Jharkhand Elections: వర్కౌట్ అవుతున్న జైలు సెంటిమెంట్..!

Jail Sentiment: జార్ఖండ్‌లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులయ్యాయి. అక్కడి ప్రజలు మళ్లీ హేమంత్ సోరెన్ నేతృత్వంలోని ఇండియా కూటమికే పట్టం కట్టారు.

Update: 2024-11-23 09:49 GMT

Jharkhand Elections: వర్కౌట్ అవుతున్న జైలు సెంటిమెంట్..!

Jail Sentiment: జార్ఖండ్‌లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులయ్యాయి. అక్కడి ప్రజలు మళ్లీ హేమంత్ సోరెన్ నేతృత్వంలోని ఇండియా కూటమికే పట్టం కట్టారు. దీంతో అధికార పీఠాన్ని దక్కించుకోవాలన్న కమలనాథుల ఆశలు అడియాశలయ్యాయి. ప్రతి ఐదేళ్లకొకసారి అక్కడి ఓటర్లు ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయం కొనసాగుతోంది. జార్ఖండ్ కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇప్పటివరకు ఏ పార్టీ కూడా వరుసగా రెండోసారి అధికార పగ్గాలు సొంతం చేసుకోలేదు. అయితే గత 24 ఏళ్ల రికార్డును హేమంత్ సోరెన్ సర్కార్ బ్రేక్ చేసింది.

దేశ రాజకీయాల్లో ఏ పార్టీ అధినేత అయినా అరెస్టైతే ముఖ్యమంత్రి కావడం ఖాయమనిపిస్తోంది. ఇప్పడు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత అది నిజమనిపిస్తోంది. జార్ఖండ్ ముక్తి మోర్చాతో పాటు ఇండియా కూటమి దూసుకుపోతోంది. అయితే కాంగ్రెస్ కూటమి మాత్రం ఇక్కడ గెలవడానికి హేమంత్ సోరెన్ ప్రధాన కారణంగా చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. జార్ఖండ్‌లో జేఎంఎం కూటమి విజయానికి రెండు అంశాలు కలిసొచ్చాయని చెప్పొచ్చు. జేఎంఎం-కాంగ్రెస్ కూటమికి ఈ రెండు కూడా ఎన్నికల్లో బ్రహ్మాస్ట్రాలుగా పనిచేశాయి. ఇందులో ఒకటి సీఎం మయ్యా యోజన కింద మహిళలకు నెలకు రూ.2,500 సాయం అందివ్వడం. రెండోది హేమంత్ సోరెన్‌ను జైలుకు పంపడం కూడా ప్రజల్లో సెంటిమెంట్ రాజేసింది.

హేమంత్ సోరెన్ అరెస్ట్ ఈ ఎన్నికల్లో బాగా కలిసొచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బొగ్గు గనుల కుంభకోణం, మనీ ల్యాండరింగ్ కేసులో ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కొన్ని నెలల పాటు జైలులో ఉన్నారు. జైలు నుంచి వచ్చిన తర్వాత తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే అప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంపై సోరెన్‌ బీజేపీలో చేరారు. బీజేపీలోకి వెళ్లేందుకు చంపై సోరెన్ చేసిన ప్రయత్నాలు కూడా ప్రజల్లో వ్యతిరేకతను పెంచాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అన్యాయంగా హేమంత్ సోరెన్‌ను రాజకీయ కక్షతోనే జైల్లో పెట్టారని ప్రజలు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది.

ఏపీలో గత ఎన్నికల కంటే ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో 52 రోజుల పాటు జైల్లో ఉన్నారు. ఆ వయస్సులో చంద్రబాబు జైలుకెళ్లడం, పైగా కావాలనే జగన్ కక్ష కట్టి చంద్రబాబును జైల్లో పెట్టారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అందుకే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని భారీ మెజార్టీతో గెలిపించారు. వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. చంద్రబాబు అరెస్ట్ ఏపీ ఎన్నికల్లో ప్రభావం చూపిందన్న విశ్లేషణలు వచ్చాయి. అదే కూటమి పార్టీలకు కలిసి వచ్చిందన్నారు రాజకీయ విశ్లేషకులు. గతంలో కూడా జగన్ జైలుకెళ్లడం.. ఆ తర్వాత పాదయాత్ర చేయడం.. ఆయన సీఎం కావడానికి కలిసొచ్చాయని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు.

ఇప్పడు హేమంత్ సోరెన్‌ విషయంలో కూడా జైలు సెంటిమెంట్ వర్కౌట్ అవడంతో ఈ చర్చ మరోసారి తెరపైకొచ్చింది. ఇదే విషయమై విశ్లేషకులు మరో మాట కూడా చెబుతున్నారు.రాజకీయ ప్రత్యర్థులను జైల్లో పెడితే స్వల్పకాలికంగా ఆనందం పొందవచ్చేమో కానీ.. ఆ తరువాత జరిగే ఎన్నికల్లో మాత్రం వారికే భారీ ప్రయోజనం దక్కుతుందని తరచుగా వస్తోన్న ఇలాంటి ఫలితాలు నిరూపిస్తున్నాయనేది వారి అభిప్రాయం.

Tags:    

Similar News