Manmohan Sigh: భారత మాజీ ప్రధాని, దేశ ఆర్థిక సంస్కరణల రూపకర్త డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి మరణించారు. ఆయన వయస్సు 92 సంవత్సరాలు. వయసురీత్యా తలెత్తిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన అంత్యక్రియలను పూర్తిగా అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు కేంద్రప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. శనివారం డిసెంబర్ 28వతేదీన ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉందని తెలిపారు.
మన్మోహన్ సింగ్ మరణానికి సంతాప సూచికంగా కేంద్ర ప్రభుత్వం వారంరోజులపాటు సంతాప దినాలను ప్రకటించింది. రాష్ట్రపతి భవన్ సహా అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ పతాకాన్ని సగానికి అవతనం చేశారు. అటు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంపై కూడా జాతీయ జెండాను సగానికి అవతనం చేశారు. నేడు ఉదయం 11 గంటల కేంద్ర మంత్రి వర్గ సమావేశం అవుతుంది. మన్మోహన్ సింగ్ మరణానికి సంతాపం తెలపనుంది. కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చే 7 రోజులపాటు కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నట్లు వెల్లడించింది.