Annamalai: కొరడాతో కొట్టుకొని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై నిరసన
Annamalai: బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కొరడాతో కొట్టుకున్నారు.
Annamalai: బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కొరడాతో కొట్టుకున్నారు. ఇటీవల అన్నా విశ్వవిద్యాలయంలో విద్యార్థినిపై లైంగిక దాడి ఘటనపై డీఎంకే ప్రభుత్వ తీరు నిరసిస్తూ తన నివాసం ముందు కొరడాతో ఆరుసార్లు కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
మరోవైపు డీఎంకేను గద్దె దించే వరకు తాను చెప్పులు వేసుకోనంటూ అన్నామలై గురువారం మీడియా సమావేశంలో శపథం చేశారు. ఈ సందర్భంగా అన్నా యూనివర్సిటీ క్యాంపస్‌లో విద్యార్థిని పై లైంగిక ఘటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పిల్లలు, స్త్రీలకు భద్రత లేదని ఆరోపించారు. అందుకే డీఎంకేను అధికారం నుంచి దించేవరకు చెప్పులు కూడా వేసుకోనని శపథం చేశారు. శుక్రవారం నుంచి 48 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తానన్నారు. తన ఇంటి ముందు ఆరు కొరడా దెబ్బలు కూడా కొట్టుకుంటానని చెప్పారు. చెప్పినట్టే ఇవాళ అన్నామలై తన ఇంటి ముందు కొరడాతో కొట్టుకున్నారు.
చెన్నై నడిబొడ్డున ఉన్న అన్నా యూనివర్సిటీలో ఈ నెల 23న ఓ యువతిపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. యూనివర్సిటీలో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ యువతి రాత్రి యూనివర్సిటీ ప్రాంగణంలో తన స్నేహితుడితో మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు యువకులు.. ఆ అమ్మాయి స్నేహితుడిని గాయపరిచి.. ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు.
ఆ తర్వాత ఆ యువతిని అసభ్యకరంగా ఫొటోలు తీసి తమపై ఫిర్యాదు చేస్తే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు. అయినప్పటికీ బాధితురాలు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు యూనివర్సిటీ ప్రాంగణంలోని సీసీ కెమెరాల సహాయంతో నిందితుల్లో ఒకరిని పట్టుకున్నారు. అతడిని చెన్నై కోట్టూరుపురానికి చెందిన జ్ఞానశేఖరన్‌గా గుర్తించారు. జ్ఞానశేఖరన్ రోడ్డు పక్కన బిర్యానీ అమ్ముకునేవాడని సమాచారం. మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.