటు కనిష్ఠంగా 0.16గా నమోదైంది. మళ్లీ వారం రోజులుగా దేశవ్యాప్తంగా వ్యాధి వ్యాప్తి పెరుగుతుండగా.. అదే ధోరణి రాష్ట్రంలోనూ కన్పిస్తోంది. దేశంలో ఇప్పటికీ అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ది నాలుగో స్థానం.