TOP 6 News @ 6PM: మీ తమ్ముళ్లకు ఒక లెక్క, అల్లు అర్జున్‌కు మరో లెక్కా? - హరీష్ రావు

Update: 2024-12-26 12:40 GMT

1) Harish Rao To Revanth Reddy: మీ తమ్ముళ్లకు ఒక లెక్క, అల్లు అర్జున్‌కు మరో లెక్కా?

Harish Rao About Allu Arjun case: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను హరీష్ రావు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన హరీష్ రావు... రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉద్దేశించి పలు ఆరోపణలు చేశారు. తొక్కిసలాట ఘటన జరిగిన తరువాత 12 రోజులకు సీఎం రేవంత్ రెడ్డి ఘటన గురించి స్పందించారని అన్నారు. అప్పటివరకు ప్రభుత్వం తరపున ఒక్క మంత్రి కూడా శ్రీతేజ్‌ను పరామర్శించలేదన్నారు. గురుకులాల్లో 50 మంది చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అంతేకాదు... కనీసం ఆ విద్యార్థుల తల్లిదండ్రులను కూడా ప్రభుత్వం వైపు నుండి ఏ ఒక్క మంత్రి వెళ్లి పరామర్శించలేదని చెబుతూ ప్రభుత్వానికి శ్రీతేజ్ ఎంత ముఖ్యమో మిగతా విద్యార్థులు కూడా అంతే ముఖ్యం కదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

అల్లు అర్జున్ అరెస్ట్, విచారణ విషయంలో చట్టం దృష్టిలో అందరూ సమానులే అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తాము సమర్ధిస్తున్నామని అన్నారు. అయితే, సాయిరెడ్డి అనే మాజీ సర్పంచ్ సూసైడ్ చేసుకుంటూ మీ తమ్ముళ్లపై ఆరోపణలు చేస్తే ఆ ఘటనపై ఇప్పటివరకు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పలు ప్రశ్నలు సంధించారు. అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పిన మీరు మీ తమ్ముళ్ల విషయంలో అది ఎందుకు పాటించడం లేదన్నారు. చట్టం విషయంలో మీ తమ్ముళ్లకు ఒక లెక్క మిగతా వారికి మరో లెక్కా అని హరీష్ రావు నిలదీశారు.

2) Dil Raju press meet: సినీ ప్రముఖులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పారంటే..

Dil Raju press meet after meeting CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో తెలుగు సినీ ప్రముఖుల భేటీ ముగిసింది. ఈ భేటీ అనంతరం తెలుగు ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రితో సమావేశంలో చర్చించిన అంశాలను, సీఎం రేవంత్ రెడ్డి చేసిన సూచనలను మీడియాకు వివరించారు. తెలుగు సినీ పరిశ్రమ గౌరవం పెరిగేలా పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని సీఎం సూచించినట్లు చెప్పారు. ప్రస్తుతం దేశంలోని అన్ని సినీ పరిశ్రమలు షూటింగ్స్ కోసం హైదరాబాద్ వస్తున్నాయి. అలాగే ఇంటర్నేషనల్ సినిమాలు కూడా ఇక్కడ షూటింగ్స్ జురుపుకునేలా ఉండేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలన్నారు.

డ్రగ్స్‌పై ప్రభుత్వం చేస్తోన్న పోరాటంలో సినీ పరిశ్రమ సహకారాం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరినట్లు దిల్ రాజు తెలిపారు. ఇతర సామాజిక సమస్యలపై పోరాటంలో తెలుగు సినీ పరిశ్రమ తమ వంతు కృషి చేయాలని ముఖ్యమంత్రి చెప్పినట్లు (CM Revanth Reddy instructions to Telugu Film Industry) వెల్లడించారు. తెలుగు సినీ పరిశ్రమను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేయనున్నట్లు తెలిపారు.

మరో ప్రముఖ సినీ నిర్మాత సురేశ్ బాబు కూడా మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం నుండి తెలుగు సినీ పరిశ్రమకు తగిన సహాకారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ విషయంలో ప్రభుత్వంపై తమకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు (D Suresh Babu).

3) అల్పపీడనంతో ఏపీలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని పోర్టుల వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అల్పపీడన ప్రభావంతో 1.5 కిలోమీటర్ల ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం కారణంగా తీరం వెంట గంటకు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఈ పరిస్థితులతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ సూచించింది. అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.

మరో వైపు తెలంగాణపై కూడా అల్పపీడన ప్రభావం కన్పిస్తోంది.రెండు రోజులు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. వచ్చే నాలుగు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. చలి తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందన వృద్దులు, పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

4) కాంగ్రెస్ పార్టీ బీజేపీతో చేతులు కలిపింది.. అందుకే ఇలా - ఢిల్లీ సీఎం అతిషి

Congress joined hands with BJP - Delhi CM Atishi: కాంగ్రెస్ పార్టీ బీజేపీతో చేతులు కలిపిందని ఆ పార్టీ వైఖరి చూస్తోంటే అర్థమవుతోందని ఆప్ నాయకురాలు, ఢిల్లీ సీఎం అతిషి అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపికి మద్ధతు ఇవ్వడం కోసమే కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీపై ఆరోపణలు చేస్తోందన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ తనతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై పోలీసు కేసులు పెడుతోందని అతిషి ఆరోపించారు.

నిన్న బుధవారం ఢిల్లీ కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ మీడియాతో మాట్లాడుతూ ఆమ్ ఆద్మీ పార్టీపై, ఢిల్లీ సర్కారుపై అనేక ఆరోపణలు గుప్పించారు. ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు బీజేపిని లక్ష్యంగా చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ 12 అంశాలతో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసింది. ఢిల్లీలో అభివృద్ధి కరువైందని మాకెన్ ఆరోపించారు. ఢిల్లీలో ఏ అభివృద్ధి చేయాలన్నా గవర్నర్ అడ్డుపడుతున్నారనే కుంటిసాకును చెప్పడం ఢిల్లీ సర్కారుకు పరిపాటిగా మారిందన్నారు. ఒకవేళ నిజంగానే ఢిల్లీలో అభివృద్ధి చేయడానికి గవర్నర్‌తో సమస్యలు ఉంటే పంజాబ్‌లో మీకు పూర్తి స్వేచ్ఛ ఉన్నప్పటికీ అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని కాంగ్రెస్ ప్రశ్నించింది.

కాంగ్రెస్ చేసిన ఈ ఆరోపణలపై ఢిల్లీ సీఎం అతిషి స్పందించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బ తీసి బీజేపికి సహకరించేందుకే కాంగ్రెస్ పార్టీ ఈ ఆరోపణలు చేస్తోందన్నారు. "బీజేపి పట్ల కాంగ్రెస్ వైఖరి ఏంటో చెప్పడానికి ఇదే నిదర్శనం" అని ఆమె అభిప్రాయపడ్డారు.

5) విరాట్ కోహ్లీకి ఐసిసి పనిష్మెంట్

విరాట్ కోహ్లీ, సామ్ కాన్‌స్టస్ వివాదంలో కోహ్లీపై ఐసిసి జరిమానా విధించింది. ఇండియా vs ఆస్ట్రేలియా బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గురువారం జరిగిన 4వ టెస్ట్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఆసిస్ ఆటగాడు సామ్ కాన్‌స్టస్ భుజం రాసుకుంటూ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇదేంటన్నట్లుగా కోహ్లీ వైపు సామ్ వెనక్కి తిరిగి చూడగా.. కోహ్లీ కూడా క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడుతూ సామ్ వైపు చూసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో కోహ్లీపై తరువాతి ఆటకు నిషేధం విధించే అవకాశాలున్నాయని లేదంటే... డిమెరిట్ పాయింట్స్ ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదని వార్తలొచ్చాయి. తాజాగా ఐసిసి స్పందిస్తూ.. విరాట్ కోహ్లీ మ్యాచ్‌ ఫీజులో 20 శాతం కోత విధిస్తున్నట్లు స్పష్టంచేసింది. అంతేకాకుండా ఒక డిమెరిట్ పాయింట్ కూడా విధించింది. ఆటగాళ్ల కెరీర్‌కు ఈ డిమెరిట్ పాయింట్స్‌ను ఒక మైనస్ పాయింట్‌గా భావిస్తుంటారు.

6) Plane Crash: కజకిస్తాన్‎ విమాన ప్రమాదంలో కుట్రకోణం? ఫ్లైట్‌పై బుల్లెట్ల రంధ్రాలతో అనుమానాలు..

Plane Crash: అజర్‌బైజన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జె2-8243 విమానం కుప్పకూలడంతో 38 మంది మరణించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో విమాన ప్రమాదంలో కుట్ర కోణం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అజర్‌బైజన్‌లోని బాకు నగరం నుంచి రష్యాలోని చెచెన్ ప్రాంతానికి చెందిన గ్రోజ్నికి ప్రయాణిస్తుండగా.. కజకిస్థాన్‌లోని ఆక్టావ్‌లో ఈ విమానం కూలిపోయింది.

పక్షి ఢీ కొట్టడంతో పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ట్రై చేస్తుండగా ప్రమాదం జరిగిందని రష్యా ఏవియేషన్ వెల్లడించింది. కానీ ప్రమాద దృశ్యాలను చూసిన నెటిజన్లు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఫ్లైట్ కూలిన సమయంలో రష్యా-ఉక్రెయిన్‌ మధ్య దాడులు జరగడమే అందుకు కారణంగా భావిస్తున్నారు. దానిని కీవ్‌కు చెందిన డ్రోన్‌గా భావించడం వల్లే రష్యా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూల్చివేసినట్టు భావిస్తున్నారు.

ఉక్రెయిన్ డ్రోన్ దాడులను రష్యా తిప్పికొడుతున్న తరుణంలోనే పైలట్ అప్రమత్తమై ఓ కాల్ పంపించారని కొన్ని మీడియా సంస్థలు కథనాలు పేర్కొన్నాయి. కొన్ని చిత్రాల్లో విమానం బాడీపై బుల్లెట్లు ఉన్న ఆనవాళ్లు కనిపించినట్టు తెలిపాయి. అయితే ఈ కథనాలపై కజకిస్థాన్ డిప్యూటీ ప్రధానిని మీడియా ప్రశ్నించిగా.. సరైన సమాధానం చెప్పలేదు.

Tags:    

Similar News