Maharashtra: లోక్ సభ ఎన్నికల్లో లాస్.. అసెంబ్లీ ఎన్నికల్లో ఫస్ట్ ర్యాంక్.. బీజేపి చేసిన మ్యాజిక్కేంటి?

Reasons behind BJPs and mahayutis victory in Maharashtra Elections: 6 నెలల క్రితం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 48 లోక్ సభ స్థానాలకుగాను కేవలం 17 స్థానాల్లోనే బీజేపి గెలిచింది. మరి ఈ 6 నెలల్లోనే బీజేపీలో అంతగా ఏం మారింది? అత్యధిక స్థానాలు గెలుచుకునేంతగా ఆ పార్టీ ఏమాయ చేసింది? ఓటర్లను ఎలా ఆకట్టుకుంది?

Update: 2024-11-24 01:30 GMT

Reasons behind BJPs and mahayutis victory in Maharashtra Elections: మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి డబుల్ సెంచరీ కొట్టి ఘన విజయం సాధించింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో మహాయుతి కూటమి 233 స్థానాల్లో విజయం సాధించింది. గతంలో మహారాష్ట్రలో ఏ కూటమికి కూడా ఈ స్థాయిలో మెజారిటీ లభించలేదు. అయితే, ఆ ఘన విజయంలోనూ బీజేపిదే ఎక్కువ భాగం కనిపిస్తోంది. ఎందుకంటే మహాయుతి కూటమి గెలుచుకున్న 233 స్థానాల్లో ఒక్క బీజేపికే 132 స్థానాలొచ్చాయి. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన 145 సంఖ్యకు ఇది కొద్దిగానే తక్కువ. పైగా పోటీ చేసిన 149 స్థానాల్లో 130 కి పైగా గెలవడం అంటే బీజేపి సక్సెస్ రేటు కూడా భారీగా పెరిగిందని ఆ లెక్కలే చెబుతున్నాయి. మహాయుతి కూటమిలో మిగిలిన రెండు పార్టీల్లో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు 55 స్థానాలు, అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీకి 41 స్థానాలు వచ్చాయి.

2019 ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి బీజేపి మరో 26 స్థానాలు ఎక్కువే గెల్చుకుంది. అన్నింటికిమించి 6 నెలల క్రితం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 48 లోక్ సభ స్థానాలకుగాను కేవలం 17 స్థానాల్లోనే బీజేపి గెలిచింది. తమ ప్రతిపక్ష కూటమైన మహా వికాస్ అఘాడి కంటే వెనుకబడి రెండో స్థానంతోనే సరిపెట్టుకుంది. ఇలా ఏ విధంగా చూసినా మహారాష్ట్రలో గతంతో పోల్చుకుంటే తాజాగా బీజేపి బలం పుంజుకోవడమే స్పష్టంగా కనబడుతోంది. బీజేపి కొట్టిన సెంచరీ స్కోర్ ఆ పార్టీ నేత దేవేంద్ర ఫడ్నవిస్‌కు సీఎం అయ్యే అవకాశాన్ని కూడా అందించింది. మరి ఈ 6 నెలల్లోనే బీజేపీలో అంతగా ఏం మారింది? అత్యధిక స్థానాలు గెలుచుకునేంతగా ఆ పార్టీ ఏమాయ చేసింది? ఓటర్లను ఎలా ఆకట్టుకుంది? ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్‌నాథ్ షిండెను కూడా రెండో స్థానానికే పరిమితం చేసేంతగా ఏం మ్యాజిక్ చేసిందనేదే నేటి ట్రెండింగ్ స్టోరీ.

Full View

కలిసొచ్చిన ఆర్ఎస్ఎస్

ఆర్ఎస్ఎస్‌తో ఉన్న విభేదాలను పక్కనపెట్టి వారిని కలుపుకుపోవడంలోనే బీజేపి ఫస్ట్ సక్సెస్ అయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. "అందరం కలిసుంటే సేఫ్‌గా ఉంటాం. మనలో మనం విడిపోతే పడిపోతాం" అనే నినాదంతో హిందుత్వ వాదాన్ని కూడా బలంగా వినిపించారని విశ్లేషిస్తున్నారు.

