కాంగ్రెస్ పార్టీ బీజేపీతో చేతులు కలిపింది.. అందుకే ఇలా - ఢిల్లీ సీఎం అతిషి
Congress joined hands with BJP - Delhi CM Atishi: ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు బీజేపిని లక్ష్యంగా చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ 12 అంశాలతో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసింది. ఇదే విషయమై ఢిల్లీ సీఎం అతిషి స్పందించారు.
Congress joined hands with BJP - Delhi CM Atishi: కాంగ్రెస్ పార్టీ బీజేపీతో చేతులు కలిపిందని ఆ పార్టీ వైఖరి చూస్తోంటే అర్థమవుతోందని ఆప్ నాయకురాలు, ఢిల్లీ సీఎం అతిషి అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపికి మద్ధతు ఇవ్వడం కోసమే కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీపై ఆరోపణలు చేస్తోందన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ తనతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై పోలీసు కేసులు పెడుతోందని అతిషి ఆరోపించారు.
నిన్న బుధవారం ఢిల్లీ కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ మీడియాతో మాట్లాడుతూ ఆమ్ ఆద్మీ పార్టీపై, ఢిల్లీ సర్కారుపై అనేక ఆరోపణలు గుప్పించారు. ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు బీజేపిని లక్ష్యంగా చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ 12 అంశాలతో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసింది. ఢిల్లీలో అభివృద్ధి కరువైందని మాకెన్ ఆరోపించారు. ఢిల్లీలో ఏ అభివృద్ధి చేయాలన్నా గవర్నర్ అడ్డుపడుతున్నారనే కుంటిసాకును చెప్పడం ఢిల్లీ సర్కారుకు పరిపాటిగా మారిందన్నారు. ఒకవేళ నిజంగానే ఢిల్లీలో అభివృద్ధి చేయడానికి గవర్నర్‌తో సమస్యలు ఉంటే పంజాబ్‌లో మీకు పూర్తి స్వేచ్ఛ ఉన్నప్పటికీ అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని కాంగ్రెస్ ప్రశ్నించింది.
కాంగ్రెస్ చేసిన ఈ ఆరోపణలపై ఢిల్లీ సీఎం అతిషి స్పందించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బ తీసి బీజేపికి సహకరించేందుకే కాంగ్రెస్ పార్టీ ఈ ఆరోపణలు చేస్తోందన్నారు. "బీజేపి పట్ల కాంగ్రెస్ వైఖరి ఏంటో చెప్పడానికి ఇదే నిదర్శనం" అని ఆమె అభిప్రాయపడ్డారు.