Manmohan Singh Passes Away: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇక లేరు. గురువారం రాత్రి అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబసభ్యులు ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మన్మోహన్ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయస్సు 92 ఏళ్లు.
ఢిల్లీ ఎయిమ్స్ మీడియా సెల్ ఇంచార్జ్ రీమా దాదా వెల్లడించిన వివరాల ప్రకారం మన్మోహన్ సింగ్ ఇటీవల కాలంలో వృద్ధాప్యంతో వచ్చే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గురువారం రాత్రి ఆయన తన నివాసంలోనే తీవ్ర అస్వస్థతకు గురై స్పృహ కోల్పోయారు. రాత్రి 8:06 గంటల సమయంలో ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రి ఎమర్జెన్సీ విభాగానికి తీసుకొచ్చారు. ఆయన్ను బతికించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించలేదని రీమా దాదా తెలిపారు. రాత్రి 9:51 గంటలకు ఆయన తుది శ్వాస విడిచినట్లుగా ఎయిమ్స్ ఆస్పత్రి వర్గాలు తమ ప్రకటనలో పేర్కొన్నాయి.
దేశ ప్రధానిగా, ఆర్థిక శాఖ మంత్రిగా మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవలను ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారు. మన్మోహన్ సింగ్‌తో కలిసి పనిచేసిన సందర్భాలను, కలిసి పంచుకున్న వేదికలకు సంబంధించిన ఫోటోలను ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
మన్మోహన్ సింగ్ మృతిపై రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.