ఆర్ఎస్ఎస్ కూడా బీజేపి నినాదాన్ని అంతే పాజిటివ్‌గా రిసీవ్ చేసుకుంది. 35 ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు ఈ ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశాయి. బీజేపి గెలుపు ఎంత అవసరమో ఓటర్లకు చెప్పుకొచ్చాయి. బీజేపి గెలుపులో ఆర్ఎస్ఎస్ కూడా అలా ఒక కీలక పాత్ర పోషించిందంటున్నారు. లోక్ సభ ఎన్నికల్లో జరిగిన నష్టం మరోసారి జరగకూడదనే తాము కూడా గట్టిగానే పనిచేశామని ఆర్ఎస్ఎస్ నాయకులు తెలిపారు.

యుద్ధప్రాతిపదికన తీసుకున్నచర్యలు

లోక్ సభ ఎన్నికల్లో జరిగిన నష్టంతో బీజేపి వెంటనే తేరుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఈసారి చావో రేవో అన్నట్లు పనిచేసింది. మధ్యప్రదేశ్‌లో మహిళా ఓటు బ్యాంకును ఆకర్షించేలా తమకు బాగా కలిసొచ్చిన లాడ్లీ బెహన్ యోజన పథకాన్ని తీసుకొచ్చి మహారాష్ట్రలో కూడా లడ్కీ బెహన్ యోజన పేరుతో ప్రవేశపెట్టారు. ఇది మహాయుతి సర్కారులో బీజేపికి మైలేజ్ పెంచింది.

లడ్కీ బెహన్ యోజన పథకంలో అంతగా ఏముంది

లడ్కీ బెహన్ యోజన పథకం కింద 18 ఏళ్ల నుండి 65 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ప్రతీ నెల రూ. 1500 నగదు బదిలీ చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకొస్తే, ఈ నగదు సాయాన్ని రూ. 2100 కు పెంచుతామని బీజేపి ప్రకటించింది. మహారాష్ట్రలో 55 శాతం మహిళలు.. అంటే 2.25 కోట్ల మంది మహిళలు ఈ పథకం కింద లబ్ధిదారులుగా ఉన్నారు. నాలుగు నెలల క్రితం ప్రవేశపెట్టిన ఈ స్కీమ్‌లో భాగంగా ఇప్పటివరకు మహారాష్ట్ర సర్కారు అర్హులైన మహిళల ఖాతాల్లోకి రూ. 7000 కోట్లు బదిలీ చేసింది. అలా ఇప్పటికే ఉన్న మహిళా ఓటు బ్యాంకుకు తోడు ఈసారి కొత్తగా 52 లక్షల మంది మహిళా ఓటర్లు తోడయ్యారు. వారి ఓట్లు బీజేపి విజయంలో కీలక పాత్ర పోషించిందని లెక్కలు చెబుతున్నాయి.

ప్రతికూల పరిస్థితిని కూడా అనుకూలంగా మల్చుకున్న బీజేపి

మహారాష్ట్రలో మరాఠీలకు రిజర్వేషన్ పేరుతో మనోజ్ పాటిల్ చేపట్టిన ఉద్యమం బీజేపికి మరాఠా ఓటు బ్యాంకును దూరం చేస్తుందని భయపడ్డారు. మహారాష్ట్రలో 33 శాతం ఓటు బ్యాంకు కలిగిన డామినెంట్ కమ్యునిటీ అది. ఆ ఓటు బ్యాంకు శరద్ పవార్ వైపు వెళ్లే అవకాశం ఉందనుకున్నారు. కానీ కులాలుగా విడిపోకుండా హిందువులుగా కలిసుందామని చెబుతూ బీజేపీ చేసిన ప్రయత్నాలు ఆ ప్రతికూల పరిస్థితిని అనుకూలంగా మార్చేశాయి. అంతేకాదు.. ఆ ఉద్యమం చేపట్టిన మనోజ్ పాటిల్‌కు చివరకు ఆ వర్గమే ఎదురుతిరిగేలా చేయడంలోనూ బీజేపి సక్సెస్ అయిందనే టాక్ వినిపించింది.

ఓబీసీల ఓట్ల కోసం ఒక స్కెచ్

మరాఠా ఉద్యమం ఓబీసీలను కూడా బీజేపికి దూరం చేసే స్థాయికి వెళ్లింది. కానీ బీజేపి మాత్రం దాదాపు 353 కమ్యునిటీలను ఒక్క తాటిపైకి తీసుకొచ్చి వారిని ప్రాంతాల వారీగా బీజేపీకి దగ్గర చేసుకుంది. ఇందులో మహారాష్ట్రలో బీజేపి ఎన్నికల ఇంచార్జ్ గా వ్యవహరించిన కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ పాత్ర కీలకంగా చెబుతారు. స్థానిక ఓబీసీ నేతలతో మంతనాలు జరిపి వారిని తమ వైపు తిప్పుకోవడంలో ఆయన పాచికలు పారాయనేది విశ్లేషకుల మాట. మహారాష్ట్రలో 288 నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో ఈ ఓబీసీలదే హవా. 38 శాతం జనాభా ఉన్న ఓటు బ్యాంకు బీజేపి వైపు వెళ్లిందంటే అక్కడే వారి విజయం ఖాయమైందనుకోవాల్సి ఉంటుంది.

లోక్ సభ ఎన్నికల సమయంలో ఈ సమస్యలు అన్ని ఇలాగే ఉండటం అప్పట్లో ప్రతికూల ఫలితాలకు కారణమైంది. అంతేకాకుండా కేంద్రంలో మరోసారి బీజేపి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని, రిజర్వేషన్ వ్యవస్థను మార్చేస్తారు అని కాంగ్రెస్ చేసిన ప్రచారం దళితులను తమకు దూరం చేసిందంటున్నారు బీజేపి నేతలు. కానీ ఈసారి బీజేపి ఆ ప్రచారాన్ని తిప్పికొట్టింది. పైగా ఇవి రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కావడంతో దళితుల ఓట్లు కూడా బీజేపికి పోల్ అయ్యాయనే అభిప్రాయం వినిపిస్తోంది.

రైతుల కోసం మరో పెద్ద స్కెచ్

మహారాష్ట్రలో కుల, మతాలతో సంబంధం లేకుండా 65 శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడి ఉంది. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే శక్తి రైతుల ఓటు బ్యాంకుకు ఉంది. విదర్భ, మరాఠ్వాడలో అధికంగా పండించే సోయబీన్, పత్తికి ప్రభుత్వం మద్ధతు ధర కల్పించడం లేదనే అసంతృప్తి రైతుల్లో ఉంది. ఆ అసంతృప్తిని పోగొట్టేందుకు ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌లో రైతులకు ఉచిత కరెంట్ స్కీమ్ ప్రకటించింది. అలాగే తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతుల రుణాలు మాఫీ చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. కనీస మద్ధతు ధరకు, ప్రొక్యూర్‌మెంట్ ధరకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కూడా తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చింది.

మహారాష్ట్రలో రైతులు అధికంగా పండించే పంటల్లో ఉల్లిగడ్డ ఒకటి. అందుకే ఉల్లిగడ్డపై కనీస ఎగుమతి ధర నియమాన్ని ఎత్తేయడంతో పాటు ఎక్స్‌పోర్ట్ డ్యూటీ సుంకాన్ని తగ్గించింది. సోయబీన్ ఆయిల్, ముడి పామాయిల్, ముడి సన్ ఫ్లవర్ ఆయిల్ వంటి వంట నూనెలపై దిగుమతి సుంకం పెంచింది. వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని కూడా జీరో నుండి ఏకంగా 20 శాతానికి పెంచింది. రిఫైండ్ పామాయిల్, రిఫైండ్ సన్ ఫ్లవర్ ఆయిల్, రిఫైండ్ సోయబిన్ ఆయిల్ వంటి వంటనూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 12.5 శాతం నుండి ఏకంగా 32.5 శాతానికి పెంచింది. స్థానిక రైతులకు మేలు చేసేలా సెప్టెంబర్ లో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆ ఓట్లను ఇటువైపు తిప్పిందనే టాక్ వినిపిస్తోంది. ఇలా అన్ని వర్గాలను తమ వైపు తిప్పుకోవడంలో మహయుతి సర్కారు... అందులోనూ బీజేపి ఎక్కువ సక్సెస్ అయింది. అందుకే ఈ ఎన్నికల్లో ఆ పార్టీ గ్రాఫ్ అమాంతం పైకి ఎగబాకిందని విశ్లేషకులు చెబుతున్నారు.

Tags:    

Similar News