Dr. Manmohan Singh: లైసెన్స్ రాజ్ రద్దు నుంచి ఆహార భద్రత చట్టం వరకు ఐదు కీలక నిర్ణయాలు
Dr. Manmohan Singh: మన్మోహన్ సింగ్ ఆర్ధికమంత్రిగా దేశంలో అనేక సంస్కరణలకు నాంది పలికారు.
Dr. Manmohan Singh: మన్మోహన్ సింగ్ ఆర్ధికమంత్రిగా దేశంలో అనేక సంస్కరణలకు నాంది పలికారు. తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో ఉన్న భారత్ ను ఆ సంక్షోభం నుంచి బయటపెట్టడంలో ఆయన పాత్ర మరవలేనిది. అనారోగ్యంతో డిసెంబర్ 26 రాత్రి ఆయన కన్నుమూశారు. డిసెంబర్ 28న ఆయన అంత్యక్రియలు దిల్లీలో జరుగుతాయి. మన్మోహన్ సింగ్ తీసుకువచ్చిన సంస్కరణలు దేశాన్ని ఆర్ధికంగా పరిపుష్టం చేశాయి.
1. లైసెన్స్ రాజ్ రద్దు
పీవీ నరసింహారావు కేబినెట్ లో మన్మోహన్ సింగ్ ఆర్ధిక మంత్రిగా ఉన్నారు. ఈ సమయంలో ఆయన తీసుకువచ్చిన లైసెన్స్ రాజ్ రద్దు నిర్ణయం భారత ఆర్ధిక వ్యవస్థలో కీలక పరిణామంగా చెబుతారు. 1991లో భారత్ ఆర్ధిక సంక్షోభంతో విదేశీ మారక ద్రవ్యం నిల్వలు కనిష్టానికి పడిపోయాయి.ఇది భారత వాణిజ్య సంబంధాలను ప్రభావితం చేశాయి. గల్ఫ్ యుద్దం, ఈస్టర్న్ బ్లాక్ పతనం, ఇరాక్ కువైట్ వివాదం సహా ఇతర అంశాలు ఇందుకు కారణమయ్యాయి. దీంతో లైసెన్స్ రాజ్ ను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో వ్యాపారాల్లో స్వేచ్ఛ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు అనుమతి లభించింది. పీవీ నరసింహారావు ప్రభుత్వం అప్పట్లో నూతన ఆర్ధిక పారిశ్రామిక విధానాలకు అనుమతిని ఇచ్చింది. దీనిపై అప్పట్లో విపక్షాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి.కానీ, ఆ నిర్ణయమే ఇప్పుడు భారత్ ఆర్దిక పురోగతికి దోహదం చేసిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
2. వాణిజ్య సరళీకరణ, దిగుమతి సుంకం తగ్గింపు
మన్మోహన్ సింగ్ అప్పట్లో తీసుకువచ్చిన మరో సంస్కరణగా దిగుమతి సుంకం తగ్గింపును చెబుతారు. దీంతో వ్యాపార కార్యకలాపాలను సులభతరం చేశాయి. భారత వినియోగదారులకు విదేశీ వస్తువులు అందుబాటులోకి వచ్చాయి.దిగుమతి చేసే వస్తువులపై సుంకం 300 శాతం నుంచి 50 శాతానికి తగ్గించారు. ప్రపంచంలోని వ్యాపారులు భారత్ లో తమ ఉత్పత్తుల విక్రయానికి అవకాశం లభించింది. గ్లోబల్ వ్యాపారుల మధ్య పోటీకి భారత్ మార్కెట్ అవకాశం కల్పించింది. తక్కువ ధరలకే వినియోగదారులకు వస్తువులు అందేందుకు అవకాశం లభించింది. మరో వైపు దేశీయ పరిశ్రమలు తమ ఉత్పత్తులను విదేశీయులకు విక్రయించేందుకు మార్గం దొరికింది.
3. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు పరిమితులను మన్మోహన్ సింగ్ ఎత్తివేశారు. దీంతో దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. టెలికమ్యూనికేషన్స్, ఇన్సూరెన్స్, రిటైల్ సహా వివిధ రంగాల్లో ఎఫ్ డీ ఐలకు భారత ప్రభుత్వం తలుపులు తెరిచింది. ఉద్యోగాలు, మైరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ఇది కలిసి వచ్చింది. అంతర్జాతీయ పెట్టుబడిదారులకు భారత్ స్వర్గధామంగా చేయడంలో ఆయనది కీలకపాత్ర.
4. పన్నుల సంస్కరణలు
పన్నుల విధానంలో మన్మోహన్ సింగ్ అనేక సంస్కరణలు తెచ్చారు. ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని పెంచారు. మరో వైపు పన్ను స్లాబ్ లను నాలుగు నుంచి మూడుకు తగ్గించారు. ట్యాక్స్ చెల్లింపుదారులకు ఇది ప్రయోజనంగా మారింది. వ్యక్తిగత ఆదాయపన్ను పరిమితిని 56 శాతం నుంచి 40 శాతానికి తగ్గించారు. ఇది ఆర్ధిక కార్యకలాపాలకు మరింత అనుకూలమైన వాతావరణానికి దోహదం చేసింది. పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరగడానికి కారణమైంది.
5. జాతీయ ఆహార భద్రతా చట్టం
మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో 2013లో జాతీయ ఆహార భద్రతా చట్టంతో పాటు సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ చట్టంతో దేశంలోని మూడింటి రెండొంతుల మందికి సబ్సిడీకి ఆహార ధాన్యాలు అందుతున్నాయి. ఈ చట్టం ద్వారా పౌరులకు ఇది ప్రాథమిక హక్కుగా మారింది